పగలు షూటింగ్‌... రాత్రి సాఫ్ట్‌వేర్‌

నటుడు కావాలని అందరిలా కలలు కన్నవాడే. షార్ట్‌ఫిల్మ్స్‌ తీసి అవకాశాలకోసం ఎదురుచూసిన కుర్రాడే. ఆడిషన్స్‌కు వెళ్లి మోసపోయిన యువకుడే.

Updated : 31 Dec 2018 16:53 IST

‘బ్లఫ్‌మాస్టర్‌’ సత్యదేవ్‌

నటుడు కావాలని అందరిలా కలలు కన్నవాడే. షార్ట్‌ఫిల్మ్స్‌ తీసి అవకాశాలకోసం ఎదురుచూసిన కుర్రాడే. ఆడిషన్స్‌కు వెళ్లి మోసపోయిన యువకుడే. అయినా నిరాశపడలేదు. దొరికిన చిన్నపాత్రలతో నటుడై... నిరూపించుకొన్నాడు. ఇప్పుడు ‘బ్లఫ్‌ మాస్టర్‌’తో సోలో హీరోగా ఎదిగాడు విశాఖకు చెందిన సత్యదేవ్‌ కంచరన. పగలు ఉద్యోగం చేస్తూ... రాత్రి షూటింగ్‌లకు వెళుతూ కలలు నిజం చేసుకున్న సత్యదేవ్‌... తన ప్రయాణాన్ని ‘ఈతరం’తో పంచుకున్నాడు.

పగలు షూటింగ్‌... రాత్రి సాఫ్ట్‌వేర్‌

** కథ, దర్శకత్వం, హీరో
చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఓ పిచ్చి. ఏ సినిమా అయినా వదలకుండా చూసేవాడిని. అందులోని పాత్రలను చూసి నటన ప్రాక్టిస్‌ చేసేవాడిని. సినిమా రంగంలో ఎవరూ పరిచయం లేదు. మరి ఈ రంగంలోకి రావడం ఎలా? బాగా ఆలోచించి సొంతంగా షార్ట్‌ ఫిల్మ్స్‌ చేద్దామనుకున్నా. అవి ఎవరో ఒకరు చూసి నాకు సినిమాల్లో నటించే అవకాశం ఇస్తారని ఆశ. అలా ఇంజినీరింగ్‌ అయిన వెంటనే షార్ట్‌ ఫిల్మ్స్‌ మొదలుపెట్టా. నేనే కథ రాసుకొని, దర్శకత్వం చేస్తూ... నటించే వాడిని. ఫ్రెండ్స్‌ సహకరించేవారు.

** ఇంట్లో వాళ్లు ఎప్పుడూ కాదనలేదు
మాది విశాఖ. నేను విజయనగరంలోని మహరాజ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేశాను. నాన్న ప్రకటన రంగంలో రీజినల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌. అమ్మ గృహిణి. నా ఆలోచనలను ప్రోత్సహించేవారు. నా ఆశయాలను ఎప్పుడూ కాదనేవారు కాదు. అయితే సినిమాల వైపు వెళ్లి జీవితం పాడు చేసుకుంటాడేమోనని భయపడేవారు. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. తర్వాత బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌  ఇంజినీర్‌గా ఉద్యోగం చేశా.

** రెండొందలు కట్టించుకొని మోసం
సినిమాల మీద పిచ్చితో షార్ట్‌ఫిల్మ్స్‌ తీసుకుంటూ ఉండే వాడినే. విశాఖలో ఏదో ఓ హోటల్‌లో ఎవరో ఒకరు ఆడిషన్స్‌ అని పేపర్లో ప్రకటనలిచ్చేవారు. అక్కడికి వెళ్తే.... రూ.200, రూ.500 కట్టించుకొని ఫొటోలు తీసుకునేవారు. మరుసటి రోజు ఆడిషన్స్‌కు పిలిచేవారు. పిచ్చిపిచ్చి నటనలన్నీ చేయించేవారు. తర్వాత మళ్లీ కన్పించేవారు కాదు. ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసేవారు. ఇలా ఎన్నోసార్లు దెబ్బతిన్నాను.

**  జాబ్‌చేస్తూ... ఆడిషన్స్‌కు
బెంగళూరులో జాబ్‌చేస్తూ... శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కు వచ్చి ఆడిషన్స్‌కు హాజరయ్యేవాడిని. ఎన్నో ప్రొడక్షన్‌ ఆఫీసుల చుట్టూ తిరిగాను. తిరస్కారాలు, తిట్లు మామూలే. అవన్నీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ నేను నచ్చననే సత్యం నాకు తెలుసు. కానీ ఎక్కడో నమ్మకం కచ్చితంగా నటుడిని అవుతానని. అలా ప్రయత్నిస్తుండగా... 2011లో మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ సినిమాలో చిన్న పాత్ర వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుందా... సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను. ఉద్యోగం చేస్తూ.. షూటింగ్‌ ఉన్నప్పుడు సెలవులు పెట్టుకొనే వాడిని. నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరం 2015. పూరి జగన్నాథ్‌ గారి ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో ప్రధాన పాత్ర దొరికింది. చాలా సంతోషపడ్డాను. ఉద్యోగం మాత్రం వదలలేదు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకూ షూటింగ్‌, రాత్రి 8గంటల నుంచి ఉదయం 6వరకూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. 55 రోజులు ఇలాగే మెయింటెన్‌ చేశాను. రోజుకు రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడిని. నా ముఖంలో పెద్దగా అలసట కన్పించేది కాదు. అందుకే నేను ఉద్యోగం చేస్తున్నానని పూరిగారికి చాలా రోజుల తర్వాతే తెలిసింది. ఆ సినిమాకు నేను పడిన కష్టానికి తగిన గుర్తింపే వచ్చింది. క్షణం, ఘాజీ, అప్పట్లో ఒకడుండేవాడు... లాంటి సినిమాల్లో అలా ఉద్యోగం చేస్తూనే నటించాను. బ్లఫ్‌ మాస్టర్‌ మొదలయ్యాక... ఇక కుదరదని ఏడాదిన్నర క్రితమే రిజైన్‌ చేశాను.

** బ్లఫ్‌ మాస్టర్‌
ఇది సామాన్య మధ్యతరగతి ప్రజల అత్యాశ చుట్టూ తిరిగే కథ. దీనివల్ల కలిగే నష్టాలు, ప్రస్తుత సమాజంలో ఈజీ మనీ కోసం జరుగుతున్న మోసాలు లాంటివి ఆకట్టుకునే విధంగా చెప్పారు దర్శకుడు గోపీ. గొంగలి పురుగులాంటి యువకుడు సీతాకోక చిలుకలా మారడానికి తలెత్తిన పరిస్థితులు ఇందులో చూపించాం. ఎలాంటి అంచనాలు లేని, ఒక సామాన్యుడిలా కన్పించే హీరో కావాలని గోపీగారు వెదుకుతున్నప్పుడు నేను కలిశాను. ఆయన నా మీద నమ్మకంతో ఎంతో అద్భుతంగా ఈ చిత్రం తీశారు. డిసెంబరు నెలలో నేను నటించిన రెండు సినిమాలు ‘అంతరిక్షం’, ‘బ్లఫ్‌మాస్టర్‌’ రిలీజ్‌ కావడం నా జీవితంలో మరిచిపోలేని విషయాలు.

 

జీవితాలు పోగొట్టుకోవద్దు

అమ్మానాన్నలకు మన మీద ఎన్నో ఆశలుంటాయి. మన లక్ష్యాల కోసం వాటిని వమ్ము చేయకూడదు. బాగా చదువుకొని, ఉపాధి వెదుక్కొని సినిమాలు ట్రైచేయండి. నేను అలా ప్లాన్‌ ప్రకారం చేశాను కాబట్టి. ఎప్పుడూ పస్తులుండలేదు. అమ్మా, నాన్నలను బాధ పెట్టలేదు. స్థిర ఆదాయం ఉండటంతో సినిమా అవకాశాలు వచ్చినా, రాకపోయినా నైరాశ్యంలోకి వెళ్లలేదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని