ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి తప్పు చేశానేమో!!

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ఆ ఏడాది దసరా ఉత్సవాల్లో బతుకమ్మ ఆడుతున్న ప్రియని చూశా. ఆ క్షణం మన సంస్కృతి గొప్పదే కాదు.. చాలా అందమైంది అనిపించింది. తొలిచూపులోనే ప్రేమలో పడిపోవటం అంటే ఇదేనేమో! తననే చూస్తూ వాళ్లింటి వరకూ వెళ్లా.

Updated : 27 Jul 2019 01:04 IST

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ఆ ఏడాది దసరా ఉత్సవాల్లో బతుకమ్మ ఆడుతున్న ప్రియని చూశా. ఆ క్షణం మన సంస్కృతి గొప్పదే కాదు.. చాలా అందమైంది అనిపించింది. తొలిచూపులోనే ప్రేమలో పడిపోవటం అంటే ఇదేనేమో! తననే చూస్తూ వాళ్లింటి వరకూ వెళ్లా. ఎలాగైనా మాట్ల్లాడాలనుకున్నా కుదరలేదు. తనతో మాట కలపాలి.. పరిచయం చేసుకోవాలి.. కానీ ఎలా? ఆలోచనలో పడ్డా. సోషల్‌ లైఫ్‌లో ఎంత వెతికినా తన జాడ దొరకలేదు. సరిగ్గా ఆ టైమ్‌లోనే ఓ చిన్న క్లూ. ప్రియ నా స్నేహితుడి చెల్లెలి ఫ్రెండ్‌ అని తెలిసింది. హాస్టల్‌లో ఉంటూ హైదరాబాద్‌లో చదువుకుంటోంది. అంతే.. నాలోని లవ్‌ సిమ్‌కి సిగ్నల్‌ అందడం మొదలైంది. ఫ్రెండ్‌ చెల్లి ద్వారా ప్రియా ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ తెలుసుకొని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాను. అట్నుంచి స్పందన లేదు. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత నా రిక్వెస్ట్‌ ఓకే చేసింది. ఫేస్‌బుక్‌ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు. మా ఇద్దరికీ మీడియేటర్‌ ఎఫ్‌బీనే. కొద్ది రోజుల్లోనే దగ్గరయ్యాం. ఓ రోజు తన బర్త్‌డే నోటిఫికేషన్‌ వచ్చింది. ఇదే సరైన టైమ్‌ అనుకుని ప్రపోజ్‌ చేశా. ఒప్పుకొంది. ఎఫ్‌బీకి గుడి కట్టేద్దాం అనుకున్నా. కొద్ది రోజులకే ఎఫ్‌బీ గేటు దాటి ఫోన్‌ నెంబర్లు మార్చుకున్నాం. ఇంకేంటి.. గంటల తరబడి కబుర్లే. ఇలా మా ప్రేమాయణం సంతోషంగా కొనసాగుతున్న సమయంలో నా లవ్‌ సిమ్‌కి ఓ స్పైవేర్‌ మెసేజ్‌ వచ్చింది. ఓ ఫ్రెండ్‌ ప్రియ గురించి చెడుగా చెప్పడం. నమ్మలేకపోయా.. స్నేహితుడితో విభేదించి గుడ్‌బై చెప్పేశా. మదిలో ఏదో ఆలోచన. ప్రేమ ఉన్న చోట అనుమానానికి తావుండదు. కానీ, నాలోని ప్రేమని అనుమానం ఓవర్‌ టేక్‌ చేసింది. దానికి ఫలితంగా తన ఫేస్‌బుక్‌ వివరాలు తెలివిగా సేకరించా. లాగిన్‌ అయ్యాక.. సైన్‌ అవుట్‌ చేయలేని పరిస్థితి! హిస్టరీలోకి వెళ్లి చూస్తే వేరే వ్యక్తితో నాకంటే చనువుగా మాట్లాడుకున్న మెసేజ్‌లు.. ఫొటోలు.. కామెంట్‌లు.. ఒక్కసారిగా నా లవ్‌సిమ్‌ క్రాక్‌ ఇచ్చినట్లయింది. తేరుకుని తనని అడిగితే. మా బంధువుల అబ్బాయని, వరసకి బావ అవుతాడని చెప్పింది. ప్రేమించా కదా.. నమ్మించేంతలా చెప్పింది. కానీ, గాయపడిన నా గుండెకి అప్పటికీ నమ్మకం కుదరలేదు. ఎర్రర్‌ నోటిఫికేషన్‌లా అలర్ట్‌ మెసేజ్‌లు ఇస్తూనే ఉంది. దాన్ని నిజం చేస్తూ.. నేను ఎప్పుడో దూరం చేసుకున్న నా స్నేహితుడు ఓ వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఎవరని అడిగితే ‘నీ ప్రియురాలు ఎవరినైతే బావ అని నీకు చెప్పిందో అతను’ అన్నాడు. అసలు ఆ వ్యక్తి ప్రియ బావే కాదు. వాళ్ల అమ్మమ్మ ఇంటి పక్క కుర్రాడు. అతనితో కూడా ప్రియ ప్రేమాయణం సాగిస్తోందట. ఇదే విషయమై ఆమెను నిలదీశాను. ‘నన్ను నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా, నన్నే అవమానిస్తావా’ అంటూ ఏడుస్తూ వెళ్లిపోయింది. నాకేం అర్థం కాలేదు. చూస్తూ ఉండిపోయా. క్షణాల్లో అన్నీ గుర్తొచ్చాయి.. తనతో ఊహించుకున్న జీవితం.. కన్న కలలు.. చివరికి తన ప్రేమ కోసం నా ప్రియమిత్రుడితో గొడవపడడం. తనో తీపి, చేదు జ్ఞాపకం. అంతే.. దాన్నుంచి తేరుకునేలోపు ఏడాది కరిగిపోయింది. విలువైన సమయం వృథా చేసుకున్నా అనిపించింది.  ప్రస్తుతం హైదరాబాద్‌లో పీజీ చేస్తున్నాను. మన మంచి కోరే స్నేహితులు పక్కన ఉన్నంత వరకూ మనకి  ఎలాంటి చెడు జరగదు అనిపించింది.

- సాయి వినీత్‌, హైదరాబాద్‌.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని