రూబరూ రూటే వేరు

ఓ నలుగురు యువత కాఫీ షాపులో మాట్లాడుకుంటున్నారు..కాఫీ తాగి వాళ్లంతా రోడ్డుమీదకి వెళ్లారు. దారిలో నడుస్తూ వెళ్లే అపరిచిత వ్యక్తితో మాట్లాడారు. అతనో కార్పెంటర్‌ అని తెలిసింది. కార్పెంటర్‌ పని ఫలానా షాపులో ఉందని అక్కడి మేనేజర్‌తో మాట్లాడించారు....

Published : 16 Feb 2019 00:34 IST

హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతం.. 
ఓ నలుగురు యువత కాఫీ షాపులో మాట్లాడుకుంటున్నారు..కాఫీ తాగి వాళ్లంతా రోడ్డుమీదకి వెళ్లారు. దారిలో నడుస్తూ వెళ్లే అపరిచిత వ్యక్తితో మాట్లాడారు. అతనో కార్పెంటర్‌ అని తెలిసింది. కార్పెంటర్‌ పని ఫలానా షాపులో ఉందని అక్కడి మేనేజర్‌తో మాట్లాడించారు. ఇలా ఇద్దరు తెలీని వ్యక్తుల మధ్య ఓ వంతెన నిమిషాల్ల ºకట్టేశారు ఈ కుర్రోళ్లు. వీళ్లంతా రూబరూ నిర్వహించే ‘యూత్‌ కేఫ్‌’ లోని విద్యార్థులు. ఇన్‌స్టంట్‌ లైఫే తెలుసనుకునే కుర్రకారుకి అంతే ఇన్‌స్టంట్‌గా సాయం అందించే రూటుని పరిచయం చేస్తోందీ సంస్థ.

మెహదీపట్నంలోని గుడిమల్కాపూర్‌ మార్కెట్‌.. 
పాత దుస్తులు అమ్మే ఒకామె దగ్గరికి ఓ ముస్లిం అమ్మాయి వెళ్లింది. ‘అత్తరు వాసన పడలేద’ంది ఆ అమ్మకందారు. దీంతో ఆమెతో ముస్లిం అమ్మాయి గొడవపడింది. చూస్తుండగానే తిట్లు తారస్థాయికి వెళ్లాయి. అందరూ గుమికూడారు. నవ్వుతున్నారు. అట్లాగే చూస్తున్నారు. రోడ్డుమీద బైక్‌మీద వెళ్లేవారు బైక్‌ ఆపి మరీ ఆ చోద్యం చూస్తున్నారు. మరికొందరు సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తున్నారు. ఓ అబ్బాయి పెద్దాయన దగ్గరికెళ్లి కొట్లాట ఆపమని అడిగాడు. ‘మతగొడవలవుతాయి. హిందూ, ముస్లిం గొడవలోకి తలపెడితే అంతేనన్నా’డు. పదినిమిషాల తర్వాత వెంటనే పదిమంది యువత రంగంలోకి దిగారు. దుస్తులమ్మే అమ్మాయి, ముస్లిం అమ్మాయి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా రుబరూ పోలీసులతో ముందస్తు పర్మిషన్‌ తీసుకుని చేసిన ఓ సోషల్‌ ఎక్స్‌పర్మెంట్‌. అక్కడి వారంతా అవాక్కయ్యారు. ‘దయచేసి మీ ముందు ఇలాంటి గొడవలు జరిగితే వీడియో తీసి వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయకండి. ఇలా చేస్తే గోరంత విషయం కొండంతవుతుంది’ అంటూ మైక్‌లో ఓ అబ్బాయి చెప్పాడు. ఇలా  ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలంటుం రూబరూ!

ఏంటి ఈ రుబరూ? ముఖాముఖి అని అర్థం. నీతో నువ్వే మాట్లాడుకోవటం.. ఎదుటివ్యక్తి, సమాజంతో మాట్లాడటం.. ఇదొక్కటి యువతకి నేర్పితే చాలు. సమాజంలో మార్పు వస్తుందనేది ఈ సంస్థ నమ్మకం. హేమ ఖత్రి, నేహ, మోనీషా అనే ముగ్గురమ్మాయిల కల.. ఈ ‘రూబరూ’. వీళ్లంతా స్నేహితులు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ ఆర్గనైజేషన్‌ నడుస్తోంది.

అదే మా కల.. 
‘గతేడాది ఇంటర్‌ఫెయిత్‌ వాక్‌లో భాగంగా శివాలయం టెంపుల్‌ నుంచి దర్గాకి.. అక్కడనుంచి జైన్‌ మందిరానికి రూబరూ సభ్యులంతా వెళ్లారు. కుల,మత వైవిధ్యాన్ని ఆస్వాదించటం.. మత సామరస్యం, నకిలీ వార్తలను అర్థం చేసుకోవటం, అడ్డుకోవటం.., శాంతి సామరస్యాలను ప్రోత్సహించటం మా ధ్యేయం.  సమాజంలో కలుపుగోలుతనం ఉండాలి. అవేర్‌నెస్‌ కలిగించే ఏ సమాచారాన్నయినా పదిమందితో పంచుకోవాలి. సానుకూలతా దృక్పథం, మార్పు, ప్రశాంతం.. ఇవీ రుబరూ లక్ష్యాలు. అలాంటి అందమైన సమాజమే మా కల’ అంటూ హేమఖత్రి చెప్పుకొచ్చారు.

రూబరూ.. యువతకి అవకాశం ఇచ్చి అండగా నిలుస్తుంది. ప్రతి ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ వర్క్‌షాపులు నిర్వహిస్తుంది. ఇవి పూర్తిగా ఉచితం. కాలేజీ విద్యార్థులతో పాటు ఆసక్తి ఉండే యువత పాల్గొనవచ్చు. గత ఏడాది నుంచి ఫెలోషిప్‌ను ఇస్తోంది. 2016లో ‘క్వీన్స్‌ యంగ్‌లీడర్‌’ అవార్డును ఈ సంస్థ బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ నుంచి అందుకుంది. బాల్యవివాహాల్లో హైదరాబాద్‌ దేశంలోనే మూడోస్థానంలో ఉంది. దీంతో రుబరూ కొన్ని బస్తీల్లో ఉండే పాఠశాలలకు వెళ్లి వీటిపై అవగాహన కల్పించింది. ఇందుకుగానూ 2017లో జాతీయ అవార్డు అందుకుంది. గతేడాది ఇంటర్‌ ఫెయిత్‌కి గానూ ‘ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌ విజిటర్స్‌ ప్రోగ్రామ్‌’కి రుబరూను అమెరికన్‌ కాన్సులేట్‌ ఆహ్వానించింది. గత రెండేళ్ల నుంచీ రుబరూ కార్యక్రమాలను హైదరాబాద్‌లో ఉండే ‘ద బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషన్‌’ సహాయం చేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని