నా చదువు తనకి కానుక

తాము నెరవేర్చుకోలేనివి తమ పిల్లల ద్వారా నిజం చేయాలనుకుంటారు పేరెంట్స్‌. ఇంటర్‌ తర్వాత నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో నాన్న నన్ను ఇంజినీరింగ్‌లో చేర్పించారు. నాకు ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం ఒప్పుకొన్నా.

Published : 13 Jul 2019 00:11 IST

తాము నెరవేర్చుకోలేనివి తమ పిల్లల ద్వారా నిజం చేయాలనుకుంటారు పేరెంట్స్‌. ఇంటర్‌ తర్వాత నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో నాన్న నన్ను ఇంజినీరింగ్‌లో చేర్పించారు. నాకు ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం ఒప్పుకొన్నా. 2012 సెప్టెంబర్‌లో నా క్యాంపస్‌ జర్నీ మొదలైంది. చదువుతో పాటు వివిధ రకాల మనుషులు వారి మనస్తత్వాలు తెలుసుకుంటూ ఆ లైఫ్‌కి అలవాటు పడుతున్నా. ఓ రోజు తీవ్రమైన అనారోగ్యంతో ఇంటికి వెళ్లాల్సివచ్చింది. తీసుకు వెళ్లేందుకు బైక్‌పై నాన్న వచ్చారు. ఇంటికెళ్లే దార్లో యాక్సిడెంట్‌. స్పృహలోకి వచ్చేసరికి నేనొకచోట.. నాన్నొకచోట.. రోడ్డు మీద పడిఉన్నాం.. అదంతా అటవీ ప్రాôతం కావడంతో బంధువుల సాయంతో హాస్పిటల్‌కు చేరుకున్నాం. నెలలు గడిచాయి. నాన్న ఆరోగ్యం కుదుటపడింది. నేను మాత్రం జరిగిన ప్రమాదం నుంచి తేరుకోలేకపోయాను. మమ్మల్ని పలకరించడానికి బంధువులు, స్నేహితులు వచ్చి వెళ్లేవారు. వాళ్లలో ఒకావిడలో ఏదో ఎనర్జీ చూశా. చాలా ఉత్సాహంగా కనిపించారు. నాకెందుకో చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది.

ఎదురుగా కూర్చున్న తన కొడుకుని చూపించి నవ్వింది. విచిత్రమేమిటంటే అతనూ నాలాగే కట్టుకట్టుకుని కూర్చున్నాడు. అతడు కూడా వాళ్ల అమ్మలానే నవ్వుతూ హాయ్‌ చెప్పాడు. నా ముఖంలో ఇంజినీరింగ్‌పై అనాసక్తిని గమనించాడేమో. చదువు తప్ప అన్ని విషయాల గురించి మాట్లాడాడు. ఎందుకో.. తన మాటల్లో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నాలాగే ఆలోచిస్తున్నట్టుగా తోచింది. ఇలా ఆలోచిస్తుండగా.. ‘ఈ ఏడాది చివర్లో అమెరికాకి వెళ్తున్నా. మాస్టర్స్‌ చేయడానికి..’ అన్నాడు. ఆశ్చర్యంగా అతడివైపు చూశాను. ‘కేవలం చదువు కోసమే. ఎలక్ట్రానిక్స్‌ గురించి రిసర్చ్‌ చేయడానికి’ అంటూ.. నాకు తెలియని అంశాలను ఆసక్తికరంగా వివరించాడు. తను చెబుతుంటే.. అప్పటి వరకూ నాకు తెలియని నన్ను  చూశాను.

మెల్లగా ప్రమాదం నుంచి తేరుకున్నాను. మళ్లీ ఫ్రెష్‌గా కళాశాలలో అడుగుపెట్టాను. నేర్చుకునే ప్రతీ అంశాన్నీ నిజజీవితానికి ముడేసి చూడడం అలవాటు అయ్యింది. అలా రెండేళ్లు గడిచాయి. కానీ, ఏదో అసంతృప్తి. ఇష్టపడే చదువుతున్నా.. కానీ నా లక్ష్యం ఏంటి? అనే ఆలోచన మొదలైంది. ఒక రోజు అప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చా.. అదే రోజు మమ్మల్ని పలకరించడానికి వచ్చిన ఆంటీ కనిపించారు. నా క్షేమసమాచారాలు అడుగుతూనే ‘మరో మూడు నెలల్లో మా అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు’ అంది. ఆ మాటతో నాలో అలజడి. రెండేళ్లలో నేను అతనితో ఎన్నడూ మాట్లాడింది లేదు. అయినా.. అతని ఆలోచనలే. అతని కుటుంబ సభ్యుల్లాగే నేను కూడా అతడి రాకకోసం ఎదురుచూస్తున్నాను.

ఎప్పటిలానే ఆ రోజూ స్నేహితులతో కబుర్లు చెబుతూ.. ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో అందరూ డల్‌గా ఉండటం చూసి ఏం జరిగిందని అడిగా. ఎవరి నుంచీ సమాధానం లేదు. కొన్ని గంటల తర్వాత విషయం తెలిసింది. నిన్న రాత్రి అమెరికాలో ఆంటీ వాళ్ల అబ్బాయి కారు ప్రమాదంలో చనిపోయాడని. ఒక్కసారిగా ఏం చెప్పారో.. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కొన్ని రోజుల్లో వస్తాడన్న వ్యక్తి కనిపించడు.. రాడు అన్న విషయం జీర్ణించుకోలేకపోయాను. అతడి మాటలే నిత్యం గుర్తొచ్చేవి..! నాతో అతడు మాట్లాడింది.. రోజులో కొన్ని గంటలే కానీ అవి చెరగని ముద్ర వేశాయి. అతని ఆలోచనలతో చదువు ముందుకు సాగేది కాదు. ఎందుకంటే నాకు ఇంజినీరింగ్‌ చదువుపైన ఆసక్తి కలిగించేలా చేసింది అతడే. తనే లేకపోవడం బాధించింది. వచ్చిన సబ్జెక్ట్‌ అయినా పరీక్ష గదిలోకి వెళ్లాక ఖాళీ పేపరు ఇచ్చి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఒకరోజు అద్దంలో నన్ను నేను బాగా ప్రశ్నించుకున్నా. అప్పుడు నిశ్చయించుకున్నా. నా డిగ్రీని అతనికి కానుకగా ఇవ్వాలని కష్టపడ్డాను. అవగాహన లేని విషయాలపై పట్టుసాధించి మళ్లీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. నా కాన్వకేషన్‌ డిగ్రీ ప్రదానోత్సవంలో అందరం విడిపోతున్నందుకు బాధ పడుతుంటే.. నాకు మాత్రం అతడి ఆశయం నెరవేర్చినందుకు ఆనందభాష్పాలు వచ్చాయి.

* అతడిని తలుచుకుంటూ బాధపడేకంటే నేను చేసే ప్రతి పనిలో తనే ఉన్నాడనుకుని ముందుకు సాగుతున్నా. బహుశా జీవితమంటే ఇదేనేమో.

- హారిక ఆద్య

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని