అప్‌డేట్‌ అవ్వాలంటే..రీఫ్రెష్‌ చేయాలి!

రోజూ వాడే కంప్యూటర్‌ని పదే పదే రీఫ్రెష్‌ చేస్తుంటాం. మరి, లైఫ్‌ని రీఫ్రెష్‌ చేస్తున్నారా? పీసీలో గజిబిజిగా స్టోర్‌ అయ్యే డేటా మాదిరిగానే మనం కూడా.. బిజీ లైఫ్‌లో పడి ఎక్కడివక్కడే వదిలేస్తుంటాం.. మర్చిపోతుంటాం. అవి పెట్టుకున్న లక్ష్యాలు కావచ్చు.. ప్రేమించే మనుషులవ్వొచ్చు....

Published : 06 Apr 2019 00:14 IST

సెల్ఫ్‌చెక్‌'

రోజూ వాడే కంప్యూటర్‌ని పదే పదే రీఫ్రెష్‌ చేస్తుంటాం. మరి, లైఫ్‌ని రీఫ్రెష్‌ చేస్తున్నారా? పీసీలో గజిబిజిగా స్టోర్‌ అయ్యే డేటా మాదిరిగానే మనం కూడా.. బిజీ లైఫ్‌లో పడి ఎక్కడివక్కడే వదిలేస్తుంటాం.. మర్చిపోతుంటాం. అవి పెట్టుకున్న లక్ష్యాలు కావచ్చు.. ప్రేమించే మనుషులవ్వొచ్చు. ఇంకేదైనా!! కొత్త ఏడాదిలో త్రైమాసికం ముగిసింది.. రీఫ్రెష్‌ లేదా ఫ్రెష్‌గా స్టార్ట్‌ చేయడానికిదో చెక్‌ పాయింట్‌!! అందుకే ఎఫ్‌5ని (రీఫ్రెష్‌ షార్ట్‌కట్‌ కీ) నొక్కండి. చెక్‌ చేసుకోండి.

లైఫ్‌-1: ముందున్న సమయం, సామర్థ్యాన్ని వాడుకుని కష్టపడి పని చేసే క్రమంలో ఒత్తిడికి గురవుతుంటాం. అయినా ఎక్కడా తగ్గకుండా పుంజుకోవడానికి ప్రయత్నిస్తాం. దీంతో ఒత్తిడి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. చేసేది లేక బ్రేక్‌ తీసుకుంటాం. విహారానికి వెళ్లొస్తాం. అయినా ఎలాంటి ఉపశమనం దొరకదు. ఇక్కడ గ్రహించాల్సిందేంటంటే.. శక్తి, సామర్థ్యాలు హరించుకుపోవడానికి కారణాలు? దేని మూలంగా ఫోకస్‌ని కోల్పోతున్నాం? మానసికంగానా.. శారీరకంగానా అనేది అన్వేషించాలి. వాటిని రీఫ్రెష్‌ చేయాలి. అప్పుడే రీఛార్జ్‌ అవుతాం.

లైఫ్‌-2: ఉద్యోగం, పనిలో మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌లే అయ్యుండొచ్చు. కానీ, ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ని కోల్పోతుంటారు ఎక్కువ శాతం యువత. అలాంటప్పుడు దృష్టికోణాన్ని రీఫ్రెష్‌ చేయాలి. బుర్రలోని ర్యామ్‌ మొత్తం పాజిటివ్‌ దృక్పథంతో నింపాలి. ‘ఈ రోజు నాకేం నేర్పింది? నేను ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నా? ఇతరుల ఆసక్తుల్ని నేనెంత గౌరవిస్తున్నా? నన్ను ఇష్టపడుతున్నవారెందురు? నేను అభిమానించేవారెవరు?...’ లాంటి ప్రశ్నల్ని నిత్యం కంపైల్‌ చేస్తుండాలి. దీంతో ఎమోషనల్‌ ప్రోగ్రామ్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతాయి.

లైఫ్‌-3: గతం ఎన్నో జ్ఞాపకాల్ని ఇస్తుంది. చేదు, తీపి రెండూ ఉంటాయ్‌. తీపి జ్ఞాపకాల్ని హార్డ్‌డిస్క్‌లో భద్రం చేసుకోవచ్చు. చేదు జ్ఞాపకాల్ని మాత్రం డిలీట్‌ చేసి రీఫ్రెష్‌ చేయాల్సిందే. వాటికి ఎక్స్‌పైరీ డేట్‌ మీరే పెట్టుకోవాలంతే!! లేదంటే.. అవుట్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు బగ్స్‌ రూపంలో బాధిస్తుంటాయి. అందుకే.. నెగిటివ్‌ ఆలోచనలు, మనుషులు, వారి ద్వారా ఎదురైన చేదు అనుభవాలు అన్నింటినీ ఫార్మెట్‌ చేస్తేనే మరో ఫ్రెష్‌ లైఫ్‌ స్టార్ట్‌ అవుతుంది.

లైఫ్‌-4: బంధాల్ని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో ఎన్ని రోజులని మీరే తీసుకుంటారు. హార్డ్‌డిస్క్‌ నిండిపోయి సిస్టం హ్యాంగ్‌ అవుతుంది. అందుకే.. మనసుని రీఫ్రెష్‌ చేసి పొందిన దాని కంటే ఎక్కువే ఇవ్వండి. ఎందుకంటే.. ఎవరైనా మనం ఆశించినట్టుగా ప్రవర్తించడం లేదంటే.. వారికి మనం ఇస్తున్న ప్రేమ, అభిమానం సరిపోవట్లేదని అర్థం. ఇంకాస్త ఎక్కువ ఇవ్వండి. ఎదుటివారికి ఇవ్వడం వల్ల మీతో మీరే ప్రేమలో పడతారు. మీతో మీకు బలమైన రిలేషన్‌షిప్‌ ఏర్పడుతుంది.

లైఫ్‌-5: ‘నేను’ కంటే ‘మనం’ అనే పదాన్ని ఎక్కువగా కాపీ, పేస్ట్‌ చేయండి. అంతేకాదు.. ఇతరుల చెప్పుల్లో కాళ్లు పెట్టి నడవండి. అప్పుడే.. వారు ధరించిన వాటిల్లో ముళ్లున్నాయో.. మెత్తని స్పాంజ్‌లు ఉన్నాయో తెలుస్తుంది. ఇతరుల స్పందనల్ని అప్పుడే అర్థం చేసుకోగలరు. ప్రేమో, ఆఫీస్‌ వ్యవహారమో.. దేంట్లోనైనా చర్చించేటప్పుడు ప్రతిసారీ ‘మీరు’ అంటూ ఇతరులపై నిందలేయకుండా ‘నేను’ దగ్గరే ఆగి మీ వైపు కోణాన్ని వివరించండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని