అలవాట్లే.. పెళ్లికి అడ్డా?

కొన్నాళ్లుగా నేనొక అబ్బాయితో ప్రేమలో ఉన్నా. తను చాలా మంచివాడు. మంచి ఉద్యోగమూ ఉంది. కాకపోతే తను ఉత్తరాదికి చెందినవాడు. అయినా తననే పెళ్లి చేసుకుంటానని మావాళ్లతో చెప్పాను. ‘ప్రేమ పెళ్లికి మాకేం అభ్యంతరం లేదు గానీ భాష,

Updated : 28 May 2022 09:58 IST

కొన్నాళ్లుగా నేనొక అబ్బాయితో ప్రేమలో ఉన్నా. తను చాలా మంచివాడు. మంచి ఉద్యోగమూ ఉంది. కాకపోతే తను ఉత్తరాదికి చెందినవాడు. అయినా తననే పెళ్లి చేసుకుంటానని మావాళ్లతో చెప్పాను. ‘ప్రేమ పెళ్లికి మాకేం అభ్యంతరం లేదు గానీ భాష, ఆచారాలు, అలవాట్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. తర్వాత నువ్వే బాధ పడతావు’ అంటున్నారు. బాగా ఆలోచిస్తే వాళ్లు చెప్పిందీ నిజమే అనిపిస్తోంది. మరోవైపు మంచి వ్యక్తిని మిస్‌ అవుతాననే భయంగానూ ఉంది. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నా.

- డీపీ, ఈమెయిల్‌

అబ్బాయి మంచి వ్యక్తి అని మీరే చెబుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడానికి అతడికి మంచి ఉద్యోగమూ ఉంది. ఇంకేం కావాలి? ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే.. బంధం సాఫీగా సాగిపోతుంది. ఇక మీవాళ్లు చెబుతున్న అభ్యంతరం విషయానికొస్తే.. ఈరోజుల్లో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే కాదు.. మనవాళ్లు విదేశీయులను సైతం పెళ్లి చేసుకొని హాయిగా ఉంటున్నారు. ఒకర్నొకరు అర్థం చేసుకుంటే.. ఆచారాలు, అలవాట్లు.. ఇబ్బందిగా అనిపించవు. మీరు చేసుకోబోయే అబ్బాయి మంచివాడైతే మీ కుటుంబంతోనూ కలిసిపోతాడు. మీవాళ్లు చెబుతున్నట్టుగా కొన్ని ఇబ్బందులు వచ్చే మాట వాస్తవం. వాటితో సర్దుకుపోగలరా? చాలా కష్టమా.. అనేది మీ వ్యక్తిత్వం, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు అతడి తరపు పెద్దవాళ్లతో కూడా ఓసారి మాట్లాడండి. ఏమైనా అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఒకవేళ మీరిద్దరు పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందులు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు వేసుకోండి. వాటిని ఎలా అధిగమిస్తారో మీవాళ్లకు వివరించి చెప్పండి. ఆల్‌ ది బెస్ట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని