నా చుట్టూ ఆమె జ్ఞాపకాలే

సికింద్రాబాద్‌ హరిహరకళాభవన్‌లో యువ-2005 కార్యక్రమం.. యువత కోలాహలంతో హాలంతా ఊగిపోతోంది. కాసేపటికి పాటల పోటీ మొదలైంది. ఒక్కో పేరు.. ఒక్కో పాట..

Updated : 02 Feb 2019 16:28 IST

సికింద్రాబాద్‌ హరిహరకళాభవన్‌లో యువ-2005 కార్యక్రమం.. యువత కోలాహలంతో హాలంతా ఊగిపోతోంది. కాసేపటికి పాటల పోటీ మొదలైంది. ఒక్కో పేరు.. ఒక్కో పాట.. ప్రవాహంలా సాగిపోతున్నాయి. ఇంతలో నా పేరు పిలిచారు. నాకు తెలియకుండా స్నేహితులే నా పేరిచ్చారని అర్థమైంది. కూని రాగం తప్ప మరే రాగం రాదు నాకు. అసహనంలో ఉండగా అనౌన్సర్‌ మైక్‌ చేతిలో పెట్టింది. ‘మా ఊళ్లో ఒక పడుచుంది..’ పాటందుకున్నా. పల్లవి పూర్తయ్యేటప్పటికి అందరూ చప్పట్లు. దిగిపొమ్మని కాదు. కోరస్‌గా మోగుతున్న కరతాళాలు. 55 మంది పోటీదార్లు. 10 మందిని ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. అందులో నా పేరుంది.

మర్నాడు.. ఫైనల్స్‌ మొదలయ్యాయి. పది మందిమీ వేదికపై కూర్చున్నాం. ‘కైకే పాన్‌ బనారస్‌ వాలా!’ పాడాలనుకున్నా. ఇంతలో ఓ అబ్బాయి అటుగా వచ్చి చేతిలో ఓ చీటీ ఉంచాడు. చూస్తే.. ‘ఉరికే చిలుకా వేచి ఉంటాను..’ శైలాబాను అని రాసుంది. మది నిండా ఆలోచనలే.. అంతలో నా పేరు పిలిచారు. చీటీలోని పాటే ఎత్తుకున్నాను. పాడినంత సేపూ నా కళ్లు హాలంతా వెతికాయి. ఆ పాట కోరిన వారు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

వేదిక దిగాక. అంతటా వెతికా! ఏనాటి జ్ఞాపకమో ఆమె! ముస్లిం అమ్మాయి. ఐదో తరగతిలో చిగురించిన స్నేహం మాది. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఎంతో ఎదిగింది. అప్పుడే బొంబాయి సినిమా రిలీజైంది. ఆ సినిమా నాకు బాగా కనెక్ట్‌ అయింది. అందులో హీరోయిన్‌ పేరు శైలాబాను. ఆనాటి నుంచి ఆమే నా శైలా. అలాగే పిలిచేవాణ్ని. తనూ పలికేది. కొంటెగా చూస్తే మొహమాటంగా నవ్వేది. దారికాస్తే.. తటపటాయిస్తూ దాటి వెళ్లేది. ‘ఉరికే చిలుకా..’ అని ఉడికిస్తే ఉన్నపళంగా ఉరికేది. తెలిసీతెలియని వయసులో చిగురించిన ప్రేమ అది. తొమ్మిదో తరగతిలో నేను స్కూలు మారాను. ఆమె ఊరే మారిపోయింది. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత చిన్న చీటీతో తన జాడ కనుక్కోమని సవాలు విసిరింది. ఈ ఆలోచనల్లో ఉండగానే.. వెనక నుంచి ‘శర్మ!’ అని పిలుపు. తిరిగి చూస్తే.. శైలా! అప్సరసలా ఉంది. ‘షుక్‌రియా జీ! ఆ పాట పాడినందుకు’ అంది. ‘కైసా హో శైలా?’ అనడిగా! ‘తుమ్‌ బోలో..’ అంటూ ప్రశ్నించింది. ‘బహుత్‌ ఖూబ్‌సూరత్‌..’.. ఇలా మా మధ్య మాటలు కోటలు దాటాయి.

హైదరాబాద్‌లోనే ఉంటున్నానంది. తను చదువుతున్న కాలేజీ పేరు చెప్పింది. ఎన్ని గంటలకు కాలేజీ అయిపోతుందో కూడా సమాచారం ఇచ్చింది. మూడు నెలల్లో ముప్ఫయ్‌ సార్లు కలిసుంటాం. డిగ్రీ ఫైనల్‌ ఎగ్జామ్‌. పరీక్ష పూర్తవ్వగానే ఆమె సెంటర్‌కి వెళ్లాను. నా కోసం ఎదురు చూస్తోంది. కాసేపు మాట్లాడుకున్నాం. మళ్లీ ఫలానా రోజు.. ఎప్పుడూ కలిసే చోట కలుద్దామనుకున్నాం. ఆ రోజు అక్కడికి వెళ్లాన్నేను. తను రాలేదు. రోజంతా ఉన్నా.. అయినా రాలేదు. మర్నాడు.. ఆ తరువాతి రోజూ అంతే! ఆనాటి నుంచి ఆరాలు తీస్తే కొన్నాళ్ల తర్వాత ఆమెకు పెళ్లయిపోయిందని తెలిసింది. ఆమె జ్ఞాపకాలు మాత్రం నేటికీ నాతోనే ఉన్నాయి. ఆమెను తలచుకున్నప్పుడల్లా ‘ఉరికే చిలుకా..’ పాట మనసులో మార్మోగుతూనే ఉంటుంది.

- రాజ్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని