తొలిచూపు.. బీఎఫ్‌ఎఫ్‌!

కళ్లూకళ్లూ కలుసుకుంటే.. గుండెల్లో గోల మొదలైతే.. అమ్మాయి, అబ్బాయి టపీమని ప్రేమలో పడిపోతాడు. ఇది ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’. అలా తొలిచూపులోనే వలపు వలలో బందీ అవడం ఎంత

Updated : 26 Feb 2022 06:05 IST

కళ్లూకళ్లూ కలుసుకుంటే.. గుండెల్లో గోల మొదలైతే.. అమ్మాయి, అబ్బాయి టపీమని ప్రేమలో పడిపోతాడు. ఇది ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’. అలా తొలిచూపులోనే వలపు వలలో బందీ అవడం ఎంత నిజమో.. తొలి పరిచయంలోనే బెస్ట్‌ ఫ్రెండ్‌ ఫరెవర్‌ (బీఎఫ్‌ఎఫ్‌) అయిపోవడానికీ అంతే అవకాశం ఉందంటున్నారు మానసిక పరిశోధకులు. ఏంటా కథ?

క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కి, ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టిన నీరజ్‌ పాండేకి ముందు అస్సలు పరిచయమే లేదు. ఓ అవార్డుల కార్యక్రమంలో కలిశారు. తొలి పరిచయంలోనే ఒకరినొకరు అద్దంలో చూసుకుంటున్నట్టు అనిపించిందట. ‘నీరజ్‌ది ముక్కుసూటి మనస్తత్వం. ముసుగు వేసుకోవడాలుండవు. మనసులో ఉన్నది మాటగా బయటికొస్తుంది. అచ్చం నాలాగే’ అంటాడు రిషబ్‌. ‘నాకు లాంగ్‌డ్రైవ్‌లకి వెళ్లడం ఇష్టం. సరదాగా ఉండేవాళ్లంటే ఇష్టం. అందుకే రిషబ్‌ తెగ నచ్చేశాడు’ అన్నది నీరజ్‌ మాట. వాళ్లిద్దరిప్పుడు ‘బ్రొమాన్స్‌’లో ఉన్నారు. ఇలాంటి తొలి పరిచయపు గాఢమైన స్నేహాలు తారలకే పరిమితం కాదు. కాలేజీ ఫ్రెషర్స్‌ పార్టీలో.. కొత్త ఉద్యోగంలో.. అకస్మాత్తుగా వచ్చిపడే వేడుకల్లో.. ఎక్కడైనా, ఎప్పుడైనా నచ్చిన నేస్తం తారస పడొచ్చు. ఇది ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు బాస్‌! కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలోనూ తేలింది. ఆ సర్వే ప్రకారం ఒక అమ్మాయి, అబ్బాయిని చూడగానే, మాట కలపగానే మెదడులో ఒక రకమైన సంకేతాలు వెలువడుతాయట. వాళ్ల మాట, నడవడిక, పద్ధతి, మాట తీరు, అభిప్రాయం, ఆలోచనలు నచ్చుతుంటే అవతలి వ్యక్తిని బెస్ట్‌ఫ్రెండ్‌ జాబితాలో చేర్చుకోవచ్చని ఓ నిర్ణయానికొచ్చేస్తామట. అంటే తొలిచూపు ప్రేమలాగే తొలిచూపు స్నేహం అన్నమాట.

మొదటి పరిచయంలోనే..

ఫ్రెండ్‌ భవ్యతో కలిసి ఓసారి సినిమాకెళ్లా. వాళ్ల ఫ్రెండ్‌ కృష్ణతో వచ్చింది తను. సినిమా చూస్తున్నంతసేపూ నా కాళ్లు భూమ్మీద ఆగవు. గోలగోల చేయాల్సిందే. నా స్నేహితురాలేమో నోరు తెరవదు. నేను అల్లరి చేస్తే తను ఎక్కడ నొచ్చుకుంటుందో అనుకొని కామ్‌గా ఉండిపోయా. తెరపై హీరో ఎంట్రీ అవుతుండగా పెద్దగా ఈల వేశాడు కృష్ణ. ‘జై బాలయ్యా’ అంటూ అరిచాడు. ఒక్కసారిగా నా మొహం వెలిగిపోయింది. మూడు గంటలపాటు ఇద్దరం కలిసి చప్పట్లు, ఈలలు, అరుపులతో రచ్చ చేశాం. తర్వాత ఇద్దరం కలిసి గల్లీలో క్రికెట్‌ ఆడాం. చెట్లు ఎక్కి ఎంజాయ్‌ చేశాం. అలా తొలి పరిచయం నుంచే మేం బెస్టీలమయ్యాం.

- రిషిత, బీటెక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని