రన్‌.. రమేష్‌ రన్‌

పేదరికం అందరికీ పాఠాలు నేర్పితే.. రాజమహేంద్రవరం యువకుడు ఉందుర్తి రమేష్‌కి మాత్రం పరుగు నేర్పింది. తండ్రి మరణం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. ఇవేవీ తన పరుగుకు కళ్లెం వేయలేేక పోయాయి. దేనికీ వెరవని ఆ సంకల్పమే రికార్డులు, అరుదైన ఘనతలు అందుకునేలా చేశాయి.

Updated : 19 Mar 2022 04:29 IST

పేదరికం అందరికీ పాఠాలు నేర్పితే.. రాజమహేంద్రవరం యువకుడు ఉందుర్తి రమేష్‌కి మాత్రం పరుగు నేర్పింది. తండ్రి మరణం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. ఇవేవీ తన పరుగుకు కళ్లెం వేయలేేక పోయాయి. దేనికీ వెరవని ఆ సంకల్పమే రికార్డులు, అరుదైన ఘనతలు అందుకునేలా చేశాయి. తాజాగా 140 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ముగించి మరోసారి అందరితో శెభాష్‌ అనిపించుకున్నాడు.

మేష్‌ది పేద కుటుంబం. చిన్నతనంలోనే పరుగు నేస్తమైంది. పాఠశాల నుంచి జాతీయస్థాయి దాకా పతకాలు గెలిచేలా చేసింది. రమేష్‌ తండ్రి ఆటోడ్రైవరు. రెండేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయారు. తల్లి ఆరోగ్యమూ అంతంతే. ఆదుకునేవాళ్లు లేరు. కొందరు ఆపన్నహస్తం అందివ్వడంతో అనపర్తి వెళ్లాడు. అక్కడే డిగ్రీ చదువుతున్నాడు. అధ్యాపకులు, సిబ్బంది రమేష్‌ ప్రతిభ గుర్తించి అక్కడే ఉండేందుకు వసతులు సమకూర్చారు. ఆర్థికంగా ఆదుకున్నారు. అక్కడే సాధన చేస్తూ విద్యార్థులకు దేహదారుఢ్యం, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం అతడి లక్ష్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవడం. దానికోసం ఐదు కేజీల బరువు వీపున వేసుకొని ఉదయం ఇసుక తిన్నెల్లో, సాయంత్రం మైదానంలో పరుగెడుతాడు. దేహదారుఢ్యం, కండరాల పరిపుష్ఠి కోసం వ్యాయామాలు చేస్తున్నాడు.

140 కి.మీ.లు ఉఫ్‌: గతంలో ఓ యువకుడు 100కి.మీ.ల మారథాన్‌ని 11 గంటల్లో పూర్తి చేశాడు. ఈ రికార్డు బద్దలు కొట్టే లక్ష్యంతో మూడేళ్ల నుంచి శ్రమిస్తున్నాడు రమేష్‌. రెండేళ్ల క్రితం 100కి.మీ.ల దూరాన్ని 9 గంటల 20 నిమిషాల్లో చేరుకుని అనుకున్నది సాధించాడు. అదే స్ఫూర్తితో ఈనెల 9వ తేదీన 140కి.మీ.ల దూరాన్ని 13గంటల్లో పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇక 160కి.మీ.ల దూరాన్ని 18 గంటల్లో పూర్తి చేసి జాతీయస్థాయి రికార్డుపై దృష్టి పెట్టానంటున్నాడు. ఇదికాకుండా 2019లో ఐదు కి.మీ.ల పరుగు పందెంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించాడు. 2014-16లలో నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆలిండియా సెలెక్షన్లలో 12కి.మీ క్రాస్‌ కంట్రీ, ఐదు, పది, ఇరవై ఒక్క కిలోమీటర్ల పందేల్లో విజేతగా నిలిచాడు. 2019-20లో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు.

- ఉప్పాల రాజాపృథ్వీ, రాజమహేంద్రవరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని