శ్రీమతికి అదే అసలైన బహుమతి

పని మీద హైదరాబాద్‌ వెళ్తున్నా. బస్సు వేగంగా వెళ్తోంది. అంతకుమించిన వేగంతో నా మెదడులో ఆలోచనల సుడులు. ‘నా పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తున్నావ్‌?’ అర్ధాంగి అడిగిన మాట పదేపదే గుర్తొస్తోంది. ఒక గిఫ్ట్‌ కోసం ఇంతగా ఆలోచించాలా అంటే రెండున్నరేేళ్లు వెనక్కి వెళ్లాలి.

Published : 30 Mar 2019 00:25 IST

మనసులో మాట

ని మీద హైదరాబాద్‌ వెళ్తున్నా. బస్సు వేగంగా వెళ్తోంది. అంతకుమించిన వేగంతో నా మెదడులో ఆలోచనల సుడులు. ‘నా పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తున్నావ్‌?’ అర్ధాంగి అడిగిన మాట పదేపదే గుర్తొస్తోంది. ఒక గిఫ్ట్‌ కోసం ఇంతగా ఆలోచించాలా అంటే రెండున్నరేేళ్లు వెనక్కి వెళ్లాలి.
ఓరోజు పొద్దునే బంధువొకాయన ఫోన్‌ చేశారు. ‘రేపు మనం పెళ్లిచూపులకు వెళ్తున్నాం’ అని. మరుసటి రోజు క్యాలెండర్‌లో డేట్‌ మారింది. నా జీవితం ఫేట్‌ కూడా. హాఫ్‌ శారీలో పెద్దగా అలంకరించుకోకుండా నా ముందుకొచ్చింది రజిత. బెరుగ్గా, సిగ్గుతో, అమాయకంగా ఉన్న తను కళ్లకే కాదు నా మనసుకూ నచ్చింది. ‘థాంక్స్‌.. టీ ఇస్తున్నందుకు కాదు. నా జీవితంలోకి వస్తున్నందుకు’ కప్పు అందుకుంటూ నా ఆమోదం చెప్పా. ఉన్నంతలో ఘనంగానే జరిగింది మా పెళ్లి.
తను ముగ్గురమ్మాయిల్లో పెద్దది. అమ్మా, తమ్ముడు, నేను మేం ముగ్గురం. తనకి గారాబం ఎక్కువ. కష్టం అనే మాట ఎరుగదు. వాళ్లది లంకంత ఇల్లు. మాది కష్టాల జీవితం. ఇరుకిరుకు అద్దె ఇల్లు. నేను నడుపుతున్న ఇనిస్టిట్యూటే కుటుంబానికి ఆధారం. అయినా నాకిది తక్కువైందని ఏనాడూ అన్లేదు. వస్తూనే అందరితో బాగా కలిసిపోయింది. ఇంత మంచి అమ్మాయి మనసు నొప్పించకూడదనుకున్నా. ‘నిన్ను భార్యలా కాదు.. కూతురిలా చూసుకుంటా’నని మాటిచ్చా.
అన్నిరోజులు ఒకేలా ఉండవు కదా. ఇంట్లో బేధాభిప్రాయాలొచ్చి కట్టుబట్టలతో బయటికొచ్చా. ఇనిస్టిట్యూట్‌కి దగ్గర్లోనే ఒక రూం తీసుకున్నాం. రూం అంటే కేవలం గదే. బయటికెళ్లి ఆరోజు సరుకులు తెచ్చుకున్నాం. పుట్టింట్లో మెత్తని పాన్పుపై పవళించే తను కటిక నేలపై పడుకోవాల్సిన దుస్థితి చూసి బాధేసింది. అయినా తనేం పట్టించుకోలేదు. నా గుండెల మీద తల ఆనించి ‘మీరేం బెంగ పడొద్దు. ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవులే’ అని ధైర్యం చెప్పింది. తను చెప్పినట్టే మా అదృష్టం బాగుండి వ్యాపారం బాగా నడవడంతో మెల్లిగా డబ్బు సమస్య తీరింది. ఇంట్లోకి సామాన్లు కొనుక్కోవడం.. వారాంతాల్లో సినిమాలు, షాపింగ్‌లు.. జీవితం జాలీగా సాగిపోతోంది.
ఆ సమయంలోనే మరో పిడుగు పడింది. ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసింది. అది నా వ్యాపారాన్ని కూల్చేసింది. నష్టాల పాలయ్యా. ట్యూటర్లకు జీతాలివ్వడానికి, రెంటుకి, కరెంటుకీ అన్నింటికీ కటకటే. మరోవైపు భాగస్వాములతో గొడవలు. ఇలాంటి సమయంలో మనం అమ్మానాన్నలం కాబోతున్నామంటూ తీపికబురు చెప్పింది. కనీసం ఆ సంతోషాన్నైనా సెలెబ్రేట్‌ చేసుకోలేని దుస్థితి. ‘బాధ పడితే కష్టాలు తీరవు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీకు ఇట్టే దొరుకుతుంది’ నాలో నమ్మకం నూరిపోసి పుట్టింటికెళ్లిపోయింది.
తన సూచన పాటించా. కష్టపడకుండానే హైదరాబాద్‌లో మంచి ఉద్యోగమొచ్చింది. సెటిలైనట్టే అనుకునేసరికి పాత  వ్యాపార భాగస్వామి బెదిరింపులు ఎక్కువయ్యాయి. డబ్బులివ్వకపోతే కేసు పెడతానని బెదిరించసాగాడు. ఎలాగని నాలో నేను మదనపడుతుంటే మళ్లీ నా రాజీనే ఆదుకుంది. ‘ఇవి తాకట్టు పెట్టి వాళ్లకు ఎంతో కొంత డబ్బులివ్వు. నువ్వు బాధ పడుతుంటే చూడలేను’ అని నగలు ఇచ్చింది. ఒంటి మీద సవరైనా బంగారం లేదని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు చిన్నచూపు చూస్తున్నా నా కోసం భరించింది.
ప్రస్తుతం కష్టాలన్నీ తొలగి ఓ స్థాయికి వచ్చాం. నా భార్య సహాయసహకారాలు లేకుండా ఇది జరిగేదే కాదు. తనను నా జీవితంలోకి ఆహ్వానిస్తే నాకు జీవితాన్నే ఇచ్చింది. నేను నిన్ను కూతురిలా చూసుకుంటాను అంటే నాకు తల్లిలా ధైర్యం చెప్పింది. నేను తనని బంగారం అని పిలిస్తే నన్ను గట్టెక్కించడానికి తన బంగారాన్నే తాకట్టు పెట్టమంది. అలాంటి నాలో సగానికి ఓ బహుమతి తీసుకొని ఊరు బయల్దేరా. తనని నా గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూ, ప్రతిక్షణం ఆమె కళ్లలో వెలుగు ఉండేలా జీవితాంతం చూసుకోవడమే తనకిచ్చే అసలైన బహుమతిగా భావిస్తున్నా.

- సతీశ్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని