వైఫల్యాలతో వేలాడొద్దు..

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకుడు. తీరిక లేకుండా ఉన్నా వీలు చేసుకొని మరీ సామాజిక సమస్యలు, సమకాలీన అంశాలపై వ్యంగ్యాస్త్రాలు, సరదా ట్వీట్లు సంధిస్తుంటారు.

Updated : 26 Mar 2022 05:21 IST

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకుడు. తీరిక లేకుండా ఉన్నా వీలు చేసుకొని మరీ సామాజిక సమస్యలు, సమకాలీన అంశాలపై వ్యంగ్యాస్త్రాలు, సరదా ట్వీట్లు సంధిస్తుంటారు. ఆయనే మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా. యువతకు ఆయన చెబుతున్నపాఠాలేవీ అంటే...

వేలాడొద్దు: వ్యాపారం, కెరియర్‌లో మళ్లీమళ్లీ విఫలమవుతుంటే.. దాన్నే పట్టుకొని వేలాడటం మూర్ఖత్వమే. ఎన్నిసార్లు ప్రయత్నించినా విజయం దక్కలేదంటే అది ప్రయత్న లోపమైనా ఉండాలి లేదా మీరు శక్తికి మించిన పనిని తలకెత్తుకొని ఉండాలి. ఆ విషయం తెలుసుకొని సమర్థత, స్థాయికి తగ్గది ఎంచుకోవాలి.

వైఫల్య పాఠాలు: 1995లో ఫోర్డ్‌ మోటార్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకొని ఒక కొత్త మోడల్‌ కారు తయారు చేయాలనుకున్నాం. కొన్ని కారణాలతో ఆ ఒప్పందం వీగిపోయింది. దీన్ని సవాలుగా తీసుకున్నా. విదేశీ భాగస్వామ్యం లేకుండానే.. మూడువందల మంది సిబ్బందితో రాత్రింబవళ్లు కష్టపడి స్కార్పియో మోడల్‌ని తీసుకొచ్చాం.

మార్పు: మార్పు లేకపోతే మనుగడ కష్టం. పరిస్థితులకనుగుణంగా అప్‌డేట్‌ కాకపోతే దిగ్గజాలైనా నేలకొరగాల్సిందే. వ్యాపారంలో ఉన్నవాళ్లు జనం అభిరుచులకు అనుగుణంగా మారుతుండాలి. ఈ పనితీరే నన్ను ‘ప్రపంచంలోని టాప్‌ 30 సీఈవోల జాబితా’లో మూడో స్థానంలో నిలిపింది.

భారీ లక్ష్యాలు: మహీంద్రా అండ్‌ మహీంద్రా డెబ్భై ఏడేళ్ల చరిత్ర ఉన్న సంస్థ. మొదట్లో మొక్కగానే మొదలైంది. రెక్కలు తొడిగి, భారీగా విస్తరించడానికి కారణం మేం ఏర్పరచుకున్న ఉన్నత లక్ష్యాలు, భారీ స్వప్నాలు. అవే మమ్మల్ని ఐటీ, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాయి. విదేశాలకూ వ్యాపారం విస్తరించేలా చేశాయి.

అంకుర ఆలోచనలు: ఇది అంకుర యుగం. ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నాయి. స్టార్టప్‌ మొదలు పెట్టేవాళ్లకి ప్రణాళిక, విస్తరణ, లక్ష్యం.. స్పష్టంగా ఉంటాయి. ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకెళ్తారు. వ్యాపారంలో, కెరియర్‌లో, ఎంచుకున్న ప్రతి రంగంలో ఇదే సూత్రం వర్తిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని