మరవలేని స్నేహం.. మధురం!

నాకు ఆరేళ్లప్పుడనుకుంటా. మా ఇంటి ఎదురుగా కొత్తగా ఓ ఫ్యామిలీ అద్దెకు దిగింది. చిట్టిచిట్టి చేతులతో ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్తూ వాళ్ల నాన్నకు సాయపడుతుందో అమ్మాయి.

Published : 03 Aug 2019 00:18 IST

నాకు ఆరేళ్లప్పుడనుకుంటా. మా ఇంటి ఎదురుగా కొత్తగా ఓ ఫ్యామిలీ అద్దెకు దిగింది. చిట్టిచిట్టి చేతులతో ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్తూ వాళ్ల నాన్నకు సాయపడుతుందో అమ్మాయి. తనే లక్కీ. తన దగ్గర చిన్న సైకిల్‌ ఒకటుండేది. నా మనసంతా దానిపైనే. చాలాసార్లు ఇవ్వమని అడగాలనుకునేవాణ్ని. కానీ భయం. తర్వాత కొద్దిరోజులకు లక్కీగా లక్కీ నా క్లాస్‌లోనే జాయినైంది. లంచ్‌ బ్రేక్‌లో ఒక్కతే ఒంటరిగా కూర్చొని తినేది. నేనోరోజు వెళ్లి ‘హాయ్‌ నా పేరు నాని. నీ పేరో’ అనగానే ‘లక్కీ’ అంది. అలా చిన్నప్పుడే మా స్నేహం చిగురించింది. లక్కీ నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో బదిలీపై ఇక్కడికొచ్చామంది. ఒకే కాలనీ కావడంతో వాళ్ల నాన్న, మా నాన్న ఫ్రెండ్సయ్యారు. ఓసారి వాళ్ల నాన్నతోపాటు మా ఇంటికొచ్చినప్పుడు ‘లక్కీ నిన్కొకటి అడగనా.. నీ సైకిల్‌ ఓసారి ఇస్తావా కాసేపు ఆడుకుని ఇస్తా’ అన్నాను. సరేనంది. అలా ఇద్దరం ఆడుకుంటూ మంచి స్నేహితులమయ్యాం.

చూస్తుండగా సంవత్సరాలు గడిచిపోయాయ్‌. మా పదీ పూర్తైంది. కాలేజీ బాగుందని ఇంటర్లో తనని వాళ్ల అమ్మమ్మ ఊరిలో చేర్పించారు. రెండేళ్లు రోజూ గుర్తొచ్చేది. తను పక్కన లేకుంటే ఏమీ తోచేది కాదు. ఇంటర్‌ పూర్తయ్యాక బీటెక్‌లోకి ఎంటరయ్యాం. ముందే అనుకొని హైదరాబాద్‌లో ఒకే కాలేజీలో సీటు సంపాదించాం. ఇంతలో మా నానమ్మకి అనారోగ్యం. మెరుగైన వైద్యం చేయించడానికి మా కుటుంబమంతా హైదరాబాద్‌ వచ్చేసింది. మా కాలేజీలో ఎవరైనా నా జోలికొస్తే తను అస్సలు ఊరుకునేది కాదు. నాకిది నచ్చింది అంటే ఎంత కష్టమైనా తీసుకొచ్చేది. నేను అంతే. తననెవరైనా ఏడిపిస్తే వాళ్లతో గొడవేసుకునేవాణ్ని.

మా స్నేహాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకొని మాది ప్రేమ అని పేరు పెట్టేవారు. ఒక్కడు తప్ప. వాడే బాలు. బాలచంద్రరావు. వాడి ఆలోచనలు, అభిప్రాయాలు మాకు జిరాక్స్‌ కాపీలా ఉండేవి. మేం ముగ్గురం ఒకేమాట మీదుండే వాళ్లం. కష్టం, సుఖం అన్నింటినీ పంచుకునేవాళ్లం. సిటీ అంతా చక్కర్లు కొట్టడం, సినిమాలు, షికార్లు, లాంగ్‌ ట్రిప్పులు.. జీవితాన్ని తెగ ఎంజాయ్‌ చేసేవాళ్లం.

అలా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో మా నాన్న ఒక మాట చెప్పారు. ‘మిమ్మల్ని చిన్నప్పటి నుంచీ చూస్తున్నా. నాకు తెలుసు మీ మధ్య ఉంది స్నేహం మాత్రమే అని, కానీ ఈ సమాజం అలా అర్థం చేసుకోదు. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి బయటకెళ్లారంటే తప్పుగా చూసేవాళ్లెందరో. కానీ మీ స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా’ అని. ఆ మాటతో మాకు కొండంత అండ దొరికిందనిపించింది. ఎవరో ఏదో అనుకుంటారనీ, ఈ సమాజం గురించీ మేం పట్టించుకోవద్దనే నిర్ణయానికొచ్చాం. వేరే వాళ్ల కోసం మంచి మిత్రుల్ని కోల్పోలేం కదా! కానీ, జీవితంలో మలుపులు సహజం. బీటెక్‌ పూర్తయ్యాక బాలు కలలుకంటున్న యూఎస్‌కి వెళ్లిపోయాడు. లక్కీ పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలైంది. వారిద్దరూ దూరమై నాలుగేళ్లైంది. కానీ మా స్నేహం మాత్రం అప్పటిలా అంతే తాజాగా ఉంది. వాళ్లు నా పక్కన లేరని బాధ అనిపిస్తే ఒక్కసారి ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌, పురానాపూల్‌లకు వెళ్లిపోతా. మేం కలిసి తిరిగిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటా. ఆటోమేటిగ్గా నా పెదాలపై చిరునవ్వు చేరుతుంది. ఈ స్నేహితుల దినోత్సవం రోజు మీరు నాతో లేకపోయినా సిటీ మొత్తం చక్కర్లు కొట్టి మన అనుభూతులను మళ్లీమళ్లీ గుర్తు చేసుకుంటా. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌డే లక్కీ అండ్‌ బాలూ.

- నాని నిఖిల్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని