యానిమేషన్‌లో ఆంగ్లం శి‘వాహ్‌’

ఆంగ్లం... చాలా మంది సమస్య. ఆంగ్లమాధ్యమంలో చదివిన వారికి సైతం ఈ భాషలో మాట్లాడటం కష్టమైపోతున్న సమయం. అలాంటిది ఒక తెలుగు మాధ్యమంలో చదివిన కుర్రాడు ఆంగ్లంలో మాట్లాడటం ...

Published : 10 Nov 2018 00:52 IST

యానిమేషన్‌లో ఆంగ్లం శి‘వాహ్‌’

ఆంగ్లం... చాలా మంది సమస్య. ఆంగ్లమాధ్యమంలో చదివిన వారికి సైతం ఈ భాషలో మాట్లాడటం కష్టమైపోతున్న సమయం. అలాంటిది ఒక తెలుగు మాధ్యమంలో చదివిన కుర్రాడు ఆంగ్లంలో మాట్లాడటం ఎలాగో నేర్పే యానిమేషన్‌ పాఠాలు రూపొందించాడు. యూట్యూబ్‌ నుంచి ప్రతి నెలా రూ.30,000 వరకూ పారితోషికం అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడెవరంటే..?

ఆంగ్లం నేర్చుకోవడానికి తను ఇంజినీరింగ్‌లో ఎదుర్కొన్న సమస్యతోనే చాలా మంది బాధపడుతున్నారని గుర్తించాడు గాడేకర్‌ శివ. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం లింగ-1 గ్రామంలో పాఠశాల నుంచి తెలుగు మీడియంలోనే చదివాడు. ఇంజినీరింగ్‌(సివిల్‌)లోకి వచ్చే సరికే అంతా ఆంగ్లమే. ఏం చేయాలో తెలియని పరిస్థితి శివది. ఎక్కడ? ఎలా నేర్చుకోవాలో దిక్కుతోచని స్థితి. తనలాగే ఆంగ్లమాధ్యమం నుంచి వచ్చిన యువత సైతం ప్రాజెక్టు వర్క్‌లు, ప్రజెంటేషన్లు ఇచ్చేటప్పుడు ఆంగ్లభాషతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఏదైనా పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించాడు. గూగుల్‌, యూట్యూబ్‌లను ఆయుధాలుగా మలుచుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఆంగ్ల వ్యాకరణం, భాషా నైపుణ్యంపై పాఠాలను కొత్త పద్ధతిలో చెప్పాలని ఆలోచించాడు. యానిమేషన్‌, బొమ్మలతో చెబితే చక్కగా అర్థం చేసుకోవచ్చని నిర్ణయానికి వచ్చాడు. ఒకే సారి ఆంగ్ల, హిందీ, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పాఠాలను తయారు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వీటికి ఎంతో ఆదరణ లభిస్తోంది. సంవత్సర కాలంలోనే 1.20లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు 50లక్షల సార్లు వీక్షించారు. ఇంత మందికి ఉపయోగపడే విధంగా వీడియోలను పొందుపర్చిన శివ ప్రతిభను గుర్తించిన యూట్యూబ్‌ ఇటీవల సిల్వర్‌ ప్లే బటన్‌(వెండి పలక) పంపించింది. అంతేకాదు వాటిపై వివిధ ప్రచార సంస్థలు యాడ్స్‌ ప్రసారం చేస్తున్నాయి. దీంతో గూగుల్‌-యూట్యూబ్‌ సంస్థ ప్రతి నెల ఈ యువ ఇంజినీరుకు రూ.30వేల పారితోషికాన్ని ఇస్తున్నాయి. శివ ఈ వీడియోలు చేస్తూ... భైంసా పట్టణంలో ఓ ఆర్కిటెక్చర్‌ వద్ద ఉద్యోగమూ చేస్తున్నాడు.

‘‘కాలం(సీజనల్‌), పరిస్థితులు, అవసరాలు ఇలా సందర్భానుసారంగా ఆంగ్ల పదాలు, వాక్యాలతో ల్యాప్‌టాప్‌లో యానిమేషన్‌ చిత్రాలు రూపొందించా. భాష నేర్చుకునేలా తెరవెనుక నా వ్యాఖ్యానం యూట్యూబ్‌లో పొందుపరుస్తా. అలాగే భాషా నైపుణ్యం కోసం వ్యాకరణం(గ్రామర్‌) రూపొందించి సులభంగా అర్థమయ్యే పాఠాలు బోధిస్తా. మొదట తెలుగు, హిందీ భాషలతో ఆంగ్లం నేర్చుకునేలా రూపొందించా. అరబ్‌దేశాల్లోని సబ్స్క్రైబర్‌లు ఉర్దూలో కావాలని అడిగారు. నాకు ఆ భాష రాదని చెప్పగా వాటిని ఆన్‌లైన్‌ద్వారా హిందీలో వారికి పంపించగా ఉర్దూలోకి తర్జుమా చేసి తిప్పి పంపించారు. ఈ మేరకు వాటిని అందులో చేరుస్తూ నాలుగు భాషల్లో రూపొందించిన వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నా.’’
- ఇ.సుదర్శనగౌడు, ఆదిలాబాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని