కొలువుల రేడు

ప్రాంగణ నియామకాల్లో లక్షల జీతంతో కొలువుకు ఎంపిక.. గేట్‌లో అత్యుత్తమ ర్యాంకు.. ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సీటు.. నాలుగు కేంద్ర ప్రభుత్వ కొలువులు.. తాజాగా ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో ర్యాంకు.. ఈ ఘనతలన్నీ ఖమ్మం జిల్లా వైరా కుర్రాడు శ్రీరామచరణ్‌వి.

Published : 14 May 2022 00:40 IST

ప్రాంగణ నియామకాల్లో లక్షల జీతంతో కొలువుకు ఎంపిక.. గేట్‌లో అత్యుత్తమ ర్యాంకు.. ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సీటు.. నాలుగు కేంద్ర ప్రభుత్వ కొలువులు.. తాజాగా ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో ర్యాంకు.. ఈ ఘనతలన్నీ ఖమ్మం జిల్లా వైరా కుర్రాడు శ్రీరామచరణ్‌వి.

ప్రతిభ ఉంటే అవకాశాలకు కొదవే ఉండదు అన్నట్టుగా దూసుకెళ్తున్నాడు శ్రీరామచరణ్‌. ఈరోజుల్లో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ప్రవేశం పొందడానికి, ప్రభుత్వ కొలువు సంపాదించడానికి యువత ఆపసోపాలు పడుతుంటే.. తను మాత్రం అలవోకగా అనుకున్నవన్నీ సాధించాడు.

ఖమ్మం జిల్లా వైరా శ్రీరామచరణ్‌ సొంతూరు. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లోని బిట్స్‌ పిలానీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆ సమయంలో పలు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలొచ్చాయి. ఒక కంపెనీ ఏడాదికి రూ.13 లక్షల వేతనం ఇస్తానంది. కానీ తన లక్ష్యం ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌) కావడంతో దాన్ని వదులుకున్నాడు. 2019లో గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) రాశాడు. జాతీయ స్థాయిలో 1200 ర్యాంకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా, మంచి ర్యాంకు కోసం మళ్లీమళ్లీ రాశాడు. తర్వాత 840, 180వ ర్యాంకులు సాధించాడు. దీంతో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ లాంటి నాలుగు కేంద్రప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రతిష్ఠాత్మక ఐఐటీ-బాంబే, ఐఐటీ-దిల్లీలలో కూడా ప్రవేశం దక్కింది. అయినా తన ఐఈఎస్‌కి పట్టుదలగా ప్రయత్నించి తాజాగా విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకు దక్కించుకున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో మంచి హోదాలో పని చేస్తున్నాడు.

చదువు, కొలువుల్ని ఒడిసిపట్టిన శ్రీరామచరణ్‌లో మరో ప్రతిభ కూడా ఉంది. అది అష్టావధానం. తండ్రి సంస్కృత అధ్యాపకుడు కావటంతో మూడేళ్ల వయస్సు నుంచే ఆయన నుంచి ఈ ప్రతిభ అందిపుచ్చుకున్నాడు. భగవద్గీతలోని ఏడొందల శ్లోకాలను కంఠతా చెప్పగలడు. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సోదరుడితో కలిసి అష్టావధానం చేశాడు.

- తాండ్ర రమేశ్, వైరా 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని