ప్రేమ జ్ఞాపకం... పీడకల కాదు

కనుమ... ఉదయం నుంచి ఒకటే హడావిడి. వడలు, చికెన్‌, మటన్‌, బిర్యానీ... ఇవన్నీ తినని వారికోసం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌...అన్ని వండుకోవడం.. బంధువులందరికీ వడ్డించడం... ఒకటే పని. అంతా అయ్యే సరికే మధ్యాహ్నం 3 గంటలైంది.

Published : 19 Jan 2019 00:19 IST

ప్రేమ జ్ఞాపకం... పీడకల కాదు

నుమ... ఉదయం నుంచి ఒకటే హడావిడి. వడలు, చికెన్‌, మటన్‌, బిర్యానీ... ఇవన్నీ తినని వారికోసం ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌...అన్ని వండుకోవడం.. బంధువులందరికీ వడ్డించడం... ఒకటే పని. అంతా అయ్యే సరికే మధ్యాహ్నం 3 గంటలైంది. ఇంటికొచ్చిన బంధువుల పిల్లలంతా శిల్పారామం వెళ్తే బాగుంటుందని తీర్మానించారు. పిల్లలతో పాటు పెద్దలు కదిలారు. బైక్‌లు, ఆటోల్లో బయలు దేరి వెళ్లాం. అక్కడ పచ్చదనం, చెట్లు, వాటర్‌ ఫౌంటెన్లు మాలో అలసటని తరిమేశాయి. ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. నేనూ పిల్లలతో కలిసి ఆడాను. పాడాను. కబడ్డీ, కళ్లకాచీ, దాగుడుమూతలు, ముక్కుడు గిల్లీ, రన్నింగ్‌ రేస్‌, స్పూన్‌ లెమన్‌ ఆడేశాం. ఉయ్యాలలు ఊగేశాం. బోట్‌ షికార్‌ చేసేశాం. కూర్చొని అందరం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మసాల వడలు, తీపి వడలు తింటుంటే... మా చెల్లి ‘అన్నా అదుగో శ్రావ్య... అంటూ కళ్లు ఇంత పెద్దవి చేసి పక్కకు చూపించింది. తనే... శ్రావ్య. గతంలో మేమున్న అపార్ట్‌మెంటులోనే వాళ్లూ రెంట్‌కు ఉండేవాళ్లు. నా కళ్లలో మెరుపుని మా బంధువులంతా అప్పటికే గమనించారు. టక్కున లేచి దగ్గరకి వెళ్లాను. సాయంత్రం వెలుగుల్లో తన నవ్వు వెన్నెల తీరంలా కన్పించింది. నేను తనని చూసి సరిగ్గా 12 ఏళ్లు అవుతోంది. మళ్లీ ఒక్కసారైనా తను కన్పిస్తే చాలు అనుకుంటూనే బతికాను ఈ పన్నెండేళ్లు. ప్రేమ జ్ఞాపకం... పీడకల కాదుతనూ వాళ్ల బంధువులతో అక్కడకి వచ్చినట్లుంది. ‘ఎలా ఉన్నావ్‌ శ్రావ్య?’ అడిగాను తన కళ్లలోకి చూస్తూ. నా కళ్లలోని మెరుపు తనలోనూ కన్పించింది. సంతోషంగా నవ్వింది. ఎంత మంది పిల్లలు అన్నాను? ఇద్దరు అంటూ వాళ్లని నాకు పరిచయం చేసింది. మీ భర్త ఎక్కడ? అన్నాను. తను రాలేదంది. నా మనసుకు ఎందుకో కొంచెం ఆనందం. అలా గడ్డి మీద కూర్చొన్నాం. తను ఏం చేస్తోంది? భర్త ఏం చేస్తున్నాడు? పిల్లలు ఏం చదువుతున్నారు? లాంటి ప్రశ్నలన్నీ ముగిశాయి. తను నా గురించి అడిగింది. ‘మీ భార్య ఏం చేస్తుంటుంది? పిల్లలెంత మంది? అంది. నేను తలదించుకున్నాను. పక్కనే ఉన్న మా చెల్లి వచ్చి ‘అన్నయ్య ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకోమని చెబుతుంటే తప్పుకుంటూ ఉన్నాడు శ్రావ్య. చూడు ఇప్పటికే 30ఏళ్లు వచ్చాయి.’ అని నిట్టూర్చింది. నేను తలదించుకున్నాను. తనకి అర్థమైంది. మా ఇద్దరి మధ్య కాసేపు మౌనం. ఆ మౌనంలో ఎన్నో జ్ఞాపకాలు. తనని నేను ప్రేమించడం... తనూ నన్ను ఇష్టపడటం... మా విషయం తెలిసి వాళ్ల నాన్న నన్ను కొట్టడం... ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్లిపోవడం... చిన్న వయస్సులో ఏం చేయలేక, ఏం చేయాలో తెలియక మేమిద్దరం ఉండిపోవడం... సినిమాలో రీళ్లలా అలా తిరిగాయి. మౌనాన్ని చీలుస్తూ తనే మాట్లాడింది. ‘చూడు వరుణ్‌... ప్రేమ జ్ఞాపకం కావాలే కాని... పీడకల కాకూడదు. చిన్నప్పుడు ఏవేవో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? నువ్వు ఐఏఎస్‌ కావాలనుకున్నావు. ఇంజినీర్‌ అయ్యావు. అడ్జెస్ట్‌ కాలేదా? జీవితం మనకు నేర్పేది సర్దుకుపోవడమే. మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు. నేను సంతోషంగా ఉన్నాను. నువ్వూ పెళ్లి చేసుకో. వచ్చే సంక్రాంతికి నువ్వు జంటగా ఈ శిల్పారామం రావాలి’ అని పిల్లలను తీసుకొని తను నడుచుకుంటూ వెళ్లిపోయింది. నా మనసులోంచి కూడా హుందాగా! పన్నెండేళ్లుగా నా మనసు మోస్తున్న భారాన్ని దించేసి.

- వరుణ్‌కుమార్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని