నీకోసమే నా నిరీక్షణ

ఆ అమ్మాయికి ఓ అబ్బాయంటే ప్రాణం. ఆ కుర్రాడికీ ఆమె అంటే తగని ప్రేమ. పెద్దలు ఒప్పుకున్నా ప్రేమ పెళ్లిపీటలెక్కలేదు. కారణమేంటి? ఆ అమ్మాయి మాటల్లోనే...

Published : 20 Jul 2019 00:39 IST

ఆ అమ్మాయికి ఓ అబ్బాయంటే ప్రాణం. ఆ కుర్రాడికీ ఆమె అంటే తగని ప్రేమ. పెద్దలు ఒప్పుకున్నా ప్రేమ పెళ్లిపీటలెక్కలేదు. కారణమేంటి? ఆ అమ్మాయి మాటల్లోనే.
నేనప్పుడు డిగ్రీ ఫస్టియర్‌. ఓ ప్రాజెక్ట్‌వర్క్‌ కోసం ఇంటర్నెట్‌ సెంటర్‌కొచ్చా. అక్కడే పరిచయమయ్యాడు బాలు. తనది వేరే కాలేజీ అయినా ఇద్దరిదీ ఒకే గ్రూపు కావడంతో మాట కలిసింది. సాయంత్రాలు అప్పుడప్పుడు మా కాలేజీ దగ్గర కనిపించేవాడు. కళ్లతోనే పలకరించేవాడు. నేను చొరవ చూపా. కొద్దిరోజుల్లోనే మా పరిచయం పరుగందుకుంది. మీరు నువ్వులా మారి ‘ఒరే’ అనే పిలుపుల దాకా వెళ్లింది. ఫైనలియర్‌కొచ్చేసరికి నా వ్యక్తిగత విషయాలు పంచుకునే హితుడిలా మారిపోయాడు. కానీ మా వ్యక్తిత్వాలు భిన్నం. నేను గలగలా పారే మాటల ప్రవాహం. తను నిశ్చల సంద్రం. అయినా ఒకరంటే ఒకరికి తరగని అభిమానం. తన మాట వినందే నాకు నిద్ర రాదు. నన్ను చూడందే తనకి రోజు గడవదు.  అతడి పద్ధతి, నడవడిక అమ్మానాన్నలకీ నచ్చింది.
మా డిగ్రీ పూర్తైంది. కలుసుకోవడం తగ్గిపోయింది. కొన్నాళ్లయ్యాక ఉద్యోగం కోసం వేరే ఊరెళ్తున్నానన్నాడు. మనసు తల్లడిల్లిపోయింది. అక్కడికెళ్లాక పని హడావుడిలో పడిపోయాడు. కలుసుకోవడం మాటలా ఉంచితే కనీసం ఫోన్‌ కబుర్లూ కరువయ్యాయి. చెప్పలేనంత వెలితి, బాధ.
‘ఈ ఏడాది నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం. సంబంధం చూడమంటావా?’ అడిగారోరోజు నాన్న. గుండెలో పిడుగు పడ్డ్డట్లైంది. నా అభిరుచులు, ఇష్టాయిష్టాలేంటో తెలియని వ్యక్తితో జీవితమెలా పంచుకోను? అదే బాలు అయితే నా మొహం చూసి మనసులో ఏముందో గ్రహించేవాడు. నా మాట తీరులో తేడా గమనించి బాధగా ఉంటే ఊరడించేవాడు. అతడికన్నా నాకు సరిపోయే వ్యక్తి వేరొకరు ఉండరనిపించింది. ‘నాన్నా నేను బాలుని పెళ్లి చేసుకుంటా’ భయపడుతూనే చెప్పా. ‘సరేలేమ్మా.. ఓసారి ఇంటికి పిలువ్‌.. మాట్లాడదాం’ నాన్న అభయమివ్వడంతో నా పాదాలు గాల్లో నర్తించాయ్‌. జరగబోయే వేడుక ఊహించుకుంటూ డ్రీమ్స్‌లోకి వెళ్లిపోయా.
‘బాలూ.. మనం పెళ్లిపీటలెక్కే సమయమొచ్చింది’ సిగ్గుల మొగ్గవుతూ తనకి చెప్పా. ‘సారీ అనూ.. మా ఆర్థిక పరిస్థితేం బాగా లేదు. పైగా మాది తక్కువ కులం. నేన్నీకు సరిపోను’ నేనూహించని మాట చెప్పాడు. నా కళ్లెమ్మట ధారగా నీళ్లు. మొదటిసారి తనపై విపరీతమైన కోపమొచ్చింది. ‘అవన్నీ నాకు తెల్సు. మన పెళ్లికి మా నాన్న కూడా ఒప్పుకున్నారు. కాదనకు’ రెట్టించా. ‘సరే.. నేనింకా సెటిల్‌ కాలేదు. అప్పటివరకు నాకోసం ఎదురు చూడగలవా?’ అతడి మాటతో ప్రాణం లేచొచ్చింది. తనకోసం జీవిత కాలమైనా ఎదురుచూస్తానని చెప్పా.
నాన్న బాలుకి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. వద్దని తనకి నచ్చిన ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటాన్నాడు. నాకూ అతడిపై నమ్మకముండేది. ఈలోపు నేను చెన్నై వెళ్లి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరా. అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్లం. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకునేంతలోపే అనుకోని ఉపద్రవం. ‘మా చెల్లిని మర్చిపో. తను నిన్ను పెళ్లాడితే చాలా బాధలు పడాల్సి వస్తుంద’ని చెప్పాడట పెదనాన్న కొడుకు. ఆ మాట బాలు మనసుని విరిచేసింది. కావాలని నన్ను దూరం పెట్టసాగాడు. ఫోన్‌ చేస్తే కట్‌ చేయడం. ఓరోజు మా ఇంటికొచ్చి మీ అమ్మాయికి వేరే సంబంధం చూడమని చెప్పి వెళ్లిపోయాడట. అది తెలిసి నా గుండె పగిలింది.
ప్రస్తుతం నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా. బాలుకి కోరుకున్న ఉద్యోగమొచ్చింది. ఇద్దరం స్థిరపడ్డా మేం దూరంగానే ఉన్నాం. అయినా బాలూకి తప్ప నా మనసులో వేరొకరికి చోటు లేదు. ఎందుకంటే పరిచయమైంది మొదలు నా క్షేమం కోరుకున్నాడు తను. కాస్త చొరవ ఇస్తే ఎంతో అడ్వాంటేజ్‌ తీసుకునే అబ్బాయిలున్న ఈ రోజుల్లో ఎప్పుడూ హద్దుల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్నా నా నుంచి పైసా ఆశించలేదు. నాన్న సాయం వద్దని కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇంతకంటే మంచి భర్త నాకెక్కడ దొరుకుతాడు?
చివరగా నా బాలుకో మాట. నీతో పెళ్లికి నేనేం త్యాగాలు చేయడం లేదు. నా మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లాడాలనుకుంటున్నాను. కులం, హోదా.. ఇవన్నీ మర్చిపో. నీకోసం ఎన్ని కష్టాలైనా ఇష్టంగా భరిస్తాను. నన్ను అక్కున చేర్చుకో.
- అనూ

 
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని