రచనకు సాయంకాలం!

నగర జీవనంలో ముఫ్పయిమందికి పైగా (ఉత్తరభారతదేశం, తమిళనాడు, బెంగళూరు.. లాంటి ప్రదేశాల నుంచి వచ్చినవారు) ఒకేచోట కలవటం అంటే అదో అరుదైన విషయమే.

Updated : 02 Feb 2019 18:02 IST
శనివారం సాయంత్రం మూడుగంటలు... బంజారాహిల్స్‌లో ఉండే లామకాన్‌ టెర్రస్‌పైకి అబ్బాయిలు, అమ్మాయిలు క్యూ కట్టారు. ముప్ఫయిమంది ఒకటే చోట చేరి హాయ్‌ అంటూ పలకరించుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. వారెవరూ తెలిసినవాళ్లు కాదు.. ఒకచోట చదివినవాళ్లో, ఉద్యోగం చేస్తున్నవాళ్లో అంతకంటే కాదు. కానీ వీళ్లకి రాయటం ఇష్టం. రాసింది కథ అయినా కవిత అయినా ఎదురుగా ఉండే పదిమందితో పంచుకోవటం వీరికి భలే ఇష్టం. ఛాయ్‌ తాగుతూ, సమోసా తింటూ కూల్‌గా రాసుకుంటోన్న ‘రైట్‌ క్లబ్‌’ నిర్వాహకురాలు స్రవంతి తల్లూరి, అక్కడికొచ్చే రైటర్లను ‘ఈతరం‘ కలిసింది.

గర జీవనంలో ముఫ్పయిమందికి పైగా (ఉత్తరభారతదేశం, తమిళనాడు, బెంగళూరు.. లాంటి ప్రదేశాల నుంచి వచ్చినవారు) ఒకేచోట కలవటం అంటే అదో అరుదైన విషయమే. ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఎంబీఏ విద్యార్థులతోపాటు స్కూల్‌ పిల్లలూ ఉన్నారు. వీరంతా ఒకేచోట కూర్చుని సీరియస్‌గా ఆ రోజు ఇచ్చిన సెగ్మెంట్‌ను పూర్తి చేస్తారు. డిస్క్రిప్టివ్‌ రైటింగ్‌, కామెడీ, మూవీరైటింగ్‌.. ఇలా ప్రతివారం ఓ టాపిక్‌ను ఎంచుకుంటారు. ఆ టాపిక్‌మీద అక్కడే వచ్చింది రాస్తారు. రాసింది చదువుతారు. ఒకరు రాయలేకపోవచ్చు. కొత్తగా వచ్చినవారు బిడియపడొచ్చు. కొందరికి ఇంగ్లిష్‌ సరిగా రాకపోయుండొచ్చు. ఎన్ని తప్పులున్నా సరిచేస్తారు. ఎవరికి వారు మెరుగుపడతారు. ఎవరేం చెప్పినా ఓపిగ్గా వింటారు. సలహాలిస్తారు. కొందరి కామెడీ ఆలోచనలు విన్నాక పగలబడి నవ్వుతారు. రాతవిషయంలో అందరూ ఏకమవుతారు. ఈ యువతకి లామకాన్‌ ప్రాంగణం ఓ రచ్చబండ. ఎన్నో ఊసులు, ఆలోచనలు, ఆశయాలు కలబోసిన రచనా కూడలి ‘రైట్‌ క్లబ్‌’.

శనివారం సాయంత్రాన అక్షరాల వాన!
‘రైట్‌ క్లబ్‌’ కర్త, కర్మ, క్రియ స్రవంతి తాల్లూరి. బడికెళ్లే సమయంలో రాయటం తనకి అలవాటు. కాలేజీకెళ్లాక చదువుల్లోపడి రాతకు కామా పెట్టేసింది. బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. వారాంతాల్లో అక్కడ రచనపై ఆసక్తి ఉండేవాళ్లు కలిసేవాళ్లు. స్రవంతి కూడా వెళ్లేది. ఇంతలో ఆమె ఉద్యోగం హైదరాబాద్‌కి షిఫ్టు అయింది. ఇక్కడ రైటర్స్‌ క్లబ్‌ లేకపోవటంతో.. 2015 ఏప్రిల్‌ 11, శనివారం రోజు సాయంత్రం మూడుగంటలకు లామకాన్‌లో ‘రైట్‌ క్లబ్‌‘పేరిట ప్రారంభించింది. ఆరుగంటలకు పూర్తయ్యింది ఓ సెషన్‌. ఆ మొదటిరోజు పదకొండుమంది వచ్చారు. ఆ తర్వాత వస్తారో రారో అని కంగారు పడిందామె. వచ్చే వారమూ క్లబ్‌ అయ్యారు. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. ఐదుమంది వచ్చినా సరే ఒక్కవారం కూడా ఆపకుండా రైట్‌ క్లబ్‌ను నడుపుతోందామె. ‘యువతలో ఉండే గొప్పదనం ఏంటంటే.. ఏదైనా బావుంటే పదిమంది స్నేహితులకు చెబుతారు. అలా రచనాసక్తి ఉండేవాళ్లంతా లామకాన్‌ దారి పట్టడం ఆరంభించారు’ అంటుంది స్రవంతి. ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఫ్రెంచ్‌ టీచర్‌గా పనిచేసే పోర్చుగీసు మహిళ ఎలొయ్‌డా ప్రతివారం రైట్‌ క్లబ్‌కి హాజరవుతుంది. జనాలతో కలవటం బావుంటుంది. రాయటం ఛాలెంజింగ్‌గా ఉంటుందంటుందామె.

పుస్తకాలూ ప్రచురితమయ్యాయి..
2015 నుంచి ఇప్పటివరకూ ‘రైట్‌ క్లబ్‌‘ 180 సెషన్స్‌ పూర్తిచేసుకుంది. దాదాపు 2,500 మంది హాజయ్యారు. ప్రతివారం సగటున పాతికమంది వస్తారు. వచ్చినవారెవరైనా ఆ రోజు ఇచ్చిన టాపిక్‌తో కథో, కవితో, హైకూనో రాస్తారు. వాటిలో మంచి రైటింగ్స్‌ ఎంచుకుంటారు. రచయితతో కంటెంట్‌ను డెవలప్‌ చేయిస్తారు. ఇలా పదిమంది రచయితలతో ఇటీవలే ‘3పిఎమ్‌ టేల్‌’ అనే పుస్తకం వేసింది ఈ రైట్‌ క్లబ్‌. ఈ పుస్తకంలో 13 ఏళ్ల బాలిక నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తి వరకూ రాసిన కథలున్నాయి, కవితలున్నాయి. రెండేళ్లక్రితం 2016లో రైట్‌క్లబ్‌ మెంబర్లు రాసిన ‘హాఫ్‌ బ్లడ్‌ అండ్‌ ఇంక్‌’, ‘ఎన్‌కౌంటర్స్‌’ పుస్తకాలను అచ్చువేసింది. సభ్యుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపటానికే ఇలా చేస్తామంటోంది రైట్‌ క్లబ్‌ టీమ్‌.

నా జీవితంలో భాగం

రైట్‌ క్లబ్‌లో జాయిన్‌ అయిన రెండువారాల తర్వాత ఎవరైనా సరే ఓ సెషన్‌ను హోస్ట్‌ చేయవచ్చు. ప్రతిసారి కొత్తథీమ్‌ ఉంటుంది కాబట్టి ఇంట్లో రాసుకుని రాలేరు. ఇచ్చిన సమయంలో బాగా రాయటానికి ప్రయత్నిస్తారు. ఎడిట్‌ చేసుకునేంత సమయం ఉండదు కాబట్టి వచ్చిన ఆలోచనను చకచకా రాస్తారు. ఇక్కడికికొచ్చినవారు ఛానెల్స్‌, ఫిల్మ్‌రైటింగ్‌కి కూడా వెళ్లారు. ఈ క్లబ్‌ నాజీవితంలో ఓ భాగం. రైటర్స్‌ కమ్యూనిటీని బిల్డప్‌ చేయాలన్నదే నా లక్ష్యం’ అంటూ స్రవంతి చెప్పుకొచ్చింది.
- రాళ్లపల్లి రాజావలి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని