Roger Federer: నిబద్ధతే గెలుపు సూత్రం

‘రోజర్‌ ఫెదరర్‌ ఒక మెజీషియన్‌. టెన్నిస్‌ కోర్టులో తనని మించినవారు లేరు’.. భారత దిగ్గజ ఆటగాడు మహేష్‌ భూపతి ఈమధ్యే చేసిన వ్యాఖ్య ఇది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆటగాడిగానే కాదు.. స్ఫూర్తి పంచే వ్యక్తిగానూ తను ముందుంటాడు.

Updated : 25 Jun 2022 07:58 IST

‘రోజర్‌ ఫెదరర్‌ ఒక మెజీషియన్‌. టెన్నిస్‌ కోర్టులో తనని మించినవారు లేరు’.. భారత దిగ్గజ ఆటగాడు మహేష్‌ భూపతి ఈమధ్యే చేసిన వ్యాఖ్య ఇది. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఆటగాడిగానే కాదు.. స్ఫూర్తి పంచే వ్యక్తిగానూ తను ముందుంటాడు. అతడి నుంచి యువత ఏం నేర్చుకోవచ్చు అంటే...

సంయమనం: ఆట ఏదైనా ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మ్యాచ్‌లు చేజారుతుంటే కోపం ఆపుకోలేరు. కానీ ఇరవై గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన తనలో మచ్చుకైనా కోపం కనబడదు. సంయమనం కోల్పోయిన సందర్భాలు అరుదు. ఇది అందరూ పాటించాలి. జీవితంలో కష్టనష్టాలు సహజం. గడ్డు సమయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడిలో విచక్షణ కోల్పోవద్దు.

సాధన: విజయానికి దగ్గరి దారులుండవు. అందరూ చెప్పే మాట. అందరికీ వర్తించే మాట. రోజర్‌ చాలాసార్లు గాయాలబారిన పడ్డాడు. కెరీర్‌ ముగిసినట్టే అని భావించిన ప్రతిసారీ కసిగా తిరిగొచ్చాడు. ఎలా సాధ్యం అంటే... ఆ సమయంలో కష్టపడి జాగ్రత్తలు తీసుకునేవాడు. మరింత సాధన చేసేవాడు. పక్కా డైట్‌ పాటించేవాడు.

శ్రమ: మ్యాచ్‌ ఉన్నా, లేకపోయినా రోజుకి నాలుగు గంటల సాధన చేసేవాడు ఫెదరర్‌. వందల టైటిళ్లు గెలిచినా, దిగ్గజం అనిపించుకున్నా అదే తీరు. ఈ ప్రణాళిక, సాధనే విజయానికి పెట్టుబడి అంటాడు. మరి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నా.. ఓ కలల జాబ్‌ కొట్టాలన్నా.. దీర్ఘకాలిక ప్రణాళిక, సాధన ఉంటేనే సాధ్యం.

సరిదిద్దుకోవటం: ఎన్నో విజయాలున్నా.. ఫెదరర్‌ కెరీర్‌లో అపజయాలూ ఉన్నాయి. ఓడిన మ్యాచ్‌ వీడియోని మళ్లీ మళ్లీ చూడటం తనకలవాటు. జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటేనే ముందుకెళ్లగలం అంటాడు. ఇది కుర్రాళ్ల జీవితానికీ వర్తిస్తుంది. మనం తెలిసో, తెలియకో తప్పులు చేస్తాం. అవి తెలుసుకొని సరిదిద్దుకుంటేనే మంచి భవిష్యత్తు.

నిబద్ధత: ఏడేళ్లప్పుడు టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకున్నాడు రోజర్‌. పన్నెండేళ్లప్పుడు ప్రపంచ నెంబర్‌వన్‌ ఆటగాడు కావాలనుకునేవాడట. అందుకోసమే పద్నాలుగేళ్లకే చదువుకు గుడ్‌బై చెప్పి ఆటకు భక్తుడిగా మారాడు. అంటే ఎంచుకున్న రంగం, కెరియర్‌పై ముందుచూపు, ఇష్టం, నిబద్ధత దీన్ని తెలియజేస్తుంది. ఆ లక్షణాలు, ప్రణాళిక ఉంటేనే మనం నెంబర్‌వన్‌ కాగలుగుతాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని