ఎందుకిలా చేశావ్‌ చెల్లీ?

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రక్త సంబంధమే అవసరం లేదు. ఆత్మీయత ఉంటే చాలు. అది నాకు తెలియజేసిందీ, ఆ బంధంలోని తీయదనం నాకు రుచిచూపిందీ చిన్ని. నోరారా అన్నయ్యా అని

Published : 26 Jan 2019 00:21 IST

న్నా చెల్లెళ్ల అనుబంధానికి రక్త సంబంధమే అవసరం లేదు. ఆత్మీయత ఉంటే చాలు. అది నాకు తెలియజేసిందీ, ఆ బంధంలోని తీయదనం నాకు రుచిచూపిందీ చిన్ని. నోరారా అన్నయ్యా అని ముద్దుగా పిలుస్తుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేది. ఆ పిలుపు వినడానికి నా మనసు ఎదురు చూస్తూనే ఉంది.

చిన్నీ..! నా స్నేహితుడి మేనకోడలు. ఇద్దరిదీ నిజామాబాద్‌ జిల్ల్లా. ప్రతి సంక్రాంతి సెలవులకు తను తన అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేది. చిన్నీ వాళ్ల అమ్మమ్మ వాళ్లది మా పక్క ఊరే. అక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి. ఓసారి పండగకు నా స్నేహితుడు తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పుడే మొదటిసారిగా చిన్నీని చూశాను. చాలా మంచి అమ్మాయి. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. తన సందడితో పండగ నిజంగానే చాలా బాగా అనిపించింది. సాయంత్రానికి అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని ఇంటికి వెళ్తున్నపుడు ‘అన్నయ్యా ఆగు’ అంది. నా నంబరు అడిగి తీసుకుంది. ఊరెళ్లాక ఫోన్‌ చేసింది. ఇంట్లో వాళ్లనీ పరిచయం చేసింది. ప్రతి ఆదివారం తనతోపాటు తన ఇంట్లో వాళ్లతో మాట్లాడుతుండేవాడిని.  ఏడాది కాలం గిర్రున తిరిగింది. కాలంతోపాటు మా బంధమూ బలపడింది. పదో తరగతి ఫలితాలు వచ్చాయి. చిన్నీ స్కూలు టాపర్‌. మండలంలోనూ తనే మొదటి స్థానంలో నిలిచింది. తనతోపాటు మా ఆనందానికీ హద్దులు లేవు. ఉత్సాహంగా ఇంటర్‌లో చేరింది. హాస్టల్‌లో ఉండటంతో ఫోన్‌ అనుమతి లేదు. దీంతో సెలవుల్లో ఇంటికి వచ్చినపుడు మాట్లాడేది. ఆ సెలవుల్లో తన కాల్‌ కోసం ఎదురు చూస్తుండేవాడిని. ఒకరోజు ఎప్పటిలానే ఫోన్‌ వచ్చింది. అయితే తన నుంచి కాదు. సారాంశం- కళాశాలలో చిన్నీ కళ్లు తిరిగి పడిపోయింది. ఇంటర్‌ పరీక్షలేమో ఇంకో వారంలో ఉన్నాయి. వాళ్ల అమ్మానాన్న ఆసుపత్రిలో చూపించి, డాక్టర్‌ సూచన మేరకు స్థల మార్పిడి ఉంటుందని అమ్మమ్మ వాళ్లింటికి పంపారు. తనను చూడటానికి వెళ్లాను. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే చిన్ని ముఖం డీలా పడిపోయింది. బాధనిపించింది. ఏమైందని అడిగా. ‘చదువుపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నాను. ర్యాంకు తెచ్చుకోలేకపోతున్నా.’ అంది. ఈ చదువుల పోటీని కొంచెం తట్టుకోలేకపోతోంది. తనే నెమ్మదిగా అలవాటు పడుతుంది అనుకున్నా. అనవసరంగా కంగారు పడుతున్నావ్‌! మంచి మార్కులు వస్తాయి. అని ధైర్యం చెప్పా. నవ్వి తలూపింది. అయితే ఆ నవ్వులో మాత్రం ఎప్పుడూ ఉండే వెలుగు లేదు. తనూ అక్కడే నాలుగు రోజులుండి వెళ్లింది. తను వెళ్లిన వెంటనే, అక్కడి నుంచి ఫోన్‌ వచ్చింది. చిన్నీ ఆత్మహత్య చేసుకుందని విని నమ్మలేకపోయాను. వాళ్ల ఊరెళ్లాను.. అదంతా అబద్ధం అవుతుందనే ఆశతో.. నా ఆశ తీరలేదు.

చిన్నీ!! ఏం కష్టమొచ్చిందమ్మా? ప్రతిదీ పంచుకునే నీవు నీ మనసులో బాధని మాతో పంచుకోలేకపోయావా? మాదే తప్పేమో! ఎప్పుడూ కాంతులు నిండే నీ కంటిలో ఆ బేలతనం చూసినపుడే సరిగా ఆరా తీయాల్సిందేమో! చిన్నవిషయం అని తేలికగా తీసుకుంటే నిన్నే మాకు దూరం చేస్తుందనుకోలేదు.

- శంకర్‌ యాదవ్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని