నో అన్న నువ్వే..!

2018 అక్టోబర్‌ 3. రోజులాగే నా ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పనిలో నిమగ్నమయ్యా. ఇంతలో ‘హాయ్‌’ అనే ఫేస్‌బుక్‌ సందేశం. ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయా. కళ్లు తడుముకొని మరోసారి చూశా. నిజమే.. ఆ మెసేజ్‌ వచ్చింది తన నుంచే. ఎగిరి గంతేసి రిప్లై ఇచ్చా.

Published : 17 Aug 2019 00:33 IST

2018 అక్టోబర్‌ 3. రోజులాగే నా ల్యాప్‌టాప్‌లో ఆఫీసు పనిలో నిమగ్నమయ్యా. ఇంతలో ‘హాయ్‌’ అనే ఫేస్‌బుక్‌ సందేశం. ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయా. కళ్లు తడుముకొని మరోసారి చూశా. నిజమే.. ఆ మెసేజ్‌ వచ్చింది తన నుంచే. ఎగిరి గంతేసి రిప్లై ఇచ్చా. కానీ ఎలా మాట్లాడాలో తెలీని భయం. తనే చొరవ తీసుకొని నా జంకు పోగొట్టింది. ఆ ఆనందం నన్ను రెండు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లింది.
అప్పుడు నేను పదోతరగతి పరీక్షలు రాసి పాలిటెక్నిక్‌ సీటు కోసం కోచింగ్‌లో జాయినయ్యా. అదే సెంటర్‌లో తానూ చేరింది. నిండు జాబిల్లిలాంటి గుండ్రని ముఖం, పెదాలపై చెరగని దరహాసం, వాలు జడతో నిదానంగా నడుస్తూ వచ్చేది. మళ్లీమళ్లీ చూడాలని మనసు పోరు పెడుతుంటే చాటుగా నిల్చొని తన రాక కోసం ఎదురు చూస్తుండేవాడిని.
క్లాస్‌లో ఎప్పుడూ తనే ఫస్ట్‌. ఆ స్థానం నేను దక్కించుకోవాలని తెగ ప్రయత్నించేవాడ్ని. కానీ ఎప్పుడూ నిరాశే మిగిలేది. ఆ అందం, అణకువ, చదువుల్లో చురుకు.. అన్నీ కలిసి నన్ను తనకి అభిమానిగా మార్చేశాయి. విపరీతమైన ఇష్టం పెంచేశాయి. తనూ ఒక్కోసారి నావంక చూస్తూ నవ్వేది. తనకూ నాలానే అనిపిస్తుందేమో.. ఎంతైనా అమ్మాయి కదా మొహమాట పడుతుంటుందని ఒకరోజు ధైర్యం చేసి చిన్న చీటీ మీద ‘ఐ లవ్‌ యూ’ అని రాసిచ్చా. మర్నాడు ఏం చెబుతుందోనని ఆ రాత్రి నాకు నిద్ర పడితే ఒట్టు. నా ప్రేమను అంగీకరిస్తుందా? తిడుతుందా? పెద్దవాళ్లకి చెబుతుందా? రకరకాల ఆలోచనలతో తెల్లారిపోయింది.
ఎప్పటిలాగే నిదానంగా నడుచుకుంటూ వచ్చి క్లాస్‌లో కూర్చుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నా. తనూ నావైపు చూసింది. కానీ ఆ ముఖంలో నన్ను చూసిన ప్రతిసారీ కనిపించే నవ్వు లేదు. మెల్లగా నాదగ్గరకొచ్చి నేనిచ్చిన చీటీనే నా చేతిలో పెట్టింది. వెనకవైపు ‘అయామ్‌ సారీ’ అని ఉంది. నా గుండె పగిలింది. కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది. కాసేపటికే అర్థమైంది నేను తనని తప్పుగా అర్థం చేసుకున్నానని. తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్‌ మొదలైంది నాలో. తను మాత్రం మామూలుగానే ఉంది. గొడవ చేయలేదు. నా ప్రపోజల్‌ సంగతి ఎవరికీ చెప్పలేదు. తన ప్రవర్తన నాకో గుణపాఠం నేర్పింది. అప్పట్నుంచి జీవితంలో నేనెవరికీ ప్రపోజ్‌ చేయలేదు. నేను తన ముందు తల ఎత్తడానికి జంకేవాణ్ని. తను ఎప్పటిలానే ఫస్ట్‌ ర్యాంకుతో మంచి కాలేజీలో సీటు సంపాదించుకుంది. నేను అరకొర మార్కులతో ఓ కాలేజీలో సీటు సాధించి ఇంగ్లిషుపై ఉన్న భయంతో మధ్యలోనే చదువు ఆపేసి పొలం పనులకు అంకితమయ్యా.
తను దూరమైనా తన తలపులు నన్ను వదిలేవి కావు. ఎప్పటికప్పుడు తన గురించి ఆరా తీస్తుండేవాణ్ని. తను మంచి ర్యాంక్‌తో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిందనీ, అంతా కలలు కనే మేటి ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం సంపాదించిందని తెలిసింది. తనంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అలాంటప్పుడు తనలా నేనూ ఎందుకు మంచి పొజిషన్‌లో ఉండకూడదనే కాంక్ష మొదలైంది.  ఆమె ఎదుగుదలే నాకు స్ఫూర్తిపాఠమైంది. మళ్లీ పుస్తకం అందుకొని దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశా. అనుక్షణం ఆమెనే గుర్తు చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశా. ఆ కష్టం ఊరికే పోలేదు. మంచి కంపెనీలో ఉద్యోగం దక్కింది. పాలిటెక్నిక్‌ కోచింగ్‌ తర్వాత తనని నేరుగా కలిసింది లేదు. మాట్లాడిందీ లేదు. కానీ జీవితంలో పైకి రావాలని ఆశ కలిగింది మాత్రం తన వల్లే.
అలా దూరమైన నా స్ఫూర్తి ప్రదాత ఫేస్‌బుక్‌ ద్వారా మళ్లీ చేరువైంది. ఓరోజు ఇంటికి పిలిచింది. కంటికి రెప్పలా చూసుకునే భర్త, ముత్యాల్లాంటి పిల్లలతో ఉన్న ఆమె అందమైన కుటుంబాన్ని చూస్తే ముచ్చటేసింది. స్పష్టమైన ఆలోచనలు, మాటల్లో సున్నితత్వం, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం తనది. ఆ రోజు నేను తప్పు చేయకుండా ఉండుంటే ఇన్ని సంవత్సరాల స్నేహం కోల్పోయేవాడినే కాదు. మనకి స్ఫూర్తినిచ్చేవారు ఎక్కడో కాదు మన పక్కనే ఉంటారని తన ద్వారా తెలిసింది. నేస్తమా.. నేను మరింత ఎత్తుకు ఎదిగి నా విజయాన్ని నీకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వూ జీవితంలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని, మన స్నేహం కలకాలం కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను.

- క్రాంతి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని