వావ్‌...అభినవ్‌

‘‘ఆర్‌ఎఫ్‌సీ-మలేషియాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతోనే కృషి చేస్తున్నాను. ఈ మేరకు తర్పీదు పొందుతూ సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఈ ఆటకు సంబంధించి అంతర్జాతీయ బోర్డులో...

Updated : 31 Dec 2018 16:47 IST

‘‘ఆర్‌ఎఫ్‌సీ-మలేషియాలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతోనే కృషి చేస్తున్నాను. ఈ మేరకు తర్పీదు పొందుతూ సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఈ ఆటకు సంబంధించి అంతర్జాతీయ బోర్డులో దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురిలో నేనూ ఒకణ్ని.’’   -నూకల అభినవ్‌రెడ్డి

అడవులు.. ఎగుడుదిగుడు దారులు.. కందకాలు, రాళ్లు, రప్పలు, కాలుపెడితే జారిపోయే బురద... ఇలాంటి చోట కార్ల రేస్‌. ఇంతటి ధైర్యసాహసాలతో కూడిన ఈ ఆర్‌ఎఫ్‌సీ రేస్‌లో తన గ్రేస్‌ చూపించి రన్నరప్‌గా నిలిచాడు మహబూబాబాద్‌ జిల్లా కుర్రాడు. ఇంతకీ ఆర్‌ఎఫ్‌సీ పోటీ సంగతులేంటి? రన్నరప్‌ యువకుడెవరు? తెలుసుకోవాలంటే... చదివేయండి మరి!

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తామాయగూడెం గ్రామానికి చెందిన నూకల అభినవ్‌రెడ్డి ఐదు సంవత్సరాలుగా ఆర్‌ఎఫ్‌సీలో రాణిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు సంబంధించిన పోటీల్లో అభినవ్‌రెడ్డి 2018, జులై 21 నుంచి 28 వరకు గోవాలో జరిగిన ఆర్‌ఎఫ్‌సీ పోటీల్లో రన్నరప్‌గా నిలిచాడు. ఈ పోటీల్లో దేశంలోని కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, చంఢీగడ్‌, గోవా, తమిళనాడు, దిల్లీ, హరియాణా రాష్ట్రాలకు చెందిన 41 బృందాలు పాల్గొన్నాయి. ఇందులో ఒక మహిళ బృందం ఉండటం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనడానికి అనుగుణంగా వాహనాన్ని ఎవరికి వారే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అడవుల్లో కొండలు, గుట్టల మధ్య ఎగుడు దిగుడుల నడుమ వాహనాన్ని లక్ష్యం వైపు నడిపించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రీడపై అభినవ్‌రెడ్డి అసక్తి చూపుతూ ముందుకు సాగడం విశేషం.

ఊరికి వచ్చినప్పుడల్లా... అభినవ్‌రెడ్డి తండ్రి నరేశ్‌రెడ్డి రాజకీయనేత, వ్యవసాయదారుడు. బీకాం గ్రాడ్యుయేట్‌ అయిన అభినవ్‌ చిన్ననాటి ఉంచి హైదరాబాద్‌లో ఉన్నాడు. అయితే అభినవ్‌ తన ఊరు పురుషోత్తామాయ గూడేనికి వచ్చినప్పుడల్లా తండ్రి వద్ద ఉన్న జీపులను నడపడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా 13 ఏళ్ల వయసు నుంచే సాధన చేస్తున్నాడు. జీపు, ట్రాక్టర్లను తమ మామిడి తోటల్లో, బురద భూముల్లో, రాళ్లు, రప్పలున్న భూముల్లో చాకచక్యంగా నడిపించడం అలవాటు చేసుకున్న అభినవ్‌కు ఆర్‌ఎఫ్‌సీ క్రీడల్లో పాల్గొనాలని అసక్తి పెరిగింది. అందుకనుగుణంగా 2014 నుంచి ఈ క్రీడలో విజయాల కోసం సాధన చేస్తున్నారు. అభినవ్‌ హైదరాబాద్‌లోని చార్మినార్‌ ఆఫ్‌రోడ్‌ అడ్వంచర్స్‌ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.

ఇప్పటి వరకు... అభినవ్‌ పలు అవార్డులను గెలుచుకున్నారు. 2015, 2016 ఈ క్రీడలో భాగంగా ఇచ్చే ‘జంగిల్‌ మ్యాన్‌’ అవార్డును అందుకున్నారు. ఈ క్రీడల్లో ఒక రోజంతా అడవిలో వాహనంపై ప్రయాణం చేయాలి. ఈ అవార్డుల కింద మహేంద్ర కంపెనీ వారు మహేంద్ర వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు. కాగా ఆర్‌ఎఫ్‌సీ పోటీల్లో 2017, 2018లో రన్నరప్‌గా నిలిచారు.

రెన్‌ ఫారెస్ట్‌ ఛాలెంజ్‌(ఆర్‌ఎఫ్‌సీ) అంటే ఏమిటి...? ఆర్‌ఎఫ్‌సీ రహదారులపై మోటార్ల రన్నింగ్‌ రేసు కాదు. ఇది అడవుల్లో రహదారులు లేని చోట నిర్వహించే ఆఫ్‌-రోడ్‌ మోటారు స్పోర్ట్స్‌ పోటీ. ఇందులో పాల్గొనే ప్రతి బృందం 26 ప్రత్యేక దశల్లో పోటీపడాల్సి వస్తుంది. ఇందులో ఎక్కువ పాయింట్లను గెలుచుకున్న బృందం 10 వేల అమెరికన్‌ డాలర్ల విలువైన ప్రయోజనాలు, దాంతో పాటు టైటిల్‌ను గెలుచుకుంటుంది. అంతేగాక మలేషియాలో ఏటా నిర్వహించే ప్రధానమైన పోటీలో పాల్గొనేందుకు ఉచిత ప్రవేశాన్ని పొందుతుంది.

ఆట ఎలా ఉంటుందంటే... ప్రతి టీంలో ఒక డ్రైవరు, కో డ్రైవరు ఉంటారు. వీరు ఆఫ్‌రూట్‌ పోటీలో 26 ప్రత్యేక స్థాయిలను దాటుతూ ముందుకు సాగాలి. ఎవరు ఎక్కువ పాయింట్లు సంపాదిస్తే వారే విజేత అవుతారు. ఆర్‌ఎఫ్‌సీ అనేది అత్యంత ధైర్యసాహసాలతో, సంక్లిష్టమైన పరిస్థితుల్లో పాల్గొని గెలుపొందాల్సిన మోటార్‌ స్పోర్ట్సుగా చెప్పవచ్చు. బురదతో కూడిన, జారుతున్న అడవి నేలల్లో వాహనంతో అత్యంత సాహసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అత్యంత క్లిష్టంగా సాగే మోటార్‌ రేసింగ్‌గా దీన్ని భావిస్తారు.

-బొల్లం శేఖర్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని