అంకురం.. ఆశయం.. జనహితం

వ్యాపారం అందరూ చేస్తారు... అందులో జనానికి మేలు ఉంటే.. అంతా జేజేలు కొడతారు... పర్యావరణ మమకారాన్నీ జోడిస్తే.. భుజం తడతారు... ఇదేబాటలో సాగుతున్నారు కొందరు యువ తరంగాలు... ఆ అరుదైన ప్రయత్నాన్ని అవార్డులూ హత్తుకున్నాయి... ఆ ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నారు.

Updated : 02 Jul 2022 01:02 IST

వ్యాపారం అందరూ చేస్తారు... అందులో జనానికి మేలు ఉంటే.. అంతా జేజేలు కొడతారు... పర్యావరణ మమకారాన్నీ జోడిస్తే.. భుజం తడతారు... ఇదేబాటలో సాగుతున్నారు కొందరు యువ తరంగాలు... ఆ అరుదైన ప్రయత్నాన్ని అవార్డులూ హత్తుకున్నాయి... ఆ ప్రయాణాన్ని ఈతరంతో పంచుకున్నారు.


ప్లాస్టిక్‌ అంతమే.. పంతం

వాడి పడేసిన కవర్లు ఎక్కడైనా ఎరువుగా మారడం చూశారా? రాసే పెన్సిళ్లతో భూమిలో మొలకలు రావడం గమనించారా? వెదురు నుంచి తయారైన టూత్‌బ్రష్‌లు వాడారా?.. పర్యావరణహితమైన ఇలాంటి బయో ఉత్పత్తులు తయారు చేస్తోంది గ్రీన్‌ అలయన్స్‌ బయోటెక్‌ (గ్యాబ్‌). ఈ అంకుర సంస్థ వ్యవస్థాపకుడే నిజామాబాద్‌కు చెందిన అభినవ్‌ పటేల్‌. ఇతగాడి సత్ప్రయత్నానికి అవార్డులూ వరించాయి.

మంచిర్యాల జిల్లా సర్వేపేట్‌ అభినవ్‌ సొంతూరు. బీటెక్‌ పూర్తవగానే రెండేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. తర్వాత గ్రానైట్‌ వ్యాపారంలోకి దిగాడు. అక్కడ పర్యావరణ విధ్వంసం జరగడం గమనించి దాన్ని వదిలేశాడు. ప్రకృతికి మేలు చేసే సంస్థ ప్రారంభించాలనుకున్నాడు. ఈ సమయంలోనే హోలీ పండగ వచ్చింది. జనం కృత్రిమమైన రంగులు, రసాయనాలతో వేడుక చేసుకోవడం గమనించాడు. దీన్ని ఆపడానికి సహజసిద్ధమైన రంగులు తయారు చేసి అమ్మకానికి పెట్టాడు. పెద్దగా స్పందన రాలేదు. అయినా పట్టు వదల్లేదు అభినవ్‌. ఎప్పుడో ఓసారి వాడే రంగులే ప్రమాదకరమైతే.. రోజూ ఉపయోగించే ప్లాస్టిక్‌ కవర్ల కాలుష్యం అతడ్ని మరింత కలవరానికి గురి చేసింది. ఈ నష్టాన్ని తగ్గించేలా పర్యావరణహిత కవర్లు తయారు చేయాలనుకున్నాడు. అంతర్జాలం వెతికాడు. నిపుణులను కలిశాడు. రెండేళ్ల పాటు పరిశోధన చేశాడు. ఆఖరికి మొక్కజొన్న, బంగాళాదుంప, కాకర, సాబుదానా గంజితో ఎకో కవర్ల తయారీ సాధ్యమని గ్రహించాడు. వీటితో ఇంట్లోనే చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఈ ఫార్ములాతో పెద్ద పరిశ్రమ పెట్టాలనుకున్నాడు. ఎన్ని బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం రాలేదు. ఉన్న కొద్దిపాటి స్థలం అమ్మేశాడు. భార్య నందిని తన నగలు తాకట్టు పెట్టమని ఇచ్చింది. ఆ మొత్తంతో జర్మనీ నుంచి తయారీ యంత్రం తెప్పించారు. 2021లో నిజామాబాద్‌ జిల్లా లక్కంపల్లి సెజ్‌లో ‘గ్రీన్‌ అలయన్స్‌ బయోటెక్‌’ (గ్యాబ్‌) పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశారు. చిన్నచిన్న ప్యాకెట్ల నుంచి ఐదు, పది, ఇరవై ఐదు కేజీలకు అనుగుణంగా కవర్లు తయారు చేస్తున్నారు. వీటిని వాడిన తర్వాత బయట ఎక్కడ పడేసినా 30 నుంచి 180 రోజుల్లో కరిగిపోయి ఎరువుగా మారతాయంటాడు అభినవ్‌. గాలి చొరబడకుండా భద్రపరిస్తే ఆరు నెలల వరకు వాడుకునేందుకు అవకాశం ఉందంటాడు. ఈ బయో కవర్లతోపాటు విత్తనాలు అమర్చిన పెన్సిళ్లు, పెన్నులు, నోటుపుస్తకాలు గ్యాబ్‌లో తయారు చేస్తున్నారు. వీటిని వాడి భూమిలో పడేస్తే మొలకలు వస్తాయి. అలాగే వెదురు టూత్‌బ్రష్‌లూ ఇక్కడ తయారవుతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ఉత్పత్తులను అత్యధికంగా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఈ పరిశ్రమకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండళ్ల నుంచి అనుమతి లభించింది. అభినవ్‌ సత్ప్రయత్నాన్ని పలు అవార్డులు వరించాయి. 2019 అక్టోబర్‌ 2న జీహెచ్‌ఎంసీ, రాంకీ సంస్థల నుంచి ‘ఐడియాథాన్‌’ అవార్డు అందుకున్నాడు. ‘నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ అభినవ్‌ని ‘ఉత్తమ ఆంత్రపెన్యూర్‌’గా గుర్తించింది. ‘ఇండియన్‌ అఛీవర్స్‌ ఫోరమ్‌’ నుంచి ‘బెస్ట్‌ ఆంత్రప్రెన్యూర్‌’ పురస్కారం అందుకున్నాడు.
‘మనదేశంలో 1.78 కోట్లు, రాష్ట్రంలో 1.28లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వినియోగంలో ఉంది. ఈ వాడకం ఇలాగే ఉంటే భవిష్యత్తులో మానవాళికే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్‌ స్థానంలో సాధ్యమైనంత ఎక్కువగా బయో ఉత్పత్తులు వాడాలనే ఉద్దేశంతో పరిశ్రమ పెట్టాం. ఏర్పాటులో చాలా కష్టాలు ఎదురైనా వెనకడుగేయలేదు. కరోనా లాక్‌డౌన్‌లో బాధితులకు ఆహారం అందించే దాతలకు మేం బయో కవర్స్‌ ఉచితంగా ఇచ్చాం. కొన్ని స్వీట్‌ దుకాణాల్లోనూ మా సంచులనే వినియోగిస్తున్నారు. మా ప్రయత్నానికి ప్రభుత్వ మద్దతు లభిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తాం’.


సిగరెట్‌ పీకలతోఅందమైన బొమ్మలు

‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా పొగరాయుళ్లు వినరుగా! వీళ్లని ఎలాగూ మార్చలేకపోయినా.. వాళ్లు తాగి పడేసిన సిగరెట్‌ పీకలతోనే అందమైన బొమ్మలు తయారు చేస్తూ ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్నారు దిల్లీ కుర్రాడు నమన్‌ గుప్తా.

నమన్‌ దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు అతడి స్నేహితులు సిగరెట్లు తెగ కాల్చేవారు. పీకల్ని నలిపి రోడ్లపై పడేసేవారు. వీటితో పర్యావరణానికి ఏమైనా హానికరమా? అని అధ్యయనం చేశాడు తను. అప్పుడు ఆందోళనకరమైన విషయాలు తెలిశాయి. మనదేశంలో ఏడాదికి సగటున పదివేల కోట్ల సిగరెట్లు కాలుస్తున్నారు. 26 వేల టన్నుల చెత్త పోగవుతోంది. వాడి పడేసిన ఈ వ్యర్థాల్లో ‘సెల్యులోజ్‌ యాసిటేట్‌’ అనే ప్లాస్టిక్‌ మిశ్రమం ఉంటుంది. ఇది మట్టిలో కలిసిపోవడానికి పన్నెండేళ్ల సమయం పడుతుంది. ఇవన్నీ తెలియగానే పరిష్కారం కోసం సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సోదరుడు విపుల్‌ని సంప్రదించాడు. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు పరిశోధన చేశారు. చివరికి సిగరెట్‌ పీకల్ని అప్‌సైకిల్‌ చేసే ‘కోడ్‌ ఎఫెక్ట్‌’ అనే అంకురసంస్థ ప్రారంభించారు.
సిగరెట్‌ వ్యర్థాల్లో ఫైబర్‌, పేపరు, పొగాకు.. ఉంటాయి. ముందు వీటన్నింటినీ వేరు చేస్తారు. దేనికదే రీసైకిల్‌ చేసి, ఆటబొమ్మలు, పరుపులు, చొక్కాల గుండీలు, విగ్రహాలు, దోమల నివారిణిలు, కంపోస్ట్‌ పౌడర్‌... తయారు చేస్తున్నారు. ఈ సుతిమెత్తని బొమ్మల్ని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. సిగరెట్‌ పీకల్ని ఏరి తీసుకురావడానికి రెండు వేలమంది ర్యాగ్‌పికర్స్‌ని నియమించారు. వీళ్లు రోజుకి వెయ్యికిలోల సిగరెట్‌ వేస్ట్‌ సేకరిస్తున్నారు. దీంతోపాటు దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలోని హోటళ్లు, పాన్‌షాప్‌లు, రోడ్ల పక్కన ప్రత్యేకంగా వీ-బిన్‌లు ఏర్పాటు చేశారు. మార్చి 2022 నాటికి ఈ అన్నదమ్ములిద్దరూ 120 కోట్ల సిగరెట్‌ పీకల్ని రీసైకిల్‌ చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని