నా పిల్లలకు రిజర్వేషన్‌ వద్దు

అడవిలో ఆవులు కాసిన కుర్రాడు..చదువుకోవడానికి అయిదు కిలోమీటర్లు నడిచి వెళ్లినవాడు..

Updated : 23 Feb 2019 06:51 IST

పేదరికాన్ని చదువుతో ఓడించిన నాయక్‌

అడవిలో ఆవులు కాసిన కుర్రాడు..చదువుకోవడానికి అయిదు కిలోమీటర్లు నడిచి వెళ్లినవాడు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ పరిశోధకుడయ్యాడు. దేశంలో మేధో సంపత్తి హక్కుల (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌) మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందాడు. ముంబయి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో ఆచార్యులుగా ఉన్న ఆయనెవరు? ఆయన సాగించిన ప్రయాణం ఏమిటి? ఆయన ఆదర్శాలేంటి?

చదువుకోవాలనే శ్రద్ధను పేదరికం ఓడించగలదా? లేదు. జీవితంలో నిలదొక్కుకోవాలని తపనను వెనుకబాటు తనం జయించగలదా? లేదు. బాణావత్‌ కోటేశ్వరరావు నాయక్‌ జీవితమే ఇందుకు నిదర్శనం. గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండలం మారుమూల లింగంగుంట్ల తండాలో కోటేశ్వరావు నాయక్‌ జన్మించారు. బాగా చదువుకోవడానికి చేసే కృషి ఉన్నత స్థితికి చేరుకోవడానికి సోపానాలు పరుస్తుంది. నాయక్‌లోని తపనను చూసి తండ్రి చదివించాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అయిదు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేవాడు. ఏడోతరగతిలో చూపిన ప్రతిభకు బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో సీటొచ్చింది. నెల్లూరు ఏపీఆర్జేసీలో ఇంటర్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. గేట్‌ రాసి ఎస్సీ, ఎస్టీ విభాగంలో టాపర్‌గా నిలిచారు. బెంగళూరులో ఎంటెక్‌ చేరి మానేశారు. హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివి దిల్లీ ఐఐటీలో మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటిలెక్చువల్‌ ప్రాపర్టీ (ఐపీ) అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2008 నాటికి ఈ అంశంపై డాక్టరేట్‌ పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు.

చదువే గుర్తింపు... చదువులో రాణింపు
అమెరికాలోని ఐఈఈఈ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సొసైటీలో సభ్యత్వం పొందారు. తమిళనాడులోని తిరుచ్చి ఐఐటీ, ముంబయి ఐఐఎం లలో ఐపీ రైట్స్‌ కోర్సు రూపొందించి మొదలుపెట్టారు. ఇలా అనేక కోర్సులను డిజైన్‌ చేసి అందుబాటులోకి తెచ్చారు. 2016లో అబుదాబీలో ఐసీఎంఎస్‌ఈఈ నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డ్‌ అందుకున్నారు. అనేక పరిశోధన పత్రాలకు అవార్డులు పొందారు. ఈయన పరిశోధన పత్రాలను విదేశాల్లో 5 అధ్యాయాలుగా బోధిస్తున్నారు. భార్య హారికాప్రీతి గృహిణి కాగా పదేళ్ల లోపు ఇద్దరు కుమారులు జైఅమర్‌, పృధ్వీరాజ్‌. ఆర్థికంగా స్థిరపడిన నా కుటుంబానికి ఇక రిజర్వేషన్లు వద్దని రాయించి ఆదర్శంగా నిలిచారు.

‘పేదరికంలో ఉన్న నన్ను ప్రభుత్వం చదివించింది. అందుకే నాకున్న విజ్ఞానాన్ని ఈ దేశానికే అందించాలని విద్యారంగాన్ని ఎంచుకున్నాను. మేధోసంపత్తి హక్కుల మేనేజ్‌మెంట్‌ కోర్సుకు ఇప్పుడు డిమాండ్‌ ఉంది. దాన్ని డిజైన్‌ చేసి పలు సంస్థలకు అందించాను. నా పరిస్థితి ఇప్పుడు బాగుంది. వెనుకబడి ఉన్న ఒక్కరికైనా ఉపయోగం కలుగుతుందనే నాకుటుంబానికి  ఇక రిజర్వేషన్‌ అవసరం లేదని రాయించాను.’’

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని