...కాదనకు!

మా టెన్త్‌క్లాస్‌ ఫ్రెండ్స్‌ అంతా కలిసి పూర్వ విద్యార్థుల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ‘రే మామ... నువ్వు భోజనాలు చూడు, వాడు డెకరేషన్‌ చూస్తాడు. మేం అందర్నీ పిలుస్తాం.’ అని ఎవరెవరు ఏ బాధ్యతలు చూడాలో అనుకున్నాక... నేను ఆహ్వాన కమిటీలో సభ్యుడినయ్యాను. మన ఫ్రెండ్సంతా ఎక్కడెక్కడున్నారు?

Published : 02 Mar 2019 00:58 IST

మా టెన్త్‌క్లాస్‌ ఫ్రెండ్స్‌ అంతా కలిసి పూర్వ విద్యార్థుల సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ‘రే మామ... నువ్వు భోజనాలు చూడు, వాడు డెకరేషన్‌ చూస్తాడు. మేం అందర్నీ పిలుస్తాం.’ అని ఎవరెవరు ఏ బాధ్యతలు చూడాలో అనుకున్నాక... నేను ఆహ్వాన కమిటీలో సభ్యుడినయ్యాను. మన ఫ్రెండ్సంతా ఎక్కడెక్కడున్నారు? ఎవరెవరి ఫోన్‌ నంబర్లున్నాయి? చూసుకున్నాం. స్కూల్‌కెళ్లి మాతో పాటు పదోతరగతి చదివిన వారి జాబితా తీశాం. ఒక్కొక్కరి పేరు చదువుతూ... వారి గురించి జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నాం. కామెంట్లు, కాంప్లిమెంట్లతో.. నవ్వులు, సిగ్గులు... మా ముఖాలపై విరబూస్తున్నాయి. సులోచన... ఆ పేరు దగ్గర నా మనసు ఆగిపోయింది. ఫ్రెండ్సంతా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నాకేమీ వినిపించడం లేదు. పదోతరగతి రోజులను తవ్వుకొంటూ మది పరిగెడుతోంది. సులోచన మా క్లాస్‌లో చాలా కామ్‌గోయింగ్‌ అమ్మాయి. తన ఒద్దిక, నెమ్మదితనం నాకు ఇష్టం. రోజూ తన కోసం స్కూల్‌ ముందు ఎదురుచూడటం, సెలవులొచ్చినప్పుడు వాళ్లింటి ఎదుట ఉన్న బోరింగ్‌ దగ్గర కాపలా కాయడం నాకు అలవాటు. ఒక రోజు ధైర్యం చేసి ప్రేమ లేఖ రాసి తన నోట్స్‌లో పెట్టా. అది తను చదవకుండా... వాళ్ల నాన్న చదవడం నా చావుకొచ్చింది. వాళ్ల నాన్న నేరుగా వచ్చి హెడ్మాస్టర్‌కు కంప్లైంట్‌ చేయడం... నన్ను చావబాది వార్నింగ్‌ ఇవ్వడం జరిగిపోయాయి. తర్వాత తను స్కూల్‌కు రావడం మానేసింది. ప్రైవేటుగా పదోతరగతి రాసింది.

పరీక్షలప్పుడు తనని కలిసి క్షమాపణ అడుగుదామని ఎంతగా చూశానో కుదరలేదు. వాళ్ల నాన్న వెంటే ఉండటంతో.. నాకా అవకాశం చిక్కలేదు. తర్వాత మళ్లీ ఇప్పుడే...! తనని ఒక్కసారి చూస్తే బాగుండు అనిపించింది. ఫ్రెండ్సంతా గట్టిగా తడితే గానీ నేను ఈ లోకంలోకి రాలేదు. ‘వాళ్ల ఊరు దగ్గరే రా! వెళ్లి పిలుద్దాం పదా’ అన్నారు...  నా మనసులో మాట విన్నట్లు. ఆ మార్గంలో ఉండే మా స్నేహితుల ఇళ్లకి వెళుతూ అందరినీ ఆహ్వానిస్తూ సులోచన ఉండే పల్లెకు వెళ్లాం. నా గుండెలో ఏదో అలజడి. తన ఇల్లు వెదుకుతున్నాం. ఇంతలో ‘హాయ్‌... మల్లీ’ అంటూ పలకరింపు... కళ్లు పెద్దవి చేసి చూశాను. తనే! చీరకట్టులో కొంచెం పెద్ద మనిషిలా అన్పించింది. నాకు మాటలు రాలేదు. మా ఫ్రెండ్సంతా తనని పలకరించారు. అందరినీ ఇంటికి ఆహ్వానించింది. వెళ్లి కూర్చున్నాం. స్వీట్స్‌ పెట్టింది. కూల్‌డ్రింక్స్‌ తెప్పించింది. భోజనాలకు సిద్ధం చేస్తా అంటూ ఒకటే హడావిడి పడుతోంది. మధ్యమధ్యలో మా పదోతరగతి రోజులను గుర్తుచేసుకొంటోంది. పదిహేనేళ్ల తర్వాత తనని చూడటం... అలా ఉండిపోయానంతే! అప్పుడే తన ఇద్దరు పిల్లలు స్కూల్‌ నుంచి వచ్చారు. పరిచయం చేసింది. మా ఫ్రెండ్‌ శ్రీను... ‘మీ భర్త ఏం చేస్తున్నాడు?’ అన్నాడు. అంతవరకూ ఉరుకులు పరుగుల మీద ఉన్న సులోచన కొంచెం ఆగింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయి రెండేళ్లయిందని సులోచన అత్తగారు తన కొడుకు ఫొటో తెచ్చి చూపించారు. తన కళ్లలో తడి నా మనసుని ముంచేసింది. అందరం కొద్ది సేపు మౌనంగా ఉండిపోయాం. నేనక్కడ ఉండలేకపోయాను. బలవంతంగా ఫ్రెండ్స్‌ కూర్చోబెట్టారు. కొంచెంసేపు అలాగే ఉండి... పూర్వవిద్యార్థుల సమావేశానికి పిలిచి  వచ్చేశాం. తన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. నా మనసంతా తనే ఉంది.
సులోచనా!! నేనింకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఓకే అంటే నిన్ను చేసుకుంటాను. పిల్లలిద్దర్నీ బాగా చదివించి ప్రయోజకులను చేద్దాం. మన సమావేశం రోజునే ఈ విషయం నీకు చెబుతాను. దయచేసి కాదనకు...ప్లీజ్‌.!

ఇట్లు
- మల్లికార్జున (పేర్లు మార్చాం)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని