కొలువు వదిలి అడవి సృష్టించాడు

ఏసీ గది.. ఐదంకెల్లో వేతనం... అడిగింది క్షణాల్లో చేసిపెట్టే నౌకర్లు... ఇంత సుఖమయమైన జీవితాన్ని ఎవరు వదులుకుంటారు? బెంగళూరు యువకుడు వరుణ్‌ రవీంద్ర వదులుకున్నాడు. తండ్రి

Updated : 26 Feb 2022 06:07 IST

ఏసీ గది.. ఐదంకెల్లో వేతనం... అడిగింది క్షణాల్లో చేసిపెట్టే నౌకర్లు... ఇంత సుఖమయమైన జీవితాన్ని ఎవరు వదులుకుంటారు? బెంగళూరు యువకుడు వరుణ్‌ రవీంద్ర వదులుకున్నాడు. తండ్రి ఆశయం కోసం గ్రామాల బాట పడుతూ ఏకంగా అడవినే సృష్టించాడు.

వరుణ్‌ నాన్నకి ప్రకృతిపై అంతులేని మమకారం. మూగప్రాణులంటే చెప్పలేనంత ప్రేమ. వాటినే వారసత్వంగా అందుకున్నాడు వరుణ్‌. అప్పుడప్పుడు తండ్రికి సాయంగా వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. రోజురోజుకీ తరిగిపోతున్న అటవీ సంపద, పెరిగిపోతున్న కాలుష్యంపై తరచూ ఆవేదన చెందేవారు అరుణ్‌ నాన్న. అది అరుణ్‌ని ఆలోచనలో పడేసింది. ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ని ఆపేలా తనవంతు ఏదో చేయాలనే ఆలోచన మొదలైంది. 2016లో ‘వనంతర’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాడు. పర్యావరణాన్ని కాపాడటం, అడవులు పెంచడమే దాని ఏకైక ఎజెండా. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కొంత భూమి కొనుగోలు చేసి అందులో మొక్కలు నాటడం ప్రారంభించాడు. కొద్దిరోజుల్లోనే అతడి సదాశయానికి మరిన్ని చేతులు జతయ్యాయి. అలా కొద్దికొద్దిగా పెంచుకుంటూ మొత్తానికి వంద ఎకరాలకు తీసుకెళ్లాడు. అందులో రకరకాల మొక్కలు పెంచి ఆరేళ్లలో చిన్నపాటి అడవినే సృష్టించాడు. ఇప్పుడది నలభైవేల చెట్లు, వృక్షాలు, 250 రకాల పక్షులు, జంతుజాలానికి ఆలవాలంగా మారింది. వనంతర బృందం ఈ ఒక్క విజయంతో ఆగిపోలేదు. తమలాంటి సదాశయంతో ఎవరు ముందుకొచ్చినా, బీడు పడిన భూముల్లో పచ్చదనం వెల్లివిరిసేలా చేస్తున్నారు. నర్సరీలు పెట్టి ఉచితంగా మొక్కలు పంచుతున్నారు. పార్కులు తీర్చిదిద్దుతున్నారు. వర్మీకంపోస్ట్‌లాంటి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. వరుణ్‌ కష్టం ఫలితంగా వందల ఎకరాల్లో నేలతల్లి పచ్చని చీర చుట్టుకుంటోంది. చుట్టుపక్కల శ్రామికులు ఉపాధి పొందుతున్నారు. ఈ సత్సంకల్పం కోసం వరుణ్‌ లక్షల జీతమొచ్చే కొలువు సైతం వదులుకున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని