అర్థం చేసుకో మామయ్యా!

నా పేరు బుజ్జి. మాది శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూరు. డిగ్రీ అయ్యాక మా ఊరికి దగ్గర్లోనే ఓ వ్యవసాయ సంబంధిత కంపెనీలోనే చిన్న ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైనదే కావడంతో చేస్తూ ఉన్నా... ఇంతలో నాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు మాటలు మొదలు...

Updated : 31 Dec 2018 19:29 IST

అర్థం చేసుకో మామయ్యా!

అర్థం చేసుకో మామయ్యా!

నా పేరు బుజ్జి. మాది శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూరు. డిగ్రీ అయ్యాక మా ఊరికి దగ్గర్లోనే ఓ వ్యవసాయ సంబంధిత కంపెనీలోనే చిన్న ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైనదే కావడంతో చేస్తూ ఉన్నా... ఇంతలో నాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు మాటలు మొదలు పెట్టారు. అమ్మ తరఫు బంధువుల్లో చేసుకుంటే మంచిదని కొందరు, నాన్న తరఫు బంధువుల్లో చేసుకుంటే మంచిదని కొందరు చెప్పారు. నాకు మా మామయ్య కూతురు గాయత్రీ అంటే ఇష్టం. పాత సినిమాల్లో సావిత్రిలా తను ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందరినీ గౌరవిస్తుంది. సౌమ్యంగా ప్రవర్తిస్తుంది. అయితే వాళ్లు మాకంటే కొంచెం ఉన్నవాళ్లు. పెళ్లి చేసుకుంటామని అడగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గాయత్రీతో నాకు చొరవ ఉండటంతో ఆ విషయం తనకే చెప్పా. ‘ఏమీ ఆలోచించకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది మా ఇంట్లో అడుగు’ అని చెప్పింది. నాకు ధైర్యం చాలలేదు. నేను మంచి ఉద్యోగం సంపాదించుకొని అడగాలనుకున్నా. ఈ మధ్య కాలంలో మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తన మీద ప్రేమ బలపడింది. ఇంతలో తను వాళ్ల నాన్నకు నేను పెళ్లి ప్రపోజల్‌ చేశానని చెప్పింది. మామయ్య సీరియస్‌ అయ్యాడు. మంచివాడని అనుకుంటుంటే ఇలా చేశాడేంటని కోప్పడ్డాడు. అదే మాటలు నాతోనూ అన్నాడు. నేను తలెత్తుకోలేకపోయా. నేను నేరుగా వెళ్లి మామయ్యనే అడిగింటే బాగుండేదేమో! నేను ముందు గాయత్రీతో చెప్పడం వల్ల మామయ్య అపార్థం చేసుకున్నాడు. నేను తనని ప్రేమలో దించానేమో అనుకొని కోప్పడ్డాడు. ఇక్కడ తన తప్పేం లేదు. అయినా తనని ఇంట్లోంచి బయటికి రానివ్వలేదు. నాతో మాట్లాడనివ్వలేదు. ఇక ఊర్లో ఉండలేకపోయాను. ఏడ్చాను. నాకు నేను సర్దిచెప్పుకున్నాను. గాయత్రీని ఎలాగైనా జీవిత భాగస్వామిగా పొందాలని నిర్ణయించుకున్నాను. ఊరికి దూరంగా వచ్చి చదువు మీద శ్రద్ధ పెట్టాను. బాగా చదివాను. మంచి స్థిరమైన ఉద్యోగం సంపాదించాను. ఊరికెళ్లి నేరుగా నేను ‘గాయత్రీని పెళ్లి చేసుకుంటాన’ని చెప్పాలనుకున్నా. అయితే నా మీద మామయ్యకు ఇంకా కోపం పోలేదని ఇటీవల ఓ పెళ్లిలో తెలిసిపోయింది. నా బాధ చూడలేక నా ప్రాణ స్నేహితుడు వెళ్లి మామయ్యతో మాట్లాడాడు. వాళ్లు నన్ను క్షమించినట్లే అనిపించింది. నన్ను ఇంటికి పిలిచారు. నా స్థితిగతులన్నీ కనుక్కున్నారు. నా ఉద్యోగం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి వివరించాను. కొన్ని అప్పులున్నాయని చెప్పాను. బాగానే మాట్లాడి పంపించారు. నాకంటే అదృష్టవంతుడు లేడని అనుకున్నా. గాయత్రీ ఎలాగైనా నా భార్య అవుతుందని సంబరపడిపోయా. ఈ ఘటన జరిగిన వారం రోజులకే నా నంబర్‌ బ్లాక్‌ లిస్టులో పెట్టారు. నన్ను ఇంటి దగ్గరికి రావద్దని చెప్పారు. ఏం జరిగిందో తెలియడం లేదు. గాయత్రీతో మాట్లాడితే... నువ్వు ఇంకోసారి వచ్చి ఇంట్లో అడుగు అంటోంది. నాకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మామయ్యా... నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు. గాయత్రీని నాకిచ్చి పెళ్లి చేయి. నీకంటే బాగా చూసుకుంటా. దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని