ఒక్క క్లిక్‌తో సేంద్రియ కూరగాయలు

ఆన్‌లైన్‌లో కూరగాయలు, పండ్లు ఆర్డర్‌ చేస్తున్నాం. గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నాయ్‌. కానీ, అవి సేంద్రియ సాగుతో పండించినవేనా? ఆలోచిస్తున్నారు కదూ! సరిగ్గా ఇక్కడే ఆగాడో మిలీనియల్‌.. పేరు రామరాజు. రైతే రాజని నమ్మే ఈ రాజు పండించేది పోషక రహితం

Published : 17 Aug 2019 00:33 IST

అంకురార్పణ

ఆన్‌లైన్‌లో కూరగాయలు, పండ్లు ఆర్డర్‌ చేస్తున్నాం. గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నాయ్‌. కానీ, అవి సేంద్రియ సాగుతో పండించినవేనా? ఆలోచిస్తున్నారు కదూ! సరిగ్గా ఇక్కడే ఆగాడో మిలీనియల్‌.. పేరు రామరాజు. రైతే రాజని నమ్మే ఈ రాజు పండించేది పోషక రహితం కాకూడదనుకున్నాడు. వెంటనే సేంద్రియ సాగుకి దిగాడు.. అంతేనా? పండించిన వాటిని ఇంటి గడపకే చేరవేస్తున్నాడు. ‘గో ఫార్మ్‌’ అంకుర సంస్థతో.. తన స్టార్టప్‌ జర్నీని పంచుకున్నాడిలా..
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర్లో ఉండే బాలెంపల్లి గ్రామం. యూకేలో ఎమ్‌.ఎస్‌ చదివా. హైదరాబాద్‌కొచ్చి వెబ్‌సైట్స్‌ రూపొందించే ‘ఇన్నోసాఫ్ట్‌’ సంస్థ నెలకొల్పా. కస్టమర్లు లేక కష్టాలు పడ్డా. ఆ తర్వాత ‘వెబ్‌సైట్‌ చేశాక నచ్చితేనే డబ్బులు ఇవ్వండి.. లేకుంటే డబ్బు వాపసు ఇస్తాను’అని ప్రకటించా. ఛాలెంజింగ్‌గా ఓ ఐదు వెబ్‌సైట్స్‌ రూపొందించా (ఇప్పటివరకూ వంద వెబ్‌సైట్స్‌కి పైగా). ఇక  ఫార్మింగ్‌లోకి రావడానికి నా మూలాలే కారణం. నేను రైతు బిడ్డని. నాన్నగారు రసాయన ఎరువులతోనే వ్యవసాయం చేసేవారు. మా ఊరిలోని రైతులూ అంతే. ఆ ఎరువులే ఎందుకు వాడుతున్నారని అడిగా. ‘మేం సేంద్రీయ వ్యవసాయం చేస్తే దిగుబడి తక్కువ. మార్కెట్లో పంటకి అదే విలువ’ంటూ బాధపడ్డారు. అది చూశాక సేంద్రియ వ్యవసాయంపై మనసు మళ్లింది. రిసెర్చ్‌ చేశా. బెంగళూరులో 400 ఆర్గానిక్‌ స్టోర్లుంటే హైదరాబాద్‌లో 40 కంటే ఎక్కువ లేవు. అందుకే డైరెక్ట్‌గా తోటనుంచి వినియోగదారులకి నేరుగా కూరగాయల్ని అందించాలనుకున్నా. హైదరాబాద్‌, కర్నూలు, కోస్తా.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఆర్గానిక్‌ఫుడ్‌ పండించే రైతుల్ని కలిసి ఓ నిర్ణయానికొచ్చా. కష్టమైనా సరే.. సేంద్రియ కూరగాయల్ని హోమ్‌డెలివరీ చేయాలనుకున్నా. ఇంట్లోవాళ్లు ఇబ్బందులొస్తాయన్నా.. వెనకడుగు వేయలేదు.. ఎందుకంటే నాకు వ్యవసాయమంటే ఇష్టం. 2018 అక్టోబర్‌లో గోఫార్మ్‌ పేరుతో మార్కెట్లోకి వచ్చా.

అదే నా కల..
హైదరాబాద్‌ శివారులో 25 ఎకరాలు కౌలుకు తీసుకున్న భూమిలో సేంద్రియ కూరగాయలు పండించా. యాప్‌తో పాటు బంధువుల ఇళ్ల దగ్గర ఆఫ్‌లైన్‌లోనూ అమ్మించా. మా వెబ్‌సైట్‌, యాప్స్‌లోకి వచ్చి కూరగాయలు కొంటున్నారు. వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ చూసి వాళ్లకు తెలిసిన సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకూ వివరాలిచ్చారు. ప్రస్తుతం మాకు పన్నెండుమంది రైతులతో ఒప్పందముంది. హైదరాబాద్‌లో దాదాపు 3200 మంది యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సేంద్రియ కూరగాయల్ని ఇంటికి చేర్చే సంస్థలు హైదరాబాద్‌లో ఎన్ని వచ్చినా తక్కువే. అంత మార్కెట్‌ ఉంది. కొందరు సేంద్రీయ కూరగాయలు, పండ్లను కొనేముందు చూడాలంటున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఆదిత్యనగర్‌లో ఓ మోడల్‌ ఆర్గానిక్‌ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ను ఇటీవలే ప్రారంభించాం. నచ్చితే కొనవచ్చు లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయొచ్చు. కూరగాయలు అర్ధరాత్రి కోశాక పాలప్యాకెట్ల మాదిరే ఆరులోపలే కస్టమరు ఇంటికి చేర్చాలనేదే మా కల. ఈ కామర్‌్్స వ్యాపారం కర్నూల్‌, వైజాగ్‌, బెంగళూరులకూ విస్తరిస్తాం. పండించేవాడికీ, తినేవాడికీ మధ్య దళారి ఉండకూడదనేది మా ఆలోచన. మీ ఊరిలో ‘గోఫార్మ్‌’ లాంటి యాప్‌ని మీరే తయారు చేసుకోవచ్చు. దీంతో డబ్బుతో పాటు సంతృప్తి కూడా పొందవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని