సలాం పోలీసు..నీకు సలాం

లాఠీ పట్టిన ఖాకీనే పాటతో లాలిస్తున్నాడు... కాఠిన్యం చూపే వృత్తిలో ఉంటూనే జనంలో చైతన్యం రగిలిస్తున్నాడు... పనితో సతమవుతున్నా ఆపదల్లో సాయానికి ముందుంటున్నాడు...పాటనే డ్యూటీలో భాగంగా చేసుకొని సామాజిక సమస్యలపై స్పందిస్తున్న ఆ యువ పోలీస్‌ అంజపల్లి నాగమల్లు....

Published : 20 Jul 2019 00:38 IST

ప్రేరణ

లాఠీ పట్టిన ఖాకీనే పాటతో లాలిస్తున్నాడు... కాఠిన్యం చూపే వృత్తిలో ఉంటూనే జనంలో చైతన్యం రగిలిస్తున్నాడు... పనితో సతమవుతున్నా ఆపదల్లో సాయానికి ముందుంటున్నాడు...పాటనే డ్యూటీలో భాగంగా చేసుకొని సామాజిక సమస్యలపై స్పందిస్తున్న ఆ యువ పోలీస్‌ అంజపల్లి నాగమల్లు.
నాగమల్లుది సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల. డీఎడ్‌ చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన అతడ్ని కదిలించింది. చేతబడి చేస్తుందనే నెపంతో గ్రామస్తులంతా కలిసి ఒక మహిళను చితి మంటల్లో వేసి నిప్పంటించారు. ఈ దారుణంపై అప్పటి ఎస్‌పీ మహేశ్‌ భగవత్‌ స్పందించారు. జనంలో ఉన్న మూఢనమ్మకాల్ని పారదోలడానికి ఆయనే సొంతంగా చిన్నచిన్న మ్యాజిక్‌ ట్రిక్స్‌ చేసి చూపించేవారు. అవగాహన సదస్సుల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేవారు. ముందునుంచీ ఇలాంటి కార్యక్రమాలపై ఆసక్తి చూపించే నాగమల్లు వీటిలో భాగస్వామి అయ్యాడు. తర్వాత టీచరు, పోలీసు రెండు ఉద్యోగాలు ఒకేసారి వచ్చినా ప్రజల్ని నేరుగా చైతన్యవంతుల్ని చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పోలీసు ఉద్యోగంలో చేరాడు. రాచకొండ కమిషనరేట్‌లో తొలి పోస్టింగ్‌ అందుకున్నాడు.

పాట కచేరి
పాటల విషయానికొస్తే చిన్నప్పట్నుంచీ ఎప్పుడూ పాడింది లేదు. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత పోలీసులు పడే కష్టం చూసి చలించిపోయాడు. ఎండావానా లెక్క చేయక, భార్యా పిల్లలకు దూరంగా ఉంటూ, జనం రక్షణ కోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే తోటి పోలీసుల గొప్పతనం అందరికీ తెలిసేలా ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ తలపుల్లోంచి వచ్చిందే ‘పోలీసు అమర వీరులు’ అనే పాటల సీడీ రూపొందించాలనే ఆలోచన. పాటలు రాసి, తాను పాడి, ఇంకొన్ని ఇతరులతో పాడించి ఈ సీడీని రూపొందించాడు. దీనికోసం సొంతంగా వేల రూపాయలు ఖర్చు చేశాడు. తర్వాత 2016లో ట్రాఫిక్‌ ఎస్సైగా బదిలీ అయ్యింది. వృత్తిలో భాగంగా నిబంధనలు అతిక్రమించిన వారికి చలానాలు రాసినా, వాహనాల్ని అదుపులోకి తీసుకున్నా ప్రజల్లో పెద్దగా మార్పు రాదని గ్రహించాడు. దీనికి చెక్‌ పెట్టేందుకూ పాటనే బాటగా మలచుకున్నాడు. హెల్మెట్‌ ధరించాలి, మద్యం తాగి వాహనాలు నడపొద్దనే భావంతో ‘రయ్యిరయ్యిమంటూ’ పాట రాశాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఇది వైరల్‌ అయ్యింది. తర్వాత మహిళా చైతన్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలంటూ.. వేర్వేరు అంశాలపై పదుల సంఖ్యలో పాటలు రాశాడు. కేవలం పాటలు రాయడమే కాదు.. ఆపదల్లో స్పందించడమూ నాగమల్లుకి అలవాటే. ఓరోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్త స్రావమవుతున్నా ఆదుకోవడానికి జనాలు ఎవరూ ముందుకు రాలేదు. ఇతరుల సాయంతో ప్రథమ చికిత్స చేసి బాధితుల్ని ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పట్నుంచి తన వాహనంలో ‘ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ని’ తప్పనిసరిగా ఉంచుకుంటున్నాడు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే సాయం చేయమంటూ 100మంది ఆటో డ్రైవర్‌లకి ‘ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లని’ అందించాడు. ఈ సేవలకు, జనాలను చైతన్యవంతుల్ని చేస్తున్నందుకుగానూ అతడికి ఉన్నతాధికారుల నుంచి చాలాసార్లు ప్రశంసలు అందాయి. ‘బెస్ట్‌ పోలీస్‌’ అవార్డు వరించింది.


  పోలీసు కళా బృందం

ఊళ్లో దొంగలు పడుతున్నారు, చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు అంటూ కొన్నాళ్ల కిందట సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం జరిగింది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా కల్పితమని చెప్పడానికి ‘దొంగలు దొంగలు జిల్లేడమ్మ జిటా’్ట పాట రాశాడు నాగమల్లు. ఈ పాట ప్రజల నోళ్లలో నానింది. అతడి ప్రతిభ గుర్తించి రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ‘రాచకొండ పోలీసు కళాబృందం’ ఏర్పాటు చేసి నాగమల్లుని సారథిగా నియమించారు. దీనిద్వారా ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ, బాలికల విద్య, బాల కార్మిక నిర్మూలన, బాల్యవివాహల రద్దు తదితర అంశాలపై చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికి 40 గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని