మనసులోకి వచ్చి... జీవితంలోకి రాక...

నాలుగేళ్ల వయసు. అమ్మచనిపోయింది. నాన్నకు మరో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకో ఆవిడతో కలవలేకపోయాను. దగ్గర కాలేకపోయాను. నన్ను చూడ్డానికని అమ్మమ్మ వస్తే, ఆవిడతో ...

Updated : 31 Dec 2018 17:37 IST

మనసులోకి వచ్చి... జీవితంలోకి రాక...

నాలుగేళ్ల వయసు. అమ్మచనిపోయింది. నాన్నకు మరో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకో ఆవిడతో కలవలేకపోయాను. దగ్గర కాలేకపోయాను. నన్ను చూడ్డానికని అమ్మమ్మ వస్తే, ఆవిడతో కలసి మా అమ్మ పుట్టిన ఊరికి వెళ్లిపోయాను. అక్కడే చదువుకున్నా డిగ్రీ వరకూ. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అమ్మమ్మ కూడా దూరం అయ్యింది. అన్నేళ్లలో మా నాన్న నన్ను పలకరించింది చాలా తక్కువ. కొన్నాళ్లపాటు ఏదో చిన్నాచితకా ఉద్యోగాలు చేసినా ఒంటరితనం వెంటాడుతూ ఉండేది. దాంతో నాన్న దగ్గరకు వెళ్లాను. ఆ ఇంట్లో నన్ను ప్రేమగా ఆదరించినవాళ్లు, అక్కున చేర్చుకున్న వాళ్లు లేరు. ఊహించిందే! కనీసం తిన్నావా? అంటూ అడిగిన వాళ్లూ, నా ఆకలి బాధ తెలిసిన వాళ్లు కూడా లేకపోయేసరికి చాలా బాధనిపించింది. చాలాసార్లు చనిపోవాలనిపించింది. అంతగా నిరాశలో కూరుకుపోయాను. అక్కడ ఒక్క క్షణమూ ఉండాలనిపించలేదు. దాంతో అదే ఊర్లో వేరే గది తీసుకుని విడిగా ఉండేవాడిని. అక్కడికి దగ్గర్లో ఒక కాలేజీ ఉంటే అక్కడ ఉద్యోగంలో చేరిపోయాను.

మనసులోకి వచ్చి... జీవితంలోకి రాక...ఆ సమయంలోనే మా కాలేజీలో నాతో పాటు పనిచేసే ఓ అమ్మాయి నాకు పరిచయం అయ్యింది. ఎందుకో తెలియదు కానీ నా గురించి శ్రద్ధ తీసుకునేది. నాకు ధైర్యం చెబుతూ ఉండేది. పండగ వస్తే, వాళ్లింట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే బాక్సు నిండా పిండి వంటలని కూరికూరి తెచ్చేది. తినేవరకూ వదిలేది కాదు. తను ఒక్కరోజు రాకపోయినా భయంకరమైన ఒంటరితనం నన్ను కమ్ముకున్నట్టుగా ఉండేది. తన అభిప్రాయాలు చెబుతూనే నా ఇష్టాలని గౌరవించేది. తను నన్ను ఇష్టపడుతోందని అర్థమైంది. ఎవ్వరూ లేని నాకు ఆ భగవంతుడే ఈ అమ్మాయిని పంపించాడా? అనిపించేది. మేమిద్దరం ఎప్పుడూ ప్రత్యేకించి ప్రపోజ్‌ కూడా చేసుకోలేదు. కనీసం ఒక్కసారంటే ఒక్కసారీ బయటకు తిరిగిందీ లేదు. ఎప్పుడైనా అడిగినా నిర్మొహమాటంగా నేను రాను అనేది. దాంతో నేను కూడా తనని బలవంత పెట్టడం ఇష్టం లేక ఊరుకునేవాడిని. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నీ గురించి చెప్పే ధైర్యం లేదు. అలాని నిన్ను వదులుకోలేను’ అంటే పోనీ మీ ఇంటికొచ్చి నేనడగనా అన్నాను. ‘వద్దు మా ఇంట్లో కులం గురించి పట్టింపు ఎక్కువ. ప్లీజ్‌ నువ్వు రావొద్దు’ అంది. నిజమే మేముండేది అటు పట్టణమూ, పల్లె కానీ ప్రాంతం. చెబితే వాళ్లింట్లో వాళ్లు తనను ఏం చేస్తారో అని మొదట భయపడ్డా. అలాని తనని వదులుకోలేను. ఏడాది గడిచిపోయింది. తను ఉద్యోగానికి రావడం లేదు. ఇంట్లోనే ఉంటుంది. ఇక లాభం లేదు అడిగేద్దామనుకుని వాళ్లింటికి వెళ్లాను. ఆ సమయంలో వాళ్లమ్మ, తను మాత్రమే ఉన్నారు. ఇదే సమయం అనుకుని వాళ్లమ్మతో మాట్లాడాను. మీరు ఒప్పుకొంటే మా పెద్ద వాళ్లని తీసుకొస్తానని చెప్పాను. ఆవిడేం మాట్లడలేదు.  నేను ఇంటికి వచ్చేశాను. తర్వాత వాళ్లింట్లో పెద్ద గొడవ. ఆ గొడవ జరిగిన ఇరవై రోజులకి తనకు పెళ్లికుదరడం, మరో వారం రోజులకి పెళ్లి అయిపోవడం కూడా జరిగింది. ఏం చేసినా తన రుణం తీర్చుకోలేనేమో అనిపించేది. తను నన్ను మోసం చేయలేదు. నేను మోసపోలేదు. పెళ్లిచేసుకోవడం కుదరలేదనే బాధే ఉంది. కానీ కనీసం పిరికివాడిలా ఉండిపోకుండా వాళ్లింట్లో చెప్పాకదా అనే సంతృప్తి ఉండేది. తనను ఇబ్బంది పెట్టాలని కాదు కానీ... నెల రోజుల తర్వాత తన పుట్టిన రోజు ఉంటే  గిఫ్ట్‌ ఇవ్వడానికి వెళ్లాను. నేను వెనక్కి వచ్చేస్తున్నప్పుడు తన కళ్లలో కన్నీటిపొర ఇప్పటికీ నాకు గుండెలో గుచ్చుతున్నట్టే ఉంటుంది.

- చక్రి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు