క్రియేటివ్‌ క్యాంపస్‌!

విద్యార్థుల గుంపులు.. వారి కేరింతలు.. వరుసగా చెట్లు.. బ్లాకులుగా తరగతి గదులు.. అంతేనా? ఏం కాదు.. ఒడిశాలోని బ్రహ్మపుర ఐటీఐ కళాశాలలోకి వెళ్లి చూడండి. ఓ వైపు పెద్ద జింక.. గోడపై ఆరడుగుల బల్లి.. హెలీకాప్టర్‌..  యుద్ధ విమానం.. 70 అడుగుల గిటార్‌..

Updated : 27 Jul 2019 00:57 IST

కళాత్మకం..

కాలేజీలోకి వెళ్లగానే ఏం కనిపిస్తాయి?
విద్యార్థుల గుంపులు.. వారి కేరింతలు.. వరుసగా చెట్లు.. బ్లాకులుగా తరగతి గదులు.. అంతేనా? ఏం కాదు.. ఒడిశాలోని బ్రహ్మపుర ఐటీఐ కళాశాలలోకి వెళ్లి చూడండి. ఓ వైపు పెద్ద జింక.. గోడపై ఆరడుగుల బల్లి.. హెలీకాప్టర్‌..  యుద్ధ విమానం.. 70 అడుగుల గిటార్‌.. ఇంకా ఎన్నో కనిపిస్తాయి.  అవన్నీ విద్యార్థులు వ్యర్థాలతో చేసిన బొమ్మలు.
డిశా రాష్ట్రానికి నిత్యం ప్రకృతి వైపరీత్యాల తాకిడే. ఓ తుపాను వచ్చిందంటే ఎంత నష్టాన్ని మిగులుస్తుందో అంచనా వేయలేం. అలాంటిది ఈ కళాశాల విద్యార్థులు అది చేసిన నష్టాన్ని సైతం అందంగా చెప్పారు. నిరుపయోగంగా మిగిలిపోయిన వస్తువులతో వ్యర్థాల వనం సృష్టించారు. దీనికి కారణం ఐటీఐ ప్రధానోపాధ్యాయులు రజత్‌ కుమార్‌ పాణిగ్రాహి. ఈ ఆచరణ వెనకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.

"మేం తయారు చేసిన వాటితో  ‘స్క్రాప్‌ పార్క్‌’, ‘స్క్రాప్‌ మ్యూజియం’ ప్రారంభించాలనుకున్నాం. ఆకృతుల నిర్మాణంపై పరిశోధనలు చేశాం. కళాశాలలో శిక్షణ పొందుతున్న పెయింటింగ్‌, వెల్డింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టింగ్‌, ప్లంబింగ్‌ తదితర విభాగాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అలా 70 ఆకృతులు తయారు చేశాం. వీటిలో ఒకటి నుంచి ఐదడుగుల ఎత్తున్నవి మ్యూజియంలో, 15-20 అడుగుల ఎత్తున్నవి పార్క్‌లో పొందుపరిచాం. ఇలా కళాశాల ఆవరణని శుభ్రం చేసుకుని పర్యావరణ హిత ఆకృతులు చేశాం. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద పార్క్‌, మ్యూజియంను ప్రధాని మోదీకి అంకితం ఇవ్వనున్నాం."

70 అడుగుల గిటారు
ఛత్తీస్‌గఢ్‌లో జనరల్‌ స్టోర్స్‌ ఈస్ట్‌ రైల్వే ఉద్యోగులు 32 అడుగుల ఎత్తైన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ప్రతిమను రూపొందించారు. దీన్ని గమనించి ఒడిశా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ శుభ్రతో బాగ్చీ 70 అడుగుల గిటారు చేయమని ప్రతిపాదించారు. విద్యార్థులతో సమావేశమై తగిన సూచనలిచ్చి వారిని గిటారు తయారు చేసేందుకు ప్రోత్సహించాం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

- పి.కృష్ణ నిజాశ్రిత, ఒడిశా డెస్క్‌
     ఫొటోలు: ఆర్‌.శ్రీనివాస్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని