ప్రయత్నిద్దాం యార్‌

శ్రద్ధ... వాళ్ల అమ్మానాన్న ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు గానీ... నా శ్రద్ధంతా ఎప్పుడూ తనమీదే ఉండేది. తనంటే నాకు పదో తరగతి నుంచి ఇష్టం. ఒకసారి తన నోట్‌బుక్‌ తీసుకొని ఐ లవ్‌ యూ అని రాసిచ్చాను. తను నన్ను పిలిచి... ‘నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ముందు బాగా చదువుకో’ అని చెప్పింది...

Published : 06 Jul 2019 00:23 IST

శ్రద్ధ... వాళ్ల అమ్మానాన్న ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు గానీ... నా శ్రద్ధంతా ఎప్పుడూ తనమీదే ఉండేది. తనంటే నాకు పదో తరగతి నుంచి ఇష్టం. ఒకసారి తన నోట్‌బుక్‌ తీసుకొని ఐ లవ్‌ యూ అని రాసిచ్చాను. తను నన్ను పిలిచి... ‘నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. ముందు బాగా చదువుకో’ అని చెప్పింది. నా మీద కోప్పడలేదు. వాళ్లింట్లో చెప్పి గొడవ చేయలేదు. నేను పదికి పది పాయింట్లు తెచ్చుకొని పాసయ్యాను. మళ్లీ ప్రపోజ్‌ చేశాను. ‘నువ్వంటే నాకిష్టమే... అయితే అది ప్రేమ కాదు’ అంది. ఇంటర్‌లో నన్ను విజయవాడ హాస్టల్లో చేర్చారు. రెండేళ్లు... ఎప్పుడు అయిపోతాయా? అని ఎదురుచూశాను. దసరాకు, సంక్రాంతికి ఇచ్చిన సెలవుల్లో తన   ఇంటిచుట్టూ ఎన్నిసార్లు తిరిగానో! కానీ తను ఎప్పుడో ఒక్కసారి కన్పించేది. నవ్వేది. ఆ నవ్వే నాకు మళ్లీ సెలవులు వచ్చేదాక ఊపిరి. అలా ఇంటర్‌ అయిపోయింది. ఈ సారి మా క్లాస్‌మేట్‌ సృజన ద్వారా తనకు విషయం చెప్పించాను. తను ఒప్పుకోలేదు. నాకు మంచి కాలేజీలో ఇంజినీరింగ్‌ సీటు వచ్చింది. వెళ్లక తప్పలేదు. నేను చెన్నై వెళుతూ తనకు కన్పించాను. తను నన్ను చూసి కంగ్రాట్స్‌ అని చేయి కలిపింది. ఆ స్పర్శ నన్ను నాలుగేళ్లు బతికించింది. చెన్నైలో ఎంతో మంది అమ్మాయిలు... ఎవరి మీద నాకు ప్రేమ కలగలేదు. నా ఊహల్లో ఎప్పుడూ శ్రద్ధే ఉండేది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌... ఇలా అన్నింట్లో తనని రోజూ పలకరించేవాడ్ని. మా మెసేజ్‌లు, మాటలు, చర్చలు అన్నింటికి సోషల్‌ మీడియానే వేదికయ్యేది. ఊరికి వచ్చినప్పుడు తను కన్పిస్తే మెరిసిపోయే నా కళ్లు ఇంకెప్పుడూ అంత ఉత్సాహంతో ఉండవు. నేను ఎప్పుడు ప్రేమ గురించి మాట్లాడినా... తను చిరు కోపం ప్రదర్శించేది. నేను ఆగిపోయేవాడ్ని. చివరికి ఇంజినీరింగ్‌ ఫైనలియర్లో క్యాంపస్‌ సెలెక్షన్లలో విప్రోలో ఉద్యోగం వచ్చింది. ఫైనల్‌ సెమిస్టర్‌కు ముందు గట్టిగా  నా మనసులో మాట చెప్పాలని నిర్ణయించుకున్నా. తనుంటున్న హైదరాబాద్‌కు వచ్చాను. ‘నిన్ను కలవాల’ని వాట్సప్‌ మెసేజ్‌ పంపాను. ‘ఏంటి? సడన్‌గా’ అంది.. ‘చాలా ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి’ అన్నా. ఇద్దరం శిల్పారామంలో కలుసుకున్నాం. దాదాపు రెండు గంటలు... ఇంత సేపు ఎవరూ ఏ అమ్మాయికి ప్రపోజ్‌ చేసి ఉండరు. చిన్నప్పటి నుంచి తనమీద నాకు కలిగిన ఫీలింగ్స్‌ అన్నీ చెప్పి... ‘ఐ లవ్‌ యూ’ చెప్పాను. తను నా కళ్లలోకి చూసింది... ‘మా ఇంట్లో వచ్చి అడుగు  పెళ్లి చేసుకుందాం’ అంది. ‘మరి ఎందుకు ఇన్ని రోజులు నా ప్రేమను అంగీకరించలేదు?’ అన్నాను. ‘మొదట నీ మీద నాకు ప్రేమ లేదు. తర్వాత, తర్వాత అది ప్రేమగా మారింది. అయినా ఈ ప్రేమలో పడి... మనం సమయం వృథా చేసుకోకూడదని’ అంది. తన స్పష్టత, దూరదృష్టి నన్ను మరింతగా తన ప్రేమలో ముంచేశాయి. నేను ముందు విషయం మా ఇంట్లో చెప్పాను. మా వాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లది వేరే కులం వద్దన్నారు. శ్రద్ధ వాళ్లింటికి వెళ్లి... వాళ్ల నాన్నతో మాట్లాడాను. ఆయనా కుదరదన్నారు. వాళ్ల అమ్మ మా ప్రేమ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నా... మిగతా ఎవ్వరూ అంగీకరించలేదు. కారణం ఒక్కటే కులం. మళ్లీ, మళ్లీ ఇద్దరి ఇళ్లలోనూ చెప్పాం. వాళ్ల మనసులు కరగలేదు. తనకి వేరే పెళ్లి ఏర్పాట్లు చేశారు. ‘ఇలాగే ఉండిపోతాను గానీ నేను వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోను’ అని శ్రద్ధ వాళ్లింట్లో బల్లగుద్ది మరీ చెప్పింది. తను ముంబయిలో జాబ్‌ చేస్తోంది. నేను చెన్నైలోనే ఉద్యోగం చేసుకుంటున్నా. ఇలా మా ఇళ్లలో మా  ప్రేమ గురించి తెలిసి... ఇప్పటికి ఏడు సంవత్సరాలైంది. అయినా మేం ఎక్కడా విసుగు చెందలేదు. నిరాశ పడలేదు. ఇంకా ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్లు ఒప్పుకొనే దాకా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే... ఇంట్లో ఒప్పుకోలేదని, చెబితే ఒప్పుకోరని ప్రేమికులు కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. మనం చనిపోతే మన ప్రేమ పెద్దలకు ఎలా తెలుస్తుంది? కొన్నిరోజులు ఏడ్చి మరిచిపోతారు? మన ప్రేమ వాళ్లకు తెలియాలంటే.. మనం ప్రదర్శించాలి. మనం ప్రదర్శించాలంటే బతికుండాలి. అందుకే గట్టిగా ఉండండి. పెద్దలు ఒప్పుకొనేదాక ప్రయత్నించండి.

- శ్రద్దా - నీరజ్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని