అత్తెసరు జీవితం నుంచి ఆర్థిక పాఠాల దాకా..

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌). ప్రపంచంలోని దిగ్గజ వాణిజ్య సంస్థలకే దిక్సూచిలా పనిచేసే అంతర్జాతీయ సంస్థ ఇది. ఆ సంస్థ తన సృజనకు మరింత పదును పెట్టాలని ఓ ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

Updated : 05 Jan 2019 00:24 IST

ఆర్థికవేత్తగా తెలుగు కుర్రాడి సత్తా

అత్తెసరు జీవితం నుంచి ఆర్థిక పాఠాల దాకా..

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌). ప్రపంచంలోని దిగ్గజ వాణిజ్య సంస్థలకే దిక్సూచిలా పనిచేసే అంతర్జాతీయ సంస్థ ఇది. ఆ సంస్థ తన సృజనకు మరింత పదును పెట్టాలని ఓ ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

రంజిత్‌రెడ్డి చల్లా. వరంగల్‌ జిల్లా శాయంపేట మండలం మైలారానికి చెందిన సామాన్య మధ్యతరగతి యువకుడు. తండ్రి జైపాల్‌రెడ్డి ఆర్టీసీలో మెకానిక్‌గా ఉంటూ ఇటీవలే గుమాస్తా అయ్యారు. అమ్మ శకుంతల గృహిణి. ఖర్చుల కోసం కాలేజీలోనే రెస్టారెంటులో పార్ట్‌ టైం ఉద్యోగం చేశాడు రంజిత్‌.

రెండు విషయాలకు సంబంధం ఏంటనేగా మీ ప్రశ్న. ఉంది. డబ్ల్యూఈఎఫ్‌ చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో మన రంజిత్‌ పనిచేయనున్నాడు మరి. స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్న ‘బిజినెస్‌ ఎంగేజ్‌మెంట్‌ ఆపరేషన్‌ స్పెషలిస్టు’గా ఎంపికయ్యాడు. అసలేంటీ ప్రాజెక్టు? తెలుగుకుర్రాడు రంజిత్‌ ఎలా ఎంపికయ్యాడో తెలుసుకుందామా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక బహుళ జాతి సంస్థలకు డబ్ల్యుఈఎఫ్‌ సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. వాణిజ్యంలో నెంబర్‌వన్‌గా నిలవడానికి సహకరిస్తుంటుంది. మన దేశంలో దిగ్గజ సంస్థలైన రిలయన్స్‌, ఆదిత్య బిర్లా, టాటా, నెస్లీ, ఐటీసీ లాంటివి కూడా డబ్ల్యుఈఎఫ్‌ సలహాలు తీసుకొంటాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఇన్నాళ్లూ కస్టమర్‌ సర్వీస్‌, కస్టమర్‌ రిలేషన్స్‌ అనే పంథా కొనసాగింది. ఇప్పుడు వినియోగదారులకు లాభం చేకూర్చే ‘కస్టమర్‌ సక్సెస్‌ మేనేజ్‌మెంట్‌’ అనే కొత్త పంథా ముందుకొచ్చింది. ఈ కొత్త పోకడను అభివృద్ధి చేసేందుకు డబ్ల్యుఈఎఫ్‌ పైలట్‌ ప్రాజెక్టుగా ‘బిజినెస్‌ ఎంగేజ్‌మెంట్‌ ఆపరేషన్‌’ అనే విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో రంజిత్‌ను స్పెషలిస్టుగా ఎంపిక చేశారు. ఆడియో, వీడియో, మానవ వనరుల రౌండ్ల వారీగా ఇంటర్వ్యూ చేశారు. విశాల దృక్పథాన్ని పరీక్షించారు. ‘నువ్వసలు ఎందుకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నావు?’ అని అడిగారు. ‘ఇదో అద్భుతమైన సంస్థ అని, ఈ గొప్ప సంస్థ ఒక యంత్రం అనుకుంటే అందులో నేనో బోల్టుగానైనా ఉండాలనేది నా లక్ష్యం’ అని చెప్పి వారిని మెప్పించాడు రంజిత్‌.
 

డబ్ల్యుఈఎఫ్‌లో పనిచేయడానికి తలపండిన ఆర్థికవేత్తలు పోటీపడతారు. కంపెనీల్లో దశాబ్దాల పాటు అపార అనుభవం ఉండి, ఉన్నత హోదాలో కొనసాగిన వారినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. మొత్తం 25 మంది భారతీయులు డబ్ల్యుఈఎఫ్‌లో పనిచేస్తున్నారని అంచనా. సరికొత్త వ్యాపార మెలకువలు ఆలోచించి బడా కంపెనీల్లో కొత్త వాణిజ్య పంథాను సృష్టించడమే నా ముందున్న కర్తవ్యం.

- రంజిత్‌రెడ్డి చల్లా

రెస్టారెంట్‌లో పనిచేస్తూ..
డిగ్రీ వరకు హన్మకొండలో చదివిన రంజిత్‌ మొదటి నుంచి భిన్నంగా ఆలోచించేవాడు. డిగ్రీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడు. అప్పుడంతా బీటెక్‌లో చేరకూడదా? అన్నారు. అయినా వెనుకడగు వేయలేదు. ఇష్టమైనదే చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. డిగ్రీ అవ్వడంతోనే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో కొలువు సంపాదించాడు. తర్వాత మరో సంస్థలోకి మారాడు.  తర్వాత స్విట్జర్లాండ్‌లో లాసన్నె విశ్వవిద్యాలయంలో ఎంబీయేలో చేరాడు. ఇక్కడికొచ్చాక ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఈఎఫ్‌)లో ఎలాగైనా ఉద్యోగం చేయాలని సంకల్పించాడు. ఆ ఉద్యోగం అంత సులువుగా రాదు. ఫ్రెంచ్‌ భాషపై మంచి పట్టు ఉండాలి. కష్టపడి ఫ్రెంచ్‌ నేర్చుకున్నాడు. నాలుగు సార్లు దరఖాస్తు చేసినా సంస్థ నుంచి ఎలాంటి స్పందనా లేదు. అప్పటికే రెండేళ్లు చేయాల్సిన ఎంబీయే మూడేళ్లు పట్టింది. మొదటి సంవత్సరం నాన్న, అక్క స్వప్న, బావ  రాజేశ్వర్‌రెడ్డిలు ఆర్థికంగా చేయూతనిచ్చారు. అయినా ఇంకా వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడు. అందుకే యూనివర్సిటీ రెస్టారెంటులో రెండేళ్లు పనిచేసి ఖర్చుల కోసం సంపాదించుకుంటూ చదువుకున్నాడు. అయిదోసారి దరఖాస్తు చేసుకొన్నాక కొలువు వరించింది.

- జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని