కాలేజీకైనా.. కార్యాలయానికైనా

ఒంటిపై మంచి దుస్తులు ఉంటే ఆటోమేటిగ్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్టైలిష్‌గా కనిపిస్తుంటే ముఖంలో సంతోషం నిలుస్తుంది. అందుకే మరి కుర్రకారు షోకిల్లారాయుళ్లలా మారిపోతుంటారు. ఇందులోనూ కొన్ని చిట్కాలు పాటిస్తే సొగసులకు నిండుదనం వస్తుందంటున్నారు

Updated : 25 Jun 2022 02:46 IST

ఒంటిపై మంచి దుస్తులు ఉంటే ఆటోమేటిగ్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్టైలిష్‌గా కనిపిస్తుంటే ముఖంలో సంతోషం నిలుస్తుంది. అందుకే మరి కుర్రకారు షోకిల్లారాయుళ్లలా మారిపోతుంటారు. ఇందులోనూ కొన్ని చిట్కాలు పాటిస్తే సొగసులకు నిండుదనం వస్తుందంటున్నారు ఫ్యాషన్‌ గురూలు. అవేంటంటే.. 

* షర్టు, ప్యాంటు, జాకెట్, బ్లేజర్‌.. ఏది వేసినా ఒంటికి సరిపోయేలా ఉండాలి. మరీ బిగుతుగా, మరీ వదులుగా.. పొట్టిగా, పొడుగ్గా ఉంటే ఎంత మంచి డిజైన్, ఫ్యాబ్రిక్, ఖరీదైన డ్రెస్‌ అయినా చూడ్డానికి బాగుండదు.

* కాలేజీ కుర్రాడు పూల చొక్కాలు, బులుగు రంగులు ధరిస్తే ఫర్వాలేదు. కార్పొరేట్‌ ఉద్యోగీ అలాంటివే వేస్తానంటే కుదరదు. ఒంటికి తగ్గవే కాదు.. వృత్తికి తగ్గవీ ఎంచుకోవాలి.

* గీతలు, పూల డిజైన్లు, ప్యాటర్న్‌లు, చెక్స్‌.. ఇవి అందరికీ నప్పవు. కానీ ఒకే రంగుతో ఉండే ప్లెయిన్‌ చొక్కాలు కాలేజీ కుర్రాళ్లు, యువ ఉద్యోగులు అందరికీ బాగుంటాయి. హుందాతనం, స్టైల్‌ రెండింటినీ ఒడిసిపట్టొచ్చు.

* పార్టీలు, కాలేజీల్లో మెరుపుల డిజైన్లు, నినాదాలున్న టీషర్టులు ఓకే. ఆఫీసుకెళ్లే వాళ్లు, మ్యాన్లీగా కనిపించాలి అనుకునేవాళ్లకి పోలో టీషర్టులు, కాలర్‌ టీ షర్టులు అనుకూలంగా ఉంటాయి.

* వేసుకునే దుస్తుల నాణ్యత బాగుండాలి అనుకుంటే.. రంగు వెలిసిపోకుండా అత్యధిక కాలం మన్నిక కావాలంటే వార్డ్‌రోబ్‌లో ఎక్కువ ఔట్‌ఫిట్‌లు ఉండాలని కోరుకునే బదులు. నాణ్యమైన ఫ్యాబ్రిక్‌వి ఎంచుకోవాలి.

* స్లిమ్‌ ఫిట్‌ ప్యాంట్లు.. టీనేజీ అబ్బాయిల నుంచి అంకుల్స్‌ దాకా అందరికీ సరిపోతాయి. సౌకర్యంగా ఉంటాయి. క్యాజువల్‌ లుక్‌ కావాలనుకుంటే లేత రంగు చొక్కాలపై ముదురు రంగు డెనిమ్‌లు వేస్తే జోడీ బాగుంటుంది.

ఒంటిపై ధరించే దుస్తులకు అన్ని నిబంధనలూ పాటించి పాదాలను పట్టించుకోకపోతే మీ స్టైల్‌ ప్రక్రియ పూర్తవదు. కాలేజీ కుర్రాళ్లు చినోస్, స్నీకర్లు, స్పోర్ట్స్‌ షూలు.. యువోద్యోగులు ఫార్మల్, బ్రోగ్, డెర్బీలు.. వేస్తే స్టైల్‌కి నిండుదనం వస్తుంది.

 - షణ్మిత గాయత్రి, ఫ్యాషన్‌ డిజైనర్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని