ట్యాబ్లెట్‌కు డబ్బుల్లేక జ్వరంతోనే ఉండిపోయా

ఏడో తరగతిలోనే కవిత రాసి... ఎవరికీ చూపించలేని అబ్బాయి... యువకుడయ్యాక... సినిమాలకు కథ, మాటలు రాసి మెప్పిస్తున్నాడు. టపాసులు కొనుక్కోడానికి డబ్బులేని స్థితిని చూసిన అతను... సినిమాకు మాటలు రాశాకా కూడా.. ట్యాబ్లెట్‌ కొనుక్కోలేని పరిస్థితిని అనుభవించిన మచిలీపట్నం కుర్రాడు.. బెజవాడ ప్రసన్నకుమార్‌. ‘జబర్దస్త్‌’ కార్యక్రమం నుంచి ‘హలో గురూ ప్రేమ కోసమే’ వరకూ తన ప్రయాణం.. అతను ఎదుర్కొన్న కష్టాలు... పొందిన ప్రశంసలను ‘ఈతరం’తో పంచుకున్నాడు.

Updated : 31 Dec 2018 17:00 IST

 కొత్త కలం 

ఏడో తరగతిలోనే కవిత రాసి... ఎవరికీ చూపించలేని అబ్బాయి... యువకుడయ్యాక... సినిమాలకు కథ, మాటలు రాసి మెప్పిస్తున్నాడు. టపాసులు కొనుక్కోడానికి డబ్బులేని స్థితిని చూసిన అతను... సినిమాకు మాటలు రాశాకా కూడా.. ట్యాబ్లెట్‌ కొనుక్కోలేని పరిస్థితిని అనుభవించిన మచిలీపట్నం కుర్రాడు.. బెజవాడ ప్రసన్నకుమార్‌. ‘జబర్దస్త్‌’ కార్యక్రమం నుంచి ‘హలో గురూ ప్రేమ కోసమే’ వరకూ తన ప్రయాణం.. అతను ఎదుర్కొన్న కష్టాలు... పొందిన ప్రశంసలను ‘ఈతరం’తో పంచుకున్నాడు.

ట్యాబ్లెట్‌కు డబ్బుల్లేక జ్వరంతోనే ఉండిపోయా

 

‘జబర్దస్త్‌’గా కెరీర్‌ ప్రారంభం:  ఏడో తరగతి నుంచి కవితలు రాయడం అలవాటు. అయితే వాటిని ఎవరికీ చూపించేవాడిని కాదు. ఒకసారి వారపత్రికకు పంపాలని కవితను కంపోజ్‌ చేయిస్తున్నాను. అప్పుడే దాన్ని చదివిన ఓ విలేకరి బాగుందని నాకు ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అదే నా రచనకు మొదట లభించిన ప్రశంస. ఇంజినీరింగ్‌ అయిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఆడియోఫంక్షన్లలో కామెడీ స్కిట్‌లు రాసేవాడిని. అవి నచ్చి మల్లెమాల ప్రొడక్షన్స్‌ వారు పిలిచారు. వారికి నాలుగు స్కిట్‌లు రాసిచ్చా. నచ్చాయి. అప్పుడు ‘జబర్దస్త్‌’ కామెడీ షోలో రాయడానికి అవకాశం ఇచ్చారు. వంద వరకు స్కిట్‌లు రాశాను. అలా ఓ ఆడియో ఫంక్షన్‌కు స్కిట్‌ రాసిన నన్ను గుర్తించి ‘సినిమా చూపిస్తా మావ’ నిర్మాతలు... ఆ సినిమా అవకాశం ఇచ్చారు. తర్వాత ‘నేనులోకల్‌’, ఇప్పుడు ‘హలో గురూ ప్రేమకోసమే’.. అలా నా కెరీర్‌ సాగుతోంది. ప్రస్తుతం ఐదు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి.

* ఉద్యోగం చేస్తున్నానని చెప్పి : నాకేమో రాయడం ఆసక్తి. ఇంజినీరింగ్‌ అయిపోయింది. ఇంట్లో ఏమో ఇక కొడుకు ఉద్యోగం చేస్తాడని ఆశ. నేను అలాగే చెప్పి హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అని చెప్పాను. కనీసం నెలకు రూ.30000 ఇంటికి పంపాలి. ఎలా పంపాలో తెలిసేది కాదు. బాగా ఇబ్బందులు పడ్డా. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి రాసేవాడిని. టీవీ షోలు, స్కిట్‌లు... రాసి వచ్చిన దాన్ని పొదుపుగా వాడుకొని ఇంటికి డబ్బు పంపేవాడిని. అబ్బో అలా రెండేళ్లు మెయింటెన్‌ చేశా కష్టంగా.

* దీపావళికి టపాసులకు డబ్బుల్లేవ్‌ : మాది మచిలీపట్నం. నాన్న అమలేశ్వరరావు, అమ్మ నాగలక్ష్మి. నాన్న వ్యాపారి. మొదట్లో ఆయన సైకిల్‌ షాపులో పనిచేసేవాడు. చిన్నగా రోల్డ్‌గోల్డ్‌ వ్యాపారిగా మారాడు. మా ప్రాంతంలో ఒకసారి వరదలు వచ్చాయి. దీంతో మా రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. మొత్తం నష్టపోయాడు. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. అప్పుడే దీపావళి వచ్చింది. నాన్న రూ.25 అప్పుచేసి... టపాసులు కొనుక్కోమని మాకిచ్చాడు. పిల్లలకు ఏమీ ఇవ్వలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సంఘటన ఇప్పటికీ నా మనసును మెలి పెడుతూనే ఉంటుంది. తమ్ముడిని, నన్నూ ఇంజినీరింగ్‌ చదివించడానికి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అందుకే ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో ...‘మధ్య తరగతి తండ్రి సంపాదన ఎంతంటే... తన పిల్లలను చదివించేంత’ అని ఒక డైలాగ్‌ రాశాను. ‘ఇంత చేసి చివరికి వాళ్లు కోరుకునేది... ఒక్కటేఒకటి... ఒక ఉద్యోగం. అదీ మన కోసమే.’ అని ఆ డైలాగ్‌ ముగుస్తుంది. దీనికి మానాన్న స్ఫూర్తి.

* ఆఫీసులకు  నడిచే వెళ్లేవాడిని : ‘సినిమా చూపిస్తా మావ’ రిలీజ్‌ అయింది. ఈ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తవుతుందనుకుంటే... ఎక్కువ సమయం పట్టింది. నాదగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చైపోయింది. సినిమాలో కథ, మాటలకు మంచి పేరొచ్చింది. ఎక్కడికెళ్లిన ప్రశంసలు. తర్వాతి సినిమా ఏదైనా ఒప్పుకొంటే ఎంతోకొంత అడ్వాన్స్‌ వస్తుంది. నేను ఆ పని చేయలేదు. రాస్తే మంచిదే రాయలని గట్టిగా కూర్చున్నాను. మా నాన్న ‘రేయ్‌ మంచి సినిమాకే రాయి... ఖర్చులకు కావాలంటే ఇల్లైనా అమ్మేద్దాంలే’ అని వెన్ను తట్టారు. దీంతో కొంతకాలం డబ్బుకు బాగా కటకట. పరిశ్రమలో చాలామంది పెద్దలు అభినందించడానికి పిలిచినా... వెళ్లడానికి నా దగ్గర ఆటోకూ డబ్బుల్లేని పరిస్థితి. నడిచే ఆఫీసులకు వెళ్లేవాడిని. అప్పుడే మలేరియా జ్వరం వచ్చింది. నా గదిలో పారాసిటమాల్‌ ట్యాబ్‌లెట్‌కీ డబ్బులేదు. ఏం చేయాలో అర్థంకాక అలాగే ఉండిపోయాను.

ట్యాబ్లెట్‌కు డబ్బుల్లేక జ్వరంతోనే ఉండిపోయా

* దాసరి గారు ఇంటికి పిలిచారు : ‘సినిమా చూపిస్తా మావ’ చిత్రం విజయవంతమైనప్పుడు... దాసరి నారాయణరావుగారు ఇంటికి పిలిచారు.  సొంత ఖర్చులతో సక్సెస్‌ మీట్‌ పెట్టి... నన్ను అభినందించారు. ‘నేను స్వతహాగా మాటల రచయితనీ... ఈ అబ్బాయి మాటలు నాకు ఎంతోగానో నచ్చాయని’ చెప్పారు. అదే నాకు జీవితంలో మరిచిపోలేని గొప్ప ప్రశంసగా భావిస్తా. నేను మొదట ఆయన కంపెనీ నుంచే రూ.20000 చెక్‌ అందుకున్నాను. నా రాతకు మొదట వచ్చిన పారితోషికం అక్కడి నుంచే కావడం గర్వకారణం.

* ఆమె రింగ్‌ తాకట్టు పెట్టి డబ్బులిచ్చేవారు : హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో నేను చిన్న టీవీఛానల్‌లో పనిచేసేవాడిని. అప్పుడు పుష్పాభాస్కర్‌ అని ఒక ఆవిడ ఉండేది. ఆమె ఆ ఛానల్‌లో క్రియేటివ్‌ హెడ్‌. మా అమ్మ తర్వాత నాకు అమ్మతో సమానం ఆమె. నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ పుస్తకం చదవమని, ఈ పాట వినమని చెప్పి నాకు మార్గనిర్దేశనం చేసేవారు. తన జీతంలోంచి నా ఖర్చులకు ఇచ్చేవారు. అవసరముంటే ఉంగరం తాకట్టు పెట్టైనా డబ్బులిచ్చేవారు. నటుడు ధన్‌రాజ్‌కు నాపై నమ్మకం. జబర్దస్త్‌కు ముందు నుంచే మేం పరిచయం. నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు.

- కోగటం వీరాంజనేయులు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని