‘కొలువు’దీరా చదివాడు

ఒక్క ఉద్యోగానికే ఒక జన్మంతా ఎదురుచూసినా రాని కాలంలో ఏకంగా ఏడు ప్రభుత్వ కొలువులు సాధించడమంటే మాటలా? మూడు పదులు కూడా దాటని యువకుడు మాటలు కాదు చేతలేనని నిరూపించాడు....

Published : 09 Feb 2019 00:55 IST

- ఏడు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు

ఒక్క ఉద్యోగానికే ఒక జన్మంతా ఎదురుచూసినా రాని కాలంలో ఏకంగా ఏడు ప్రభుత్వ కొలువులు సాధించడమంటే మాటలా?
మూడు పదులు కూడా దాటని యువకుడు మాటలు కాదు చేతలేనని నిరూపించాడు. మొదటి నుంచి ఉన్నతశ్రేణి మార్కులు సంపాదిస్తూ వచ్చిన గంటా ప్రణీత్‌కుమార్‌ది ఖమ్మం నగరంలోని పాండురంగాపురం. ఏకాగ్రత, పట్టుదలతో విజయ పతాకాలు ఎగుర వేసిన ఈ యువకుడి తండ్రి వెంకట్రావు బయ్యారం మండలంలో ఈవోఆర్డీ, తల్లి సువర్ణ. ఎప్పటికైనా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో తన కొడుకు స్థిరపడాలనేది వెంకట్రావ్‌ ఆశ. దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ప్రణీత్‌. పది, ఇంటర్లలో 90 శాతానికిపైగా మార్కులతో ప్రతిభ చూపాడు. బీటెక్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తీసుకొని 80శాతం మార్కులతో పూర్తిచేశాడు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌(ఐఈఎస్‌)లో 131వ ర్యాంకు సంపాదించి మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశాడు. గట్టిగా చదివాడు. రోజూ 16 గంటలకు పైగా చదువుపైనే దృష్టి నిలిపాడు. తల్లిదండ్రులు సహకరించారు. అనుకున్నట్లే 7 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. ప్రస్తుతానికి ఐఏఎస్‌ లక్ష్యంగా సిద్ధమవుతున్నాడు.

‘‘టెక్స్ట్‌ బుక్స్‌ బాగా చదివేవాడిని. ప్రామాణికమైన పుస్తకాల నుంచి సమాచారం సేకరించి సొంత నోట్స్‌ తయారు చేసుకున్నా. రోజూ ఏకాగ్రతతో 16గంటలు చదివాను. రాత్రిపూట ఎక్కువగా రివిజన్‌కు కేటాయించేవాడిని. అన్నీ ఇంజినీరింగ్‌ సంబంధించిన ఉద్యోగాలే కాబట్టి సాధించేశాను. ఇప్పుడు ఐఏఎస్‌ అయ్యి నాన్న ఆశ నెరవేర్చాలని ప్రయత్నిస్తున్నా.’’

సాధించిన ఉద్యోగాలు ఇవీ...
* 2018లో ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌
* భారత్‌ పెట్రోలియం  కెమికల్స్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌
* తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖలో అసిస్టెంట్‌  ఇంజినీర్‌
* హైదరాబాద్‌లోని డీఆర్డీవోలో శాస్త్రవేత్త
*స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా జూనియర్‌ ఇంజినీర్‌
* బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌
* తంజావూరులో ఓఎన్‌జీసీలో ప్రస్తుతం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
* షేక్‌ లాలా, ఖమ్మం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని