సి.ఇ.ఓ. పాఠాలు

ఘనమైన వారసత్వం లేదు. తల పండిన అనుభవజ్ఞుడేం కాదు. అయితే ఏంటట? దిగ్గజ టెక్‌ కంపెనీ ట్విటర్‌కి పరాగ్‌ అగర్వాల్‌ ఇప్పుడు సీఈవో. ఆ సంస్థకి మనోడిపై ఎందుకంత నమ్మకం? అంటే...

Updated : 04 Dec 2021 05:06 IST

ఘనమైన వారసత్వం లేదు. తల పండిన అనుభవజ్ఞుడేం కాదు. అయితే ఏంటట? దిగ్గజ టెక్‌ కంపెనీ ట్విటర్‌కి పరాగ్‌ అగర్వాల్‌ ఇప్పుడు సీఈవో. ఆ సంస్థకి మనోడిపై ఎందుకంత నమ్మకం? అంటే...

* వంద శాతం: ముప్ఫై ఏడేళ్ల వయసులోనే ప్రపంచస్థాయి కంపెనీకి సీఈవో కావడం మాటలు కాదు. అయితే పరాగ్‌కి ఇది ఒక్కరోజులో దక్కిన విజయం కాదు. అంచెలంచెలుగా ఎదిగాడు. తను పదేళ్ల కిందటే ట్విటర్‌లో చేరాడు. అదీ మామూలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా. అప్పట్నుంచి పనికే అంకితమయ్యాడు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. 2018లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.  ఏ పని అప్పజెప్పినా వందశాతం మనసు పెట్టి చేయడం పరాగ్‌ నైజం.

* ఆగిపోలేదు: ఐఐటీ బొంబాయి దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. దాన్నుంచి పట్టా అందుకోగానే కార్పొరేట్‌ సంస్థలు అగర్వాల్‌కి వెల్‌కమ్‌ పలికాయి. భారీ జీతం ఆఫర్‌ చేశాయి. అంతటితో సర్దుకుపోయే రకం కాదు తను. ఇంకా అర్హతలు పెంచుకోవాలనుకున్నాడు. దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలోనే కాదు.. ప్రపంచంలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

* ఎంత ఎదిగినా: చదువు, ప్రతిభ, కష్టపడేతత్వం.. అన్నింట్లోనూ ముందే. ట్విటర్‌లో చేరిన కొత్తలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌లో అత్యంత ప్రతిభ చూపేవాడు. లెక్కలేనన్నిసార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డులందుకున్నాడు. ఇంత చేసినా తనలో గర్వం ఇసుమంతైనా ఉండదు. కిందిస్థాయి ఉద్యోగులతో ప్రేమగా ఉంటాడు. సీనియర్లను గౌరవిస్తాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొనిపోయే రకం. ఈ లక్షణాలే ట్విటర్‌ అధిపతి జాక్‌ డోర్సీ పరాగ్‌కి పట్టం కట్టబెట్టేలా చేశాయట.


* లక్ష్యం స్పష్టం: పరాగ్‌కి చిన్నప్పట్నుంచే టాప్‌లో ఉండటం అలవాటు.. అది ఒక స్పష్టమైన లక్ష్యం. దానికి తగ్గట్టే ముంబయిలోని మంచి విద్యాసంస్థల్లో చదివాడు. క్లాసులో టాపర్‌. ఐఐటీ-జేఈఈలో ఆలిండియా 77వ ర్యాంకు సాధించాడు. 2001లో ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌. పీహెచ్‌డీ పూర్తవగానే మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌, యాహూ, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌లాంటి అత్యుత్తమ కంపెనీల్లోనే ఇంటర్న్‌గా పని చేశాడు. ట్విటర్‌ భవిష్యత్తు   ఊహించి అందులోకి మారిపోయాడు. చివరికి తన లక్ష్యం చేరాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు