అందాల సునామీ..వివాదాల కహానీ!

అంబర్‌ హర్డ్‌...మార్లిన్‌ మన్రోకి వారసురాలంటుంటారు. తన నటనకి జనం ఫిదా అవుతారు.జాలి హృదయానికి సలాం కొడతారు. అంత  పాపులరైన ఈ అమ్మడిపై  ఉన్న వివాదాలూ తక్కువేం కాదు. తాజాగా.. మాజీ భర్త, హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌తో  పరువు నష్టం కేసువివాదంతో 

Updated : 18 Jun 2022 12:29 IST

అంబర్‌ హర్డ్‌...మార్లిన్‌ మన్రోకి వారసురాలంటుంటారు. తన నటనకి జనం ఫిదా అవుతారు.జాలి హృదయానికి సలాం కొడతారు. అంత  పాపులరైన ఈ అమ్మడిపై  ఉన్న వివాదాలూ తక్కువేం కాదు. తాజాగా.. మాజీ భర్త, హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌తో  పరువు నష్టం కేసువివాదంతో  మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈభామ సంగతులు ఫటాఫట్‌ చెప్పుకుందాం.
* ‘జీవించి ఉన్న తారల్లో సెక్సీయెస్ట్‌ వుమన్‌’ అంటూ పలు మేగజైన్లు అంబర్‌కి పట్టం కట్టాయి. బుల్లితెర నుంచి హాలీవుడ్‌ సినిమాల్లోకి వచ్చింది. అందమే కాదు.. అచ్చెరువొందే నటనతో పాపులారిటీ పెంచుకుంది.
*ఎవరిపైనా ఆధారపడకుండా తనకాళ్లపై తను నిలబడటం ఈ భామ నైజం. టీనేజీలోనే స్విమ్మింగ్‌పూల్‌లో ‘లైఫ్‌గార్డ్‌’ ఉద్యోగం చేసింది. మోడలింగ్‌ ఏజెన్సీలో ఆఫీసు క్లీనర్‌గా పని చేసింది. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన కలిగిందట.
* రిమెంబర్‌ ద డేస్‌, నెవర్‌ బ్యాక్‌డౌన్‌, ది ఇన్ఫార్మర్స్‌, జాంబీల్యాండ్‌.. లాంటి వరుస హిట్లతో స్టార్‌ దివాగా మారిపోయింది అంబర్‌. తన అందంతో కుర్రాళ్ల కంటి మీద కునుకు లేకుండా చేసింది. మార్లిన్‌ మన్రో తర్వాత ఆ స్థాయిలో కవ్వించే అందం అంబర్‌కే సొంతం అంటూ పాశ్చాత్య మీడియా ఆమెని ఆకాశానికెత్తేసింది.
* హాలీవుడ్‌ హీరోలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు.. తన వెంట పడుతుంటే.. వాళ్లని కాదని తనకన్నా వయసులో  23 ఏళ్లు పెద్దవాడైన ‘ది పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌’ స్టార్‌ జానీడెప్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వీళ్ల వివాహ బంధం రెండేళ్ల ముచ్చటే అయింది.
* అంబర్‌ నాస్తికురాలు. పదహారేళ్ల వయసున్నప్పుడు ప్రాణ స్నేహితురాలు రోడ్డుప్రమాదంలో చనిపోయింది. అప్పట్నుంచి దేవుడిని నమ్మడం మానేసిందట. పుస్తకాలు బాగా చదువుతుంది. ఇంగ్లిష్‌తో పాటు స్పానిష్‌, ఫ్రెంచ్‌ అనర్గళంగా మాట్లాడుతుంది. స్నేహితులతో సైగల భాష కూడా మాట్లాడుతుందట.
* తనపై ఎన్ని వివాదాలున్నా అంబర్‌ది జాలి హృదయం. ఐదేళ్ల కిందట జానీ డెప్‌తో విడిపోయినప్పుడు భరణంగా అందిన రూ.55 కోట్లను ‘అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌’ అనే హక్కుల సంస్థకు, లాస్‌ఏంజెల్స్‌లోని చిన్నపిల్లల ఆసుపత్రికి విరాళంగా ఇచ్చింది. గృహహింసకు వ్యతిరేకంగా నడిచే స్వచ్ఛంద సంస్థల తరపున పని చేస్తోంది. స్వలింగ సంపర్కుల హక్కుల కోసమూ పని చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని