గడ్డం గ్యాంగ్‌ సేవకి సై..

నాలుగేళ్ల కిందట మొదలైందీ క్లబ్‌. ‘బియర్డ్‌ ఫర్‌ ఏ రీజన్‌’ అనేది నినాదం. విషయం ఇక్కడే అర్థమైపోతుంది కదూ! ఔను.. సమాజానికి సేవ చేయడం. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే వీళ్ల లక్ష్యం.

Updated : 29 Jan 2022 05:37 IST

కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకుంటారు?
మ్యాన్లీ లుక్‌ కోసం...
సొగసుగా కనిపించడానికి...
అలాగైతేనే మేం బాగుంటాం కాబట్టి...
ఇలా ఎవరి సాకులు వారివి.. ఎవరి సోకులు వారివి!
‘చెన్నై బియర్డెడ్‌ క్లబ్‌’లో ఉన్న ఆరున్నర వేలమందిది మాత్రం వేరే కథ. అదేంటో తెలుసుకుందామా...

నాలుగేళ్ల కిందట మొదలైందీ క్లబ్‌. ‘బియర్డ్‌ ఫర్‌ ఏ రీజన్‌’ అనేది నినాదం. విషయం ఇక్కడే అర్థమైపోతుంది కదూ! ఔను.. సమాజానికి సేవ చేయడం. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే వీళ్ల లక్ష్యం.

షేక్‌ షిహబుద్దీన్‌ది ఈ జట్టులో మొదటి అడుగు. కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా గడ్డం పెంచడం మొదలుపెట్టాడు తను. ఆసక్తి ఉన్నవాళ్లందరినీ ఒక్కచోటికి చేర్చి తర్వాత ఓ గ్రూప్‌ ప్రారంభించాడు. ‘గడ్డం పెంచితే ఏమొస్తుంది?’ ‘పోజు కొట్టడానికేగా?’, ‘మీరేమైనా ప్రేమలో ఫెయిలయ్యారా?’, దేవదాసు స్టైలా?’.. ఇలాంటి విమర్శలు చాలా వచ్చేవి. అందుకే ఈ ప్యాషన్‌కి ఓ సదాశయం జోడించాలనుకున్నారు సభ్యులు. షేవింగ్‌ ఖర్చులు తగ్గితే కొంతమొత్తం మిగులుతుంది. దానికి ఇంకొంత జమ చేసి సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. వృద్ధులు, ఆపన్నులకు అవసరమైన సామగ్రి అందించడం.. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం.. ఇలా. కొద్దిరోజుల్లోనే ఈ గడ్డం గ్యాంగ్‌ మంచి మనసున్నవాళ్లు అని పేరు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమాలు విస్తృతం చేయడానికి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. చేయబోయే సేవలు, సందేహాలు, చర్చలు.. అన్నీ వాటిలోనే. మూడు సెంటీమీటర్లకుపైగా బియర్డ్‌ పెరిగినవాళ్లనే సభ్యులుగా చేర్చుకుంటున్నారు. అన్నట్టు నెలకోసారి జూమ్‌ మీటింగ్‌లు పెట్టుకొని గడ్డం బాగా పెరగడానికి ఏం చేయాలో చర్చించుకుంటారు. ఏడాదికోసారి ఫ్యాషన్‌ షో కూడా నిర్వహిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని