Published : 11 Jun 2022 01:37 IST

కాలేజీ మాని.. కోట్లకు ఎదిగి!

తాతతండ్రులిచ్చింది పైసా లేదు... సొంత తెలివితేటలే పెట్టుబడిగా పెట్టాడు... కాలేజీ మధ్యలోనే మానేశాడు... పాతికేళ్లకే వందల కోట్లకు ఎదిగాడు... స్వయంకృషితో ఈ స్థాయికి చేరిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు అలెగ్జాండర్‌ వాంగ్‌.

‘స్కేల్‌ ఏఐ’.. కృత్రిమ మేధస్సు (ఏఐ)కి అత్యుత్తమ కంపెనీల్లో ఒకటి. అమెరికా వాయుదళం, సైన్యం, జనరల్‌ మోటార్స్, ఎక్స్‌పోర్ట్‌లాంటి దాదాపు 300 ప్రపంచ దిగ్గజాలు ఈ సంస్థ సాంకేతిక సేవలు అందుకుంటున్నాయి. దీని సహ వ్యవస్థాపకుడే వాంగ్‌. ఆరేళ్ల కిందట అంకురంగా పురుడు పోసుకున్న ‘స్కేల్‌ ఏఐ’ ఇప్పుడు రూ.60వేల కోట్ల కంపెనీ. ఈ ఎదుగుదలలో వాంగ్‌దే కీలకపాత్ర.

గణిత మేధావి 

కృత్రిమ మేధస్సు, కోడింగ్‌పై అలెగ్జాండర్‌ పట్టు సాధించడానికి కారణం తను లెక్కలపై లెక్కలేనంత పట్టు సాధించడమే. చిన్నప్పట్నుంచే గణితంలో ఎలాంటి చిక్కులనైనా అవలీలగా ఛేదించేవాడు. ఆరో తరగతిలో ఉండగానే ‘నేషనల్‌ మ్యాథ్స్‌ కాంపిటీషన్‌’ నెగ్గాడు. పదిహేడేళ్లకే సాఫ్ట్‌వేర్‌ కోడర్‌ అయ్యాడు. అదే ఇష్టంతో ప్రఖ్యాత మసాచ్యుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులో చేరాడు. అక్కడే లూసీ గ్యూ పరిచయమైంది. తనూ టెక్నాలజీలో దిట్ట. ఇద్దరూ కలిసి శాన్‌ఫ్రాన్సిస్కోలో 2016లో ‘స్కేల్‌ ఏఐ’ ప్రారంభించారు.

కళాశాల వదిలి

ఓవైపు క్లాసులు.. మరోవైపు కంపెనీ పనులు. కొన్నాళ్లకి వాళ్లు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం వాడేలా ఒక రక్షణ ఉత్పత్తుల కంపెనీని ఒప్పించారు. ఆపై ఈ ప్రాజెక్టులోనే తలమునకలు కావడంతో ఎంఐటీ కోర్సు మధ్యలోనే వదిలేశాడు వాంగ్‌. మొదటి ప్రయత్నం విజయవంతమైంది. సంస్థని మరింత విస్తరించడానికి నిధుల బాట పట్టాడు. ఈ రంగంలో ఉన్న భవిష్యత్తు, వాళ్లపై ఉన్న నమ్మకంతో ఒక ఒక అమెరికన్‌ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టింది. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూనే అత్యుత్తమ టెక్నాలజీ అభివృద్ధి చేశారు. అవకాశాలు వరుసకట్టాయి. దిగ్గజ కంపెనీలూ వాంగ్‌ ఏఐ టెక్నాలజీ వాడుకోవడం మొదలుపెట్టాయి. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆరేళ్లలో సంస్థ వేల కోట్లకు ఎదిగింది. ఇందులో వాంగ్‌ వాటా 15 శాతం. అంటే తన సంపాదన విలువ అక్షరాలా రూ.9వేల కోట్లు. ఎవరి అండదండలు లేకుండా వాంగ్‌ 25 ఏళ్ల చిన్న వయసులోనే బిలియనీర్‌గా ఎదిగాడు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని