మాటలు రాయడం.. మాటలేం కాదు!

చదివింది ఇంగ్లిష్‌ మాధ్యమం.. మనసేమో మాతృభాషపై. పద్దెనిమిదేళ్లకే క్రైం థ్రిల్లర్‌ పుస్తకం రాశాడు... అది సినిమాకి దారి చూపింది, రచయితగా మార్చింది. దాంతో లక్షల జీతమొచ్చే కొలువు వదిలాడు..

Updated : 01 Jan 2022 05:33 IST

చదివింది ఇంగ్లిష్‌ మాధ్యమం.. మనసేమో మాతృభాషపై. పద్దెనిమిదేళ్లకే క్రైం థ్రిల్లర్‌ పుస్తకం రాశాడు... అది సినిమాకి దారి చూపింది, రచయితగా మార్చింది. దాంతో లక్షల జీతమొచ్చే కొలువు వదిలాడు.. ‘తగ్గేదే లే’ అంటూ వరుసపెట్టి పలు చిత్రాలకు కథ, మాటలు రాస్తున్నాడు... అతడే కాకినాడ యువకుడు శ్రీకాంత్‌ విస్సా... కలంతో సాగిస్తున్న తన కలల ప్రయాణం గురించి ఈతరంతో పంచుకున్నాడు.

నాకు రాతపై ఆసక్తి కలగడానికి మా ఇంటి వాతావరణమే కారణం. నాన్న అప్పట్లోనే బాగా చదువుకున్నారు. రాసేవారు కూడా. అన్నయ్య, అక్కయ్యలకీ ఆ అలవాటుండేది. నేను పెద్దగా పుస్తకాలు చదవలేదుగానీ రాయాలనే తపన ఉండేది. ఎంసెట్‌ రాసి కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ‘విరోధి’ అనే క్రైం థ్రిల్లర్‌ నవల రాశా. అన్నయ్యకి చూపిస్తే మెచ్చుకొని ‘నువ్వు మంచి రచయిత కావాలంటే ముందు బాగా చదవాలి’ అన్నారు. అప్పట్నుంచి కనపడ్డ పుస్తకమల్లా అందుకున్నా. ఈలోపు నా రచనని ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కోకి పంపించా. నెలనెలా ఫోన్‌ చేస్తే.. ‘చూద్దాం’, ‘వేద్దాం’ అనేవారు. ఎనిమిది నెలల తర్వాత పబ్లిషర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. వెళ్లి కలిస్తే నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘నీకు మైనారిటీ తీరిందా?’ అనడిగారు. ఈమధ్యే పద్దెనిమిది నిండాయని చెప్పగానే పుస్తకం అచ్చు వేశారు.

ఉద్యోగమే దారి చూపింది

బీటెక్‌ అయిపోగానే జాబ్‌లో చేరా. విప్రో, గూగుల్‌, హెచ్‌పీ.. ఇలా పెద్దపెద్ద కంపెనీల్లో పని చేశా. డబ్బులకి కొరత లేదు. 2013లో వర్క్‌ ఫ్రం హోమ్‌ ఇచ్చారు. షిఫ్టుల్లేవు. నాకిచ్చిన పని అప్పజెపితే చాలు. బోలెడంత సమయం మిగిలేది. మళ్లీ నాలో రచయిత నిద్ర లేచాడు. ఈసారి సినిమా కోసమని ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథ రాసుకున్నా. మా బంధువు ద్వారా కొండా కృష్ణంరాజు గారిని కలిసి కథ చెప్పా. ‘బాణం’ దర్శకుడు చైతన్య దంతలూరి దగ్గరికి పంపారు. ఆయనకది బాగా నచ్చింది. ‘నేను బసంతి అనే సినిమా చేస్తున్నా. దానికి నువ్వే మాటల రచయితవి’ అన్నారు. అలా నా ప్రణం మొదలైంది.

సినిమా కష్టాలు...

2014లో తొలి సినిమా విడుదలైంది. డైలాగ్స్‌కి మంచి పేరొచ్చింది.. అవకాశాలూ రాసాగాయి. ఓవైపు నాకిష్టమైన ప్రవృత్తి.. మరోవైపు ఉద్యోగం. రెండు పడవల ప్రయాణం అసౌకర్యంగా అనిపించింది. 2015 ఆగస్టులో లక్షన్నర జీతం వచ్చే ఉద్యోగం మానేశా. నాకు అంతకుముందే పెళ్లైంది. నా భార్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. నాకు సినిమా అవకాశం రాగానే నాకన్నా ముందే తను మానేసింది. ‘ఇది వర్కవుట్‌ కాకపోతే నేను హ్యాండిల్‌ చేస్తాలే’ అని భరోసా ఇచ్చింది. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటుండగా ఓ కుదుపు. నేను పని చేసిన రెండు సినిమాలు ఆగిపోయాయి. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే సినిమా ‘కిక్‌’కి అలవాటుపడ్డా. మళ్లీ కొలువుకు వెళ్లే పరిస్థితి లేదు. ఒకానొక సమయంలో నా ఖాతాలో 146 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే దర్శకుడు సుకుమార్‌ ఆదుకున్నారు.

సుకుమార్‌ పరిచయం

‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ దర్శకుడి ద్వారా నేను సుకుమార్‌ గారిని కలిశా. చిత్రమైన విషయం ఏంటంటే.. ఆయన నాకు గురువు. కాకినాడ ఆదిత్య కాలేజీలో ఇంటర్‌ చదివినప్పుడు పాఠాలు చెప్పేవారు. మేం కలిసినప్పుడు ఆ సంగతులు గుర్తు చేసి, నా వివరాలు చెప్పా. ‘తర్వాత మనం సినిమా చేద్దాం’ అంటూ నా చేతిలో లక్ష రూపాయల చెక్‌ పెట్టారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ డబ్బులు ఉపయోగపడ్డాయి. తర్వాత ఆయనతో కలిసి ‘రంగస్థలం’కి కొన్నాళ్లు, ‘పుష్ప’కి పూర్తిగా పనిచేశాను.

తేలికేం కాదు..

నా దృష్టిలో కథ, మాటల రచయితలకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. ఒక సినిమా షూటింగ్‌ మొదలయ్యాకే కెమెరామెన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ల పాత్ర మొదలవుతుంది. కొంచెం ముందుకెళ్లాక సంగీత దర్శకుడు వస్తాడు. కానీ ఫిల్మ్‌కి ఒక రూపాన్ని ఊహించుకోవడం దగ్గర్నుంచి షూటింగ్‌ పూర్తై, విడుదలయ్యే వరకూ కథకుడు, మాటల రచయిత పాత్ర ఉంటుంది. ఒక్కో చిత్రానికి పది నుంచి పదిహేను వెర్షన్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి చిత్రంలోని పాత్రలకు అనుగుణంగా వేర్వేరు ప్రాంతాల యాస కూడా నేర్చుకోవాలి. దర్శకుడు, హీరోలకు డైలాగులు నచ్చాలి. రచయిత లొకేషన్‌లో ఉండాలి. డబ్బింగ్‌ వినాలి. ఎడిటింగ్‌ చూడాలి. ఒక్కోసారి నటులు.. రచయిత నుంచి ఎంతో ఆశిస్తారు. వెంకీమామకి పని చేసినప్పుడు.. ‘శ్రీకాంత్‌ ఇందులో కొత్తదనం ఏముంది? ఇంకా కావాలి.. ఛాలెంజింగ్‌గా ఉండాలి’ అనేవారు వెంకటేశ్‌. అలాంటప్పుడు మనలోని ప్రతిభ బయటికొస్తుంది. ఆ సినిమాలో వెంకటేశ్‌, ప్రకాశ్‌రాజ్‌ మధ్య జరిగే ఒక్క సన్నివేశానికి ఇరవై రకాల డైలాగులు రాశాను. అలాగే పుష్ప సినిమా కోసం రెండేళ్లు పని చేశా. అందుకే మాటలు, కథ రాయడమంటే మాటలు కాదు.


* ఫిక్షన్‌, నాన్‌ ఫిక్షన్‌.. అన్ని పుస్తకాలు చదువుతా.
* ఫ్రెడరిక్‌ ఫోర్సిత్‌ బాగా నచ్చిన రచయిత
* దర్శకత్వం చేయడమే లక్ష్యం
* ఇష్టపడే మాటల రచయిత జంధ్యాల


మనం మారాలి

ఈరోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోతోంది. పుస్తకాలు రాసి, అచ్చు వేయించి దానిమీద సంపాదించే వారు అరుదైపోయారు. ఇది మారాలి. ఒక రచయిత తను జీవితకాలంలో సంపాదించిన జ్ఞానం, అనుభవాలు, పరిశీలనలన్నీ ఒక పుస్తకంలో రాస్తాడు. అది చదివితే ఆయన జీవితకాలాన్ని చదివినట్టే. మన భావం లోతుగా ఉండాలంటే, అభిప్రాయం స్పష్టంగా చెప్పాలంటే.. వీలైనంత ఎక్కువగా చదువుతుండాలి. నా దగ్గరకు ఎవరు వచ్చినా.. ‘పుస్తకాలు చదివే అలవాటు ఉందా?’ అని అడుగుతా.


చేసినవి, చేయబోతున్నవి

* బసంతీ * కిట్టూ ఉన్నాడు జాగ్రత్త * ఎంసీఏ * వెంకీ మామ * పుష్ప * డెవిల్‌ * రావణాసుర * ఖిలాడీ * భళా తందనాన * టైగర్‌ నాగేశ్వరరావు * 18 పేజెస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని