బతకనివ్వండి.. ప్లీజ్‌!!!

మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు సంతానం. నేనే పెద్దదాన్ని. నాన్న ప్లీడర్‌ దగ్గర గుమస్తాగా పనిచేసేవారు. ఆయన సంపాదన మీదే కుటుంబం ఆధారపడేది. ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో చిన్నతనంలోనే నాకు అర్థమైంది. వేసుకునే దుస్తుల నుంచి పుస్తకాల బ్యాగు వరకు ...

Updated : 31 Dec 2018 17:43 IST

బతకనివ్వండి.. ప్లీజ్‌!!!

మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు సంతానం. నేనే పెద్దదాన్ని. నాన్న ప్లీడర్‌ దగ్గర గుమస్తాగా పనిచేసేవారు. ఆయన సంపాదన మీదే కుటుంబం ఆధారపడేది. ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో చిన్నతనంలోనే నాకు అర్థమైంది. వేసుకునే దుస్తుల నుంచి పుస్తకాల బ్యాగు వరకు అన్నింటిలోనూ నాకూ, నా స్నేహితులకు మధ్య ఉండే తేడా స్పష్టంగా తెలిసేది. దాంతో బాగా చదువుకుని ఉద్యోగం చేసి నా కాళ్లమీద నేను నిలబడాలని చిన్నతనం నుంచి కలలు కనేదాన్ని. టెన్త్‌ ఫస్ట్‌క్లాసులో పాసవగానే చదువు మాన్పించి పెళ్లి చేసేస్తానన్నారు నాన్న. కానీ కాలేజీలో చేరి చదువుకుంటానని మారాం చేయడంతో అయిష్టంగానే కాలేజీలో చేర్పించారు. ‘కానీ ఒక షరతు... ఎప్పుడు ఫెయిల్‌ అయినా ఆ ఏడాదే పెళ్లి చేస్తాన’ని కచ్చితంగా చెప్పారు. ఎక్కడ చదువు ఆగిపోతుందోననే భయంతో జాగ్రత్తగా చదివేదాన్ని. కాలేజీలో చదువుతూనే చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెప్పి నాలుగు వందల రూపాయలు సంపాదించేదాన్ని. నా ఖర్చులు పోను, చెల్లెళ్లకు, తమ్ముడికి చిన్నచిన్న కానుకలు కొని ఇచ్చేదాన్ని. అలా చేయడం ఎంతో సంతోషంగా ఉండేది. డిగ్రీ అయిన తర్వాత బీఎల్‌ చేయాలనేది నా కోరిక. లాసెట్‌ రాశాను. పద్మావతీ యూనివర్సిటీలో సీట్‌ వచ్చినా ఆర్థిక ఇబ్బందుల వల్ల నాన్న చదివించలేదు. దాంతో ప్రముఖ గ్రానైట్‌ కంపెనీలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా చేరాను. రెండు వేల రూపాయల జీతం. మొదటి జీతం అందుకున్న రోజు నా ఆనందానికి అంతేలేదు. జీతాన్ని ఇంటి అవసరాల కోసం అమ్మకు ఇచ్చేసేదాన్ని. నా ఖర్చుల కోసం అయిదువందలు తీసుకునేదాన్ని. చెల్లెళ్లకు, తమ్ముడికి పుస్తకాలు కొనడానికీ, వాళ్ల చిన్నచిన్న సరదాలు తీర్చడానికి నా జీతం సరిపోయేది. అలా ఓ సంవత్సరం ఆనందంగా గడిచిపోయింది.బతకనివ్వండి.. ప్లీజ్‌!!!

ఒకరోజు ఎండీగారి తమ్ముడు ఏదో పనిమీద తన రూమ్‌లోకి పిలిచాడు. నేనంటే చాలా ఇష్టమని, ఒకసారి తనతో గడపాలనుందని నవ్వుతూ చెప్పాడు. నాకు ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలినట్టుగా అనిపించింది. ఇలాంటి వాడికి నేను నచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. అప్పటివరకు నాతో అలా ఎవరూ మాట్లాడలేదు. అబ్బాయిలతో పెద్దగా మాట్లాడిన అనుభవమూ నాకు లేదు. నా స్నేహితుల అన్నయ్యలతో అప్పుడప్పుడూ మాట్లాడినా వాళ్లందరూ ఎంతో మర్యాదగా మాట్లాడేవాళ్లు. అందుకే ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయాను. తర్వాత రెండు రోజులు ఒంట్లో బాగాలేదని ఆఫీసుకు వెళ్లలేదు. ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించాను. ఈ విషయం ఇంట్లో చెబితే వెంటనే ఉద్యోగం మానిపించేస్తారు. నా సంపాదన కుటుంబానికి చాలా అవసరం. కానీ డబ్బు కోసం దేనికైనా దిగజారే స్థితికి నేను దిగజారలేదు. మాకు చిన్నప్పటి నుంచీ నాన్న ఒకటే చెప్పేవారు. ‘మీరు ఎలాంటి పరువు తక్కువ పనిచేసినా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చావాల్సిందే’ అనేవారు. ఆ మాటలు నాకు ఎప్పుడూ గుర్తుండేవి. నాన్న చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. మూడోరోజు ఆఫీసుకు వెళ్లగానే ఆ మహానుభావుడి రూమ్‌ నుంచి పిలుపు వచ్చింది. నేను లోపలికి వెళ్లి ధైర్యంగా అతని ప్రతిపాదన తిరస్కరించాను.

ఈ విషయాలు ఏవీ నేను ఇంట్లో చెప్పలేదు. చెబితే నాన్న నన్ను ఎప్పటికీ బయటకు వెళ్లనీయరు. నేను మళ్లీ ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. ఈసారి ఎక్కువమంది పిల్లలకు చెప్పడం ప్రారంభించాను. హఠాత్తుగా ఎందుకు ఇలా చేశానో అమ్మకూ అర్థంకాలేదు. కానీ విపరీతమైన పని వత్తిడి వల్ల అలా చేశానని అమ్మకు అబద్ధం చెప్పాను. ఈ విషయం ఒక్క ప్రాణ స్నేహితురాలికి మాత్రమే చెప్పాను. ఆ తర్వాత నా పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయాను. అప్పటినుంచీ డబ్బున్న వాళ్లంటే విపరీతమైన అసహ్యం. వాళ్లు డబ్బుతో దేన్నైయినా కొనేయాలనుకుంటారు. ప్రపంచమంతా వాళ్లకు డబ్బుమయంగానే కనిపిస్తుంది. కానీ నాకు జరిగిన అవమానానికి ఎన్నిసార్లు ఏడ్చానో చెప్పలేను. కష్టపడి పైకి వచ్చినవాళ్లు ఎవరూ అలా బిహేవ్‌ చేయరు. డబ్బులో పుట్టి డబ్బుతో పెరిగే వాళ్లకే ఇలాంటి అహంకారం ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ ఉద్యోగం నాకు ఉండి ఉంటే నాన్నకు కొంచమైనా అండగా ఉండేదాన్ని. కుటుంబ భారాన్ని కాస్తయినా తీసుకునేదాన్ని అనుకునేదాన్ని. ఇది జరిగి చాలా సంవత్సరాలైనా గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తుంది.  ఒక మధ్యతరగతి ఆడపిల్ల ఉద్యోగం పేరుతో బయటకు వచ్చిందంటే... తన శక్తిని తాను నమ్ముకునే కానీ తనను తాను అమ్ముకోవడానికి కాదని గుర్తించినప్పుడే మహిళలకు రక్షణ. ఈ విషయం ఇప్పటి వరకు నా భర్తకు కూడా చెప్పలేదు. ఎందుకంటే పెళ్లికి ముందు ఏదో జరిగే ఉంటుందనే ఉద్దేశంతో నన్ను పుట్టింటికి పంపేసే ప్రమాదం లేకపోలేదు కాబట్టి. ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే అమ్మాయిలను గౌరవించక పోయినా ఫర్వాలేదు. వాళ్ల మానాన వాళ్లను బతకనివ్వండి. ప్లీజ్‌...

- సంధ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు