అంకురానికి ఆయువు అవ్వాలంటే?

చేతికి వచ్చిన డిగ్రీ.. సరికొత్త ఆలోచనలు..ఉరిమే ఉత్సాహం..ఏదో సాధించాలనే తపన..వీటితో ఏదైనా స్టార్టప్‌లో జాయిన్‌ అవుతున్నారా?అయితే, ఇవి కచ్చితంగా పాటించండి. అప్పుడే మీ అపాయింట్‌మెంట్‌కి అర్థం ఉంటుంది...

Published : 16 Mar 2019 00:21 IST

స్టార్టప్‌ కోచ్‌

చేతికి వచ్చిన డిగ్రీ.. సరికొత్త ఆలోచనలు..ఉరిమే ఉత్సాహం..ఏదో సాధించాలనే తపన..వీటితో ఏదైనా స్టార్టప్‌లో జాయిన్‌ అవుతున్నారా?అయితే, ఇవి కచ్చితంగా పాటించండి. అప్పుడే మీ అపాయింట్‌మెంట్‌కి అర్థం ఉంటుంది.


 

ఫౌండర్‌ విశ్వసనీయత
మదిలో ఆలోచన పుట్టిన మరుక్షణం అంకుర సంస్థని  ప్రారంభించేస్తున్నారు. లోటుపాట్లపై ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. స్టార్టప్‌ల సక్సెస్‌ రేటు అంతంతమాత్రంగా ఉండటానికి కారణం ఇదే. అందుకే సంస్థ నిర్వాహకుల ట్రాక్‌ రికార్డుని చూడండి. గతంలో వారేం చేశారు? అనుభవం ఎంతో గ్రహించాలి. అంతేకాదు.. వారికున్న అంకిత భావాన్ని బట్టి భవిష్యత్తులో సంస్థని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో గ్రహించొచ్చు.


 

మీ పాత్ర ఏంటి?
నిర్వహణలో మీ పాత్ర ఏంటనే దానిపై స్పష్టత అనివార్యం. అది మీ అభిరుచి, సామర్థ్యానికి తగినదై ఉంటే మంచిది. అందరికీ బలాలు, బలహీనతలూ ఉంటాయి. ఎప్పుడైతే మీ బలాల్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించడానికి వీలు ఉంటుందో అప్పుడు స్టార్టప్‌కి మీరో భుజం కాస్తారు.


 

ఎదిగే వీలుందా?
స్టార్టప్‌లో మీరు భాగస్వామి కాకపోయినా.. కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా జాయిన్‌ అయినా సరే. చేస్తున్న పని మీ భవిష్యత్తుకి ఓ మెట్టుగా ఉపయోగపడాలి. అంతేకాదు.. మీ అభిరుచికి తగిన విభాగంలో పని చేస్తున్నప్పుడు    గుర్తింపు తప్పనిసరిగా వస్తుంది. అంచెలంచెలుగా ఎదిగేందుకు దారులు తెరుచుకుంటాయ్‌.



నేర్చుకోవడంలో చొరవ
మీకు అప్పగించిన పనిని పూర్తి చేయడంతో పాటు ఇతర పనుల్లోనూ అనుభవాన్ని సాధించేందుకు చొరవ తీసుకోవాలి. అప్పుడే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దీంతో అంకుర సంస్థ నిర్వహణలో మీదైన ప్రత్యేకత చూపించడానికి అవకాశం దొరుకుతుంది. అప్పగించిన ప్రాజెక్టులోనే కాకుండా మీరేదైనా చిన్న ప్రాజెక్టులో భాగస్వాములు కావటం మంచిది.


 

బృందానికి నమ్మకం కలిగించాలి
అంతా ఓకే అనుకున్నాక బృంద సభ్యులతో మాట్లాడండి. ఎందుకంటే.. ఒకసారి బృందంలో చేరాక రోజంతా వారితోనే కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఆలోచనల్ని పంచుకోవాలి. కొన్ని సార్లు విభేదించాల్సిరావచ్చు. అందుకే.. ముందే టీమ్‌పై మీకు నమ్మకం కుదురితే ప్రాజెక్టులో సగం పని ముగిసినట్టే.



‘నెట్‌వర్క్‌’ పెంచుకోవాలి
స్టార్టప్‌ సంస్కృతిలో మీరు అంటే మీ ఒక్కరే కాదు. మీ ‘నెట్‌వర్క్‌’ అంతా కలిపితేనే మీరని అర్థం. అంకుర సంస్థలో కొనసాగాలన్నా... మీరే సొంతంగా ప్రారంభించాలన్నా ఎంతో మందితో మాట్లాడాలి. మెప్పించాలి. ఒప్పించాలి. భాగస్వాముల్ని చేసుకోవాలి. పెట్టుబడులు సేకరించాలి.  దీనికి నెట్‌వర్క్‌, మానవ సంబంధాలు తప్పనిసరి.

- కోటిరెడ్డి సరిపల్లి కేజీవీ గ్రూప్‌ ఛైర్మన్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని