శుభ్రతారోహణ

హిమాలయాలకు వెళ్లి ట్రెక్కింగ్‌ చేయాలని ఎవరికి ఉండదు? అక్కడి అందాలతో సెల్ఫీ దిగాలని అందరి మనసుల్లో ఉంటుంది. ఇలా సెల్ఫీ తీసినప్పుడు... అక్కడి అందమైన ప్రకృతితోపాటు... పక్కనే చెత్త, ప్లాస్టిక్‌ సెల్ఫీలో వస్తే...

Updated : 31 Dec 2018 17:26 IST

శుభ్రతారోహణ

హిమాలయాలకు వెళ్లి ట్రెక్కింగ్‌ చేయాలని ఎవరికి ఉండదు? అక్కడి అందాలతో సెల్ఫీ దిగాలని అందరి మనసుల్లో ఉంటుంది. ఇలా సెల్ఫీ తీసినప్పుడు... అక్కడి అందమైన ప్రకృతితోపాటు... పక్కనే చెత్త, ప్లాస్టిక్‌ సెల్ఫీలో వస్తే... బాగుంటుందా? ఉండదు కదా! పైగా ఇలా ఉండటం వల్ల పర్యావరణ కాలుష్యం అధికమై... ఆ ప్రాంత ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చు. అందుకే దీన్ని ఎలాగైనా ఆపాలని సంకల్పించాడో యువకుడు. అతని పేరు ప్రదీప్‌. ఊరు మనాలి. రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌. ‘హీలింగ్‌ హిమాలయ’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి హిమాలయాల్లో స్వచ్ఛభారత్‌ నిర్వహిస్తున్నాడు. తనలా ఆసక్తి ఉన్న వలంటీర్లను తీసుకొని ట్రెక్కింగ్‌ చేస్తూ... అక్కడి పరిసరాలను శుభ్రం చేస్తున్నాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తున్నాడు. సేకరించిన మొత్తం వ్యర్థాలను రెండు విద్యుత్తు కేంద్రాల(చెత్త నుంచి విద్యుత్తు ఉత్పతి చేసే కేంద్రాలు)కు అందిస్తున్నాడు. ఇలా ఇప్పటిదాకా 4,00,000 కిలోల చెత్తను సేకరించాడు. స్వచ్ఛహిమాలయాల కోసం పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఆసక్తి గల వారందరినీ కలుపుకొని హిమాలయాల్లో అందమైన ప్రదేశాలను అందంగానే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. పైగా ఆ రాష్ట్రంలో ట్రెక్కింగ్‌ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాడు. సాధారణంగా ట్రెక్కింగ్‌కు ప్రత్యేక లక్ష్యమంటూ ఉండదు. ఇతను మాత్రం శుభ్రత కోసం ట్రెక్కింగ్‌ అని పిలుపునిచ్చి చైతన్యం రగిలిస్తున్నాడు. ‘హిమాలయాల సందర్శనకు వచ్చేవారు దయచేసి సొంత వాటర్‌బాటిల్‌ తెచ్చుకోమని, స్ట్రాస్‌, ప్లాస్టిక్‌ సంచులు వినియోగించవద్ద’ని చెబుతున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని