అవమానం మాపలేను కదా!

మాది మహబూబ్‌నగర్‌. ఇంట్లో అమ్మ, నేను, చెల్లి. నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అమ్మ ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగిణి. నెలకు వచ్చేదాంట్లోనే...

Updated : 31 Dec 2018 17:44 IST

అవమానం మాపలేను కదా!మాది మహబూబ్‌నగర్‌. ఇంట్లో అమ్మ, నేను, చెల్లి. నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అమ్మ ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగిణి. నెలకు వచ్చేదాంట్లోనే మమ్మల్ని చదివిస్తూ... ఎంతో బాగా చూసుకునేది. ఏనాడు నాన్న లేని లోటు తెలియనివ్వలేదు. చెల్లికి పోలియో. తనని నడిపించడానికి ఎన్ని ఆసుపత్రులకు తిరిగిందో నాకు తెలుసు. ప్రతినెలా 15వతేదీ జీతం రాగానే చెల్లికి, నాకు ఇష్టమైనవన్నీ తినిపించేది. చెల్లికి ఐస్‌క్రీం. నాకు నూడుల్స్‌. తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే ఉండేది. ప్రతీ నెలా రూపాయి...రూపాయి చూసి ఖర్చుపెట్టేది. మాకు కొత్త బట్టలు తీసి, తను పాత చీర కట్టుకొనేది. సంతలో సెకెండ్‌హ్యాండ్‌ చీరలు కొనుక్కొని అవి వాళ్ల అమ్మ చీరలని చెబుతుండేది. నేను ఇంటర్‌ దాటి డిగ్రీలో చేరాను.  చెడుఅలవాట్లేవి లేవు కాని... స్నేహితులెక్కువయ్యారు. వారితో ప్రతి ఒక్కటి పోల్చుకొని అమ్మను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేవాడిని. షూ, బెల్ట్‌, మోటర్‌సైకిళ్లు... ఇలా ప్రతి ఒక్కటీ నాకు లేవని బాధపడేవాడిని. అమ్మ ఏమో ‘మన పరిస్థితి అర్థం చేసుకోరా’ అంటూ నా ఆశలపై నీళ్లు చల్లేది. 2011 జనవరి ఫస్ట్‌ వస్తోంది. ఫ్రెండ్స్‌ అంతా కలిసి హైదరాబాద్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయాలని ప్లాన్‌ చేశాం. ఈ విషయం అమ్మకు చెప్పాను. అమ్మ మన దగ్గర డబ్బుల్లేవని చెప్పింది. నాకేమో వెళ్లి ఎంజాయ్‌ చేయాలని ఉంది. చాలా రోజులుగా అమ్మ చీటి వేసి దాచి పెడుతున్న డబ్బు రూ.20వేలు చేతికొచ్చింది. అమ్మ దాన్ని లెక్కపెట్టి దాచి పెట్టింది. నేను ఏమీ మాట్లాడకుండా అన్నం తిని పడుకున్నా. ఎన్నిటిని త్యాగం చేయాలి? నేను కొంచెమైనా జీవితం అనుభవించాలి కదా? అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. తెల్లారే సరికి అమ్మ దాచిపెట్టిన డబ్బులోంచి రూ.5వేలు తీసేసుకున్నా. ఆరోజు డిసెంబర్‌ 31. ఉదయాన్నే లేచి అమ్మా నా ఫ్రెండ్‌ కృష్ణ ఖర్చులన్నీ పెడతానన్నాడు. నేను హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి బయలుదేరా. అమ్మ నాచేతిలో అయిదొందలు పెట్టింది. దాన్ని చేతిలో చూసుకొని అవమానం మాపలేను కదా!కొంచెం కోపంగా నవ్వుకున్నా. అందరం హైదరాబాద్‌కు వెళ్లి నైటంతా బాగా తిరిగాం. ఆ రోజే తొలిసారిగా మందు తాగాం. ఫ్రెండ్‌ రూంకు వచ్చి పడిపోయాం. జనవరి ఫస్ట్‌ సాయంత్రం నిద్ర లేచాం. నైట్‌ అక్కడే ఉండి పొద్దున్నే ఇంటికి వెళ్లాను. అప్పటికే రాజేశ్‌గౌడ్‌ వచ్చి ఇంటి దగ్గర అమ్మను నానా మాటలు అంటున్నాడు. ‘అప్పు చేసినప్పుడు తెలియదు. ఎన్ని రోజులైంది తీసుకొని, అప్పుడిస్తా, ఇప్పుడిస్తా అంటూ రెండేళ్లైంది. ఈ రోజు కడతానన్నావ్‌? ఇప్పుడేమో అయిదువేలు తక్కువుందని బుకాయిస్తున్నావ్‌? మొత్తం కట్టు. లేకపోతే ఊరుకునేది లేదు’ అంటూ మండిపోతున్నాడు. అమ్మ తలదించుకుంది. వీధిలో అందరూ చూస్తున్నారు. ‘గౌడయ్యా... మీకిద్దామని రెండేళ్లు కష్టపడి చీటీ వేశాను. ఇరవైవేలు తెచ్చి ఇంట్లో పెట్టాను. కన్పించడం లేదు’ అని అమ్మ అంటుంటే ‘నోర్మూయమ్మా... మళ్లీ అబద్ధాలు’ అని కసురుకున్నాడు. అమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంది. నేనుచేసిన తప్పు వల్ల అమ్మ నానా మాటలు పడింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. అమ్మకు నిజం  చెప్పలేకపోయాను. అమ్మ నన్ను ఈ రోజు వరకూ ఆ డబ్బు ఏమైందని అడగలేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నా. ఎన్నోసార్లు అమ్మకు అంతకు మించిన డబ్బు ఎంతో ఇచ్చా. అయినా ఆరోజు జరిగిన అవమానాన్ని తుడిపేయలేకపోయా. ఏ సంవత్సరం జనవరి ఫస్ట్‌ వచ్చినా... ఇదే ఘటన నన్ను గుచ్చిగుచ్చి చంపేస్తుంది. అమ్మా నన్ను క్షమించు.

- జగదీశ్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని