చెల్లీ... నన్ను క్షమించు

తను పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. ఏ పని చేసినా ఎంతో సంతోషంగా అనిపించేది. తనిచ్చే ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. తను... ఎవరంటే నేను ఎంతగానో ప్రేమించే నా చెల్లెలు... శారద. ఒక్కమాటలో చెప్పాలంటే తను చెల్లే కాదు...

Updated : 31 Dec 2018 17:40 IST

చెల్లీ... నన్ను క్షమించు

 

ను పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. ఏ పని చేసినా ఎంతో సంతోషంగా అనిపించేది. తనిచ్చే ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. తను... ఎవరంటే నేను ఎంతగానో ప్రేమించే నా చెల్లెలు... శారద. ఒక్కమాటలో చెప్పాలంటే తను చెల్లే కాదు... అక్కా, అమ్మా, మంచి ఫ్రెండ్‌, మార్గదర్శీ. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తను విలవిల్లాడిపోయేది. వెంటనే దాన్నుంచి బయటపడే మార్గం కోసం ఆలోచించేది. సమస్య మాత్రమే నాది. దానికి స్పందనా, పరిష్కారం తన దగ్గరే ఉండేవి. వయస్సులో చిన్నదైనా పెద్ద మనసుతో ఎన్నిసార్లు నా కన్నీళ్లు తుడిచిందో చెప్పలేను.

చెల్లీ... నన్ను క్షమించు

ఏంచేస్తే నాకు మంచిదో, ఎలా చేయాలో అన్నీ తనే ఆలోచించి చెప్పేది. మా ఇంట్లో అందరికంటే తెలివైంది, చురుకైంది, అందమైందీ తనే. ఎప్పుడూ ఏదోక పని చేస్తూ బిజీగానే ఉండేది. విసుగనేదే ఉండేది కాదు. పక్షులూ, నోరులేని పశువులు, చిన్నపిల్లలంటే తనకు ఎంత ఇష్టమో చెప్పలేం. ఒకసారి ఒక పక్షి కాలు విరిగి వాకిట్లో పడిపోతే దానికి వారం రోజులపాటు సపర్యలు చేసి, అది తిరిగి పైకి ఎగిరేలా చేసింది. వీధి కుక్కకు మూడు పూట్లా అన్నం పెట్టేది. ఎక్కడ ఆవు కనిపించినా పిల్లలకు అరటిపండ్లు ఇచ్చి దానికి పెట్టమని పంపేది. చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా తను బాధపడేది.  నేను ఉదయం ఆఫీసుకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునేదాన్ని. నా కొడుకుని తన పిల్లలతో సమానంగా పెంచింది. పిల్లాడి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పనిచేసుకోమని తనే ప్రోత్సహించింది. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సంతోషంగా పనిచేసేదాన్ని. 
అలాంటి మంచి మనిషిని క్యాన్సర్‌ మహమ్మారి చుట్టుముట్టింది. తను ఎంతోకాలం బతకదని డాక్టర్‌ చెప్పినప్పుడు నాకేమాత్రం నమ్మబుద్ధి కాలేదు. ఏదైనా అద్భుతం జరిగి తనకు బాగైపోవాలని, ఎప్పటిలా ఆరోగ్యంగా తిరగాలని మొక్కని దేవుడు లేడు. ఎంతో ధైర్యంగా వైద్యం చేయించుకున్న తను రాత్రిళ్లు అందరూ నిద్ర పోతుంటే నిద్ర పట్టక అలా కుర్చీలో కూర్చునే ఉండేది. తనను ఇన్ని రకాలుగా బాధ పెట్టకుండా దేవుడు తీసుకెళ్లిపోయినా ఎంతో బాగుండేది అనిపించేది. తన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. తప్పనిసరి పరిస్థితుల్లో తనను వదిలి బలవంతంగా ఆఫీసుకు వెళ్లేదాన్ని. మధ్యలో ఇంటి దగ్గర నుంచి ఫోన్‌ వస్తే గుండె ఆగినంత పనయ్యేది. తనను కీమోథెరపీలకు తీసుకెళ్లడానికే నా సెలవులన్నీ అయిపోయాయి. ఇక తన దగ్గర ఉండే మార్గం లేకపోయింది. రెండున్నరేళ్లుగా క్యాన్సర్‌తో జరిగిన యుద్ధంలో నా చెల్లి ఓడిపోయింది. ప్రాణాలు విడిచింది. తన చివరి వారం రోజుల్లో నేను తన దగ్గర ఉండలేక నేనూ ‘విధి’ చేతిలో ఓడిపోయాను. ఆ రాత్రంతా వరండాలో పడుకోబెట్టాం. అప్పుడు కూడా కళ్లు తెరుస్తుందేమో... ఏదైనా అద్భుతం జరిగి హఠాత్తుగా లేస్తుందేమోనని ఎంత ఆశగా ఎదురుచూశానో. తను లేదన్న ఊహే భయంకరంగా ఉంది. చుట్టూ ఎంతమంది ఉన్నా... తను పక్కన లేకపోతే ఇంత శూన్యం ఉంటుందని ఇప్పుడే తెలిసింది. 
నాకు ఎన్నో చేసిన చెల్లి చివరి రోజుల్లో పక్కన ఉండలేకపోయాననే అసంతృప్తి నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నన్ను క్షమించు చెల్లీ... బంగారు తల్లీ...!

- లక్ష్మి నరకుల

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని