ఎలా ఉందో? ఎక్కడ ఉందో?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో సాధారణంగా అమ్మాయిలు చేరరు. అలాంటిది మా కాలేజీలో ఐదుగురు చేరారు. వారిలో ఒక అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. తన పేరు జై. నా పేరు ప్రవీణ్‌. రోల్‌నంబర్లలో మా ఇద్దరి...

Published : 27 Oct 2018 11:15 IST

ఎలా ఉందో? ఎక్కడ ఉందో?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో సాధారణంగా అమ్మాయిలు చేరరు. అలాంటిది మా కాలేజీలో ఐదుగురు చేరారు. వారిలో ఒక అమ్మాయి నన్ను ఆకట్టుకుంది. తన పేరు జై. నా పేరు ప్రవీణ్‌. రోల్‌నంబర్లలో మా ఇద్దరి పేర్లు పక్కపక్కనే వచ్చాయి. ఏదో తెలియని ఆనందం. మెల్లగా స్నేహం పెరిగింది. పరీక్షలకు కలసి ప్రిపేర్‌ అయ్యేవాళ్లం. ఫ్రెండ్స్‌తో కలసి సినిమాలకు వెళ్లేవాళ్లం. సెకండ్‌ సెమిస్టర్‌ సమయంలో తనే ప్రపోజ్‌ చేసింది. నాకు మొదటి నుంచి తనంటే ఇష్టమే కావడంతో మా మధ్య ప్రేమ ఎవరెస్టెంత ఎదగడానికి ఎంతో కాలం పట్టలేదు. ఫ్రెండ్స్‌తో కలసి సినిమాకు వెళ్లేవాళ్లం.... తర్వాత ఇద్దరమే వెళ్లడం మొదలుపెట్టాం. ‘పిల్ల జమిందారు’ సినిమా వచ్చింది. అందులో పీజేలా మా ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలను కలిపి మా జంటకు ‘పీజే’ అని పేరుపెట్టుకున్నాం. ఇంజినీరింగ్‌ అయిపోయింది. తను నా జీవితభాగస్వామి అయితే నేను ఎంతో సంతోషంగా ఉంటాను. అయితే తనని పెళ్లి చేసుకోవాలంటే.. ఒక ఇబ్బంది ఉంది. మా ఇద్దరి కులాలు వేరు. జై వాళ్ల ఊరు కైకలూరు దగ్గర పల్లె. వాళ్ల నాన్న అక్కడ మాజీ ప్రజాప్రతినిధి. వాళ్ల కులం వాళ్లకు ఆయనే పెద్ద. నేను వెళ్లి పెళ్లి విషయం చెబితే బాగుండదనుకున్నాను. మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అప్పుడు అడగాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం జై కి చెప్పాను. తనూ ఓకే అంది. హైదరాబాద్‌కు వచ్చేశాను. బ్యాంకు క్లర్క్‌- 2016లో ఉద్యోగం సంపాదించాను. ఇంతకాలం తను మానసికంగా ఎంతో బలం ఇచ్చింది. ఇక భయం లేదనుకొని వాళ్లింటికి వెళ్లి అడిగాను. జై వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. మానాన్నతో అడిగించాను. అంగీకరించలేదు. పైగా మా నాన్నని అవమానించి పంపించేశాడు. మా బావ అడిగితే... పోలీసు కేసు పెడతామని బెదిరించారు. తనని తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామంటే... జై కి ఇష్టం లేదు. ఎప్పటికైనా పెద్దల్ని ఒప్పిద్దామంది. ఇంతలో వాళ్ల నాన్న జై ఫోన్‌ లాగేసుకున్నాడు. ఇన్ని ఇబ్బందులున్నా వారానికి ఒక్కసారైనా కలుసుకునే వాళ్లం. మా ఇద్దరికీ గీతాంజలి సాయం చేసేది. ఈ విషయం ఎలాగో వాళ్లనాన్న తెలుసుకున్నాడు. ఇప్పుడు జైని ఊళ్లో లేకుండా చేశారు. తను ఎక్కడుందో తెలియడం లేదు. తనతో మాట్లాడకుండా ఒక్క క్షణమైనా ఉండలేని నేను ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నాను. మైండ్‌ పనిచేయడం లేదు. డ్యూటీ సరిగ్గా చేయలేకపోతున్నాను. కోల్‌కతాలో బ్యాంకు పీవో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. నా మనసంతా జై చుట్టే తిరుగుతోంది. తను ఎలా ఉందో? ఎక్కడ ఉందో? ఏం చేస్తోందో? జై ప్లీజ్‌ ఒక్క ఫోన్‌కాల్‌ చేయి.. నీ మాటలే చప్పుడుగా కొట్టుకునే నా గుండె ఆగిపోతుందేమోనని భయమేస్తోంది. నీ నవ్వులే ఊపిరిగా తీసుకునే నా హృదయం బద్ధలైపోతుందేమోననిపిస్తోంది. నీ కోసమే ఎదురుచూస్తూ... నీ కోసమే బతుకున్న.... ‘పీజే’.

(పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని