ఆమె..ఓ తీపి జ్ఞాపకం

‘డిసెంబరు 24న నా పెళ్లి. రెండ్రోజులు ముందే రావాలి’ భారతి ఆర్డరేసింది. తను నా కొలీగ్‌. అమ్మాయిలకు అరమైలు దూరంలో ఉండే నాతో కాస్త చనువుగా మాట్లాడే అమ్మాయి. వెళ్లక తప్పదుగా!మరో కొలీగ్‌ శరత్‌తో కలిసి బయల్దేరా. మామిడి...

Updated : 31 Dec 2018 17:39 IST

ఆమె..ఓ తీపి జ్ఞాపకం‘డిసెంబరు 24న నా పెళ్లి. రెండ్రోజులు ముందే రావాలి’ భారతి ఆర్డరేసింది. తను నా కొలీగ్‌. అమ్మాయిలకు అరమైలు దూరంలో ఉండే నాతో కాస్త చనువుగా మాట్లాడే అమ్మాయి. వెళ్లక తప్పదుగా!ఆమె..ఓ తీపి జ్ఞాపకం

మరో కొలీగ్‌ శరత్‌తో కలిసి బయల్దేరా. మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, బంధువుల కోలాహలంతో మేం వెళ్లేసరికే పెళ్లి హడావిడి మొదలైంది. భారతిని కలిశాం. మాకు మర్యాదలు చేయమంటూ ఓ అబ్బాయిని పురమాయించింది. ఇంతలో ‘ఏమండీ దీనిపై పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పేర్లు రాయండి’ మొహంపై పడుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ.. చేతిలో కొబ్బరిబోండాం పట్టుకుని అడుగుతుందో అమ్మాయి. కన్నార్పకుండా తననే చూస్తుంటే ‘హలో శరత్‌గారూ, శ్రీకాంత్‌ గారూ చెబుతోంది మీకే’ రెట్టింపు స్వరంతో అంది. ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి బోండాం అందుకున్నా. ‘మా పేర్లు మీకెలా తెలుసు?’ అడగాలనుకున్న మాట గొంతులోనే ఆగిపోయింది. ఏడున్నరకి భోజన కార్యక్రమం మొదలైంది. ‘మావయ్యా.. వీళ్లకి ఇంకో రెండు జాంగ్రీలు వేయండి’ ఎప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుందో హడావిడి మొదలెట్టేసింది. మేం లేచేలోపు నాలుగుసార్లైనా వడ్డించేవాళ్లను మాకోసం పిలిచింది. ఇంత చేస్తున్న తన గురించి ఆరా తీయకుండా ఉండలేకపోయా. ‘పేరు లావణ్య.. భారతి పక్క ఇల్లే’ ఓ పిల్లాడిని కాకా పడితే వివరాలందించాడు.

మా పడక దాబాపై ఏర్పాటు చేశారు. అసలే చలికాలం ముసుగుతన్ని పడుకున్నా. దాదాపు పదిగంటలపుడు ఎవరో పైకి వస్తున్నట్టు పట్టీల చప్పుడైంది. ఆపై నా ఊహ నిజమైంది. వచ్చింది లావణ్యే. నాక్కొంచెం దూరంలో చాప, దిండు వేసుకొని పడుకుంది. దుప్పటి తీసి మెల్లిగా తనవైపు చూశా. తనూ నన్నే చూస్తోంది. నా గుండె జల్లుమంది. దుప్పట్లు కప్పుకొంటూ, తీస్తూ ఒకర్నొకరం చూసుకుంటూ ఓ అరగంటపాటు చంటిపిల్లల్లా దాగుడుమూతలాడాం. ‘తనతో ఏదోటి మాట్లాడాలి’ మనసు మారాం చేస్తోంది. ‘ఎవరైనా చూస్తే బాగోదేమో’ మొహమాటం వెనక్కి లాగుతోంది. ఇంతలో ‘లవ్వీ.. పైకెందుకెళ్లావ్‌. నీకసలే చలి పడదు. కిందికి

రా’ ఎవరో పిలిచారు. కాసేపయ్యాక తనెళ్లింది. నా ఉత్సాహం మంచుముక్కలా కరిగిపోయింది.ఆమె..ఓ తీపి జ్ఞాపకం

భారతి ఇంటికి అరకిలోమీటరు దూరంలో గుళ్లో పెళ్లి. పొద్దున ఏడుగంటలకు మేం అక్కడికి చేరాం. తాళికట్టే తంతు దగ్గరపడింది. నా కళ్లు, మనసూ మాత్రం తనకోసం వెతకడం మొదలెట్టాయి. ఎంతకీ కనపడదే. నాలో టెన్షన్‌ పెరిగిపోతోంది. అప్పుడే ‘హలో సార్‌.. ఏంటింత ఆలస్యం? పెళ్లికొడుకులా తాళికట్టే టైంకి వచ్చారే?’ చెవిలో గుసగుసగా చెప్పి తుర్రుమంది. ఆమె కనపడగానే నాకు ప్రాణం లేచొచ్చింది. తనతో మాట్లాడకపోతే పిచ్చెక్కేలా ఉంటుందేమో అనిపించింది. ‘మీతో ఓసారి మాట్లాడాలి’ ధైర్యంగా వెళ్లి చెప్పేశా. ఏ స్పందనా లేదు. అనవసరంగా తొందరపడ్డానేమో అనిపించింది. ఇంతలో ఓ ఐదు నిమిషాలయ్యాక గుడి పక్కనున్న ఇంటి దాబా మెట్లెక్కుతూ కనిపించింది. పైకి రమ్మన్నట్టుగా కళ్లతోనే సైగ చేసింది. పైకెళ్లాక నా పక్కనే నిల్చొని ‘చెప్పండి’ అంది. ఒంట్లో వణుకు మొదలైంది. ఏం మాట్లాడను? నువ్వంటే ఇష్టమని చెప్పాలా? నోరు పెగలడం లేదు. ‘నా పేరు మీకెలా’.. నా మాట పూర్తి కాకముందే ‘ఎందుకంటే నాకు మీరు ముందే పరిచయం కాబట్టి. భారతి మీ గురించి చెప్పింది కాబట్టి. న్యూఇయర్‌కి ఆఫీసులో మీరంతా దిగిన గ్రూప్‌ ఫొటో చూశాను కాబట్టి’ చెప్పుకుపోతోంది. నాకాశ్చర్యం వేసింది. ఫొటోలో చూసిన మనుషుల్ని గుర్తుంచుకొని ఇలా అభిమానిస్తారా అని. మెల్లిగా ధైర్యం వచ్చేసింది. చదువు, ఇష్టాయిష్టాలు, సినిమా కబుర్లలోకి వెళ్లిపోయాం. ఇంతలో ఎవరో కుర్రాడు వచ్చి అమ్మ పిలుస్తుందని చెప్పి తనని లాక్కెళ్లిపోయాడు. ‘మళ్లీ కలుద్దాం బై’ అదే ఆఖరి మాట. లావణ్య మళ్లీ కనపడలేదు. ఊరంతా తిరిగా.  ప్చ్‌.. జాడ లేదు. సాయంత్రమైంది. మేం ఊరెళ్లాలి. కొత్త జంట మొక్కు కోసం విజయవాడ దుర్గ గుడికి వెళ్లారని తెలిసింది. మేం వెళ్లిపోతున్నామని భారతి చెల్లికి చెప్పాం. గుమ్మం దాటి కాస్త దూరం వెళ్లాక ‘అన్నయ్యా.. లావణ్య అక్కకి తోడుగా వెళ్లింది. ఈ విషయం మీకు చెప్పమని చెప్పింది’ భారతి చెల్లి చెబుతుంటే బాధ, సంతోషం కలగలిసి నా గుండె ఏదోలా అయిపోయింది. తిరుగు ప్రయాణంలో బస్‌ టికెట్‌ తీసుకొని సీట్లో కూర్చున్నాం. ‘ఏంటి శ్రీకాంత్‌ డల్‌గా ఉన్నావ్‌’ శరత్‌ మాటతో నావల్ల కాలేదిక. జరిగిందంతా చెప్పా. ‘అర్రే పిచ్చోడా ముందు చెప్పొద్దా. వెనక్కి వెళ్లి ఆ అమ్మాయిని కలుద్దాం పదా’ అన్నాడు. నేనే వారించా. భారతి ఆఫీసుకొచ్చాక తన గురించి అడగొచ్చులే అని. కానీ తర్వాతెప్పుడూ తను ఆఫీసుకు రాలేదు. రిజైన్‌ లెటర్‌ పంపింది. కొద్దిరోజులకు నేనే లావణ్య కాంటాక్ట్‌ నెంబర్‌ ఇవ్వమని అడిగా. ‘వద్దు శ్రీకాంత్‌.. తనకీ, నీకు కుదరదు. లావణ్య కూడా నీ గురించి రెండుసార్లు అడిగింది. తనకీ అదేమాట చెప్పా. ఇంకోసారి నన్నేం అడగొద్దు సారీ’ అంది. భారతి ఎందుకు ఆ మాటందో  అర్థం కాలేదు. మా ఇద్దరి కులాలు వేరే కావడంతో భారతీకి ఇష్టం లేదని తెలిసింది. అందుకే మమ్మల్ని దూరం చేసిందని అనుకున్నా... తర్వాత పని హడావిడిలో పడి మెల్లిమెల్లిగా తన తలపుల నుంచి దూరమయ్యా. ఇది జరిగి పదేళ్లైంది. అయినా ఇప్పటికీ తను గుర్తొచ్చినప్పుడల్లా ఓ తీయని బాధ మదిని గుచ్చుతూనే ఉంటు

కోల మొహం.. కోటేరు ముక్కు.. చామనఛాయ.. మోముపై చెరగని చిరునవ్వు.. పచ్చ పరికిణీతో పదహారణాల తెలుగమ్మాయికి ప్రతిరూపంలా ఉంది.

కొన్ని నెలల దాకా ప్రతి క్షణం లావణ్యే గుర్తొచ్చేది నాకు. అనుక్షణం తన ధ్యాసే. ఒక్కమాటలో చెప్పాలంటే అర్జున్‌రెడ్డి సినిమాలో మోస్ట్‌ ఎఫెక్టెడ్‌ పర్సన్‌ అయిపోయా.

- శ్రీకాంత్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని