కొత్తగా సాగారు

సాధారణంగా పంటకయ్యే నీటి వినియోగంలో 20శాతం చాలు..ఎకరా విస్తీర్ణంతో సమానంగా సాగు చేయాలంటే ఖర్చు రూ.33వేలే..మానవ వనరుల అవసరం లేకుండానే పంటలు పండించొచ్చు....

Updated : 09 Mar 2019 00:50 IST

వ్యవసాయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ

సాధారణంగా పంటకయ్యే నీటి వినియోగంలో 20శాతం చాలు..ఎకరా విస్తీర్ణంతో సమానంగా సాగు చేయాలంటే ఖర్చు రూ.33వేలే..మానవ వనరుల అవసరం లేకుండానే పంటలు పండించొచ్చు..ఇదేంటి? ఇలా ఎలా? అని అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు తమ ఆవిష్కరణతో సమాధానాలు చెబుతున్నారు ఇంజినీరింగ్‌ విద్యార్థులు పుజేల్‌ అహ్మద్‌, పుల్లేశ్వరరావు, రామకృష్ణ.

వ్యవసాయమంటే ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. విత్తనాలు పోయడం దగ్గర నుంచి తడి కట్టుకోవడం.. కంటికి రెప్పలా కాచుకొని పంటను కాపాడుకోవడం వరకూ చాలా పనులుంటాయి. పైగా బోలెడంత పెట్టుబడి... ఎక్కువ మంది మనుషులు అవసరం. ఈ కష్టాలను అధిగమించడానికి పుట్టుకొచ్చిందే ‘స్మార్ట్‌ ఆర్కిటెక్చర్‌ విత్‌ వర్టికల్‌ ఫార్మింగ్‌’. చీరాల సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు స్మార్ట్‌ అర్కిటెక్చర్‌ విధానంలో ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) ఉపయోగించి ఈ సాగు విధానాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ రాష్ట్రస్థాయి పోటీలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు రూ.లక్ష నగదు బహుమతిని గెలుచుకుంది.

వలపందిళ్ల(షేడ్‌ నెట్‌) కింద వ్యవసాయం చేయడం ఇజ్రాయల్‌లో ఆనవాయితీ. ఇక్కడ ఈ విధానం ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది. మిరప నారుతో పాటు పూలమొక్కలను ఈ విధానంలో సాగుచేస్తున్నారు. ఈ విధానాన్నే మానవ రహితంగా మార్చిన విద్యార్థులు కర్షకులకు ఎంతో సాయం చేసిన వారయ్యారు.

విధానం : పైపులకు ఏర్పాటు చేసిన రంధ్రాల్లో మనకు కావాల్సిన రకం విత్తనాలను జనపనార, కొబ్బరిపీచుపై ఉంచాలి. ఈ విధానంలో మట్టి అవసరం ఉండదు. ట్యాంకు నుంచి నీటిని పైపుల ద్వారా వాటికి అందేలా చేస్తారు. సహజ వాతావరణం సృష్టించడానికి ఇందులో ఫ్యాన్లు, లైట్లు సైతం అమర్చారు. ఇవీ మానవ వనరుల ప్రమేయం లేకుండా అవసరానికి తగ్గట్లు పనిచేస్తాయి. ఈ పనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోవడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ సహకారంతో ప్రోగ్రామ్‌ రాసి ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తారు. ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో చూస్తూ పంటలను పర్యవేక్షించవచ్చు.

- జి.శ్రీరాములు, చీరాల


 

ఏపీటా(ఏపీఐటీఏ), నేషనల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ సంస్థ సహకారంతో ఇండస్ట్రీయల్‌ ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(టీవోటీ) ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఇందులో 44 బృందాలు తుది ఎంపికలకొచ్చాయి. మా కళాశాల నుంచి రూపొందించిన ప్రాజెక్ట్‌ రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకొంది. న్యూదిల్లీలో జరిగిన ప్రదర్శనలో వివిధ దేశాల వారు ప్రశంసించడం ఆనందంగా అనిపించింది. మా సీఎస్‌ఈ ప్రధాన విభాగాధిపతి పి.హరిణి, అధ్యాపకులు వీరాస్వామి పలు సూచనలు, సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు.

- పుజేల్‌ అహ్మద్‌, పుల్లేశ్వరరావు, రామకృష్ణ.

 

 

 
 

లాభాలు


*తక్కువ నీటి వనరుల్లోనూ పంటలు.
* కాలుష్యం చాలా తక్కువ.
* ఈ విధానంతో బహుళ అంతస్తుల్లోనూ కూరగాయలు, ఆకుకూరలను పండించుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని