నాడు నెచ్చెలి నేడు నా జాబిలి

పీజీ మొదటి క్లాసు. పాఠం వింటూ పరాకుగా తలతిప్పా. మోముపై పడుతున్న ముంగురుల్ని వయ్యారంగా చెవుల వెనక్కి తోస్తూ శ్రద్ధగా పాఠం వింటోందో అమ్మాయి. కోలమొహం.. ఛామనచాయ.. మొహం కళగా ఉంది.....

Updated : 13 Apr 2019 03:55 IST

పీజీ మొదటి క్లాసు. పాఠం వింటూ పరాకుగా తలతిప్పా. మోముపై పడుతున్న ముంగురుల్ని వయ్యారంగా చెవుల వెనక్కి తోస్తూ శ్రద్ధగా పాఠం వింటోందో అమ్మాయి. కోలమొహం.. ఛామనచాయ.. మొహం కళగా ఉంది.
పేరు నవ్య. ఊరు వరంగల్‌. చదువులో టాపర్‌. ఆరా తీస్తే వివరాలు తెలిశాయి. నా ఇంటర్‌, డిగ్రీల్లో చదువు ప్లస్‌ అందం ఉన్న అమ్మాయిలు అరుదు. అలాంటి వాళ్లతో దోస్తీ చేయడం నాకిష్టం. అలా అతి చొరవ తీసుకొని ఒకరిద్దరితో చీవాట్లు కూడా తిన్నా. అయినా నా అలవాటు నాదే. అదే ఉద్దేశంతో ఓరోజు క్లాసైపోగానే నవ్యని అనుసరించా. పరుగుపరుగున వెళ్లి తన ముందు నిల్చున్నా. ఒక్కసారిగా నా కళ్లల్లోకి చూసింది. ఆ చూపులకు బండరాళ్లను సైతం కోసేంత పదునుంటుందేమో! చప్పున తల దించుకున్నా. ‘ఏంటి విషయం? ఎందుకీ ఫాలోయింగ్‌?’ అంది. ‘నేనిక్కడికొచ్చింది చదువుకోవడానికి. మంచి ఉద్యోగం సంపాదించి కన్నవాళ్ల ఆశల్ని తీర్చడానికి. నా వెంట పడటం ఇక్కడితో ఆపెయ్‌’ దాదాపు వార్నింగ్‌ ఇచ్చింది. నామోషీగా ఫీలయ్యా.

చదువులో సగటు అయినా అందరితో కలిసిపోయే తత్వం నాది. మొదట్నుంచీ నాకు ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఓసారి మా క్లాసులో ఓ అమ్మాయి కళ్లు తిరిగి పడిపోయింది. టీచర్ల సాయంతో తనని హాస్పిటల్‌కి తీస్కెళ్లా. ఆమె దగ్గర డబ్బుల్లేకపోతే అప్పటికప్పుడే స్నేహితుల దగ్గర రెండువేల దాకా పోగేసి మందులకిచ్చా. ఆ అమ్మాయి నవ్య ఫ్రెండ్‌. ఆ సంఘటనతో నవ్యకి నాపై ఉన్న అభిప్రాయం మారింది. రాత్రి భోంచేస్తుండగా ఫోన్‌ చేసింది. ‘థాంక్స్‌ శ్రీధర్‌. నువ్వు లేకపోతే పాపం దాని పరిస్థితి ఏమయ్యేదో’ అంటూ మాట కలిపింది. అది మొదలు. అప్పుడప్పుడు యోగక్షేమాలు కనుక్కోవడం.. సబ్జెక్టులో సందేహాలు తీర్చుకోవడం..కలిసి క్లాసుకెళ్లడం మామూలైపోయింది.

నవ్యది ఎవరినీ నొప్పించని మనస్తత్వం. సాయానికి ముందుండేది. పైగా చదువుల తల్లి. ఇన్ని లక్షణాలున్న అమ్మాయిని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? రాన్రాను తనపై ఇష్టం ఎంతలా పెరిగిపోయిందంటే తనని తప్ప వేరొకర్ని భార్యగా ఊహించుకోలేనంత. కానీ ఎప్పుడైనా మా మాటల మధ్యలో ప్రేమ, పెళ్లి విషయం ప్రస్తావనకొస్తే వెంటనే టాపిక్‌ మార్చేసేది. తనంటే ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా ‘నో’ అంటుందేమోననే భయం. కానీ ఎన్నాళ్లిలా. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా. అది వేలంటైన్స్‌ డే రూపంలో వచ్చింది. పొద్దునే తనకి ఫోన్‌ కలిపా. ‘నవ్య నీకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. సాయంత్రం కలుద్దామా’ అన్నా. అసలే తెలివైన అమ్మాయి కదా. ఇట్టే కనిపెట్టేసింది. ‘ఐ లవ్యూ చెబుతావేమో. అదైతే మనం కలవాల్సిన అవసరం లేదు శ్రీ’ అంది. కన్నీళ్లొక్కటే తక్కువ నాకు.
ప్రేమ..పెళ్లి.. పేరెత్తితే తనకి ఎందుకంత చిరాకు? నవ్య ఫ్రెండ్‌నడిగా. ‘ఐదేళ్ల కిందట నవ్య వాళ్లక్క ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయింది. దాన్ని అవమానంగా భావించిన వాళ్ల నాన్న ఆత్మహత్యా యత్నం చేశారు. ఆ సంఘటన నవ్య కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే తనకి ప్రేమంటే పడదు’ అసలు విషయం చెప్పింది. ఆ మాటలతో  నా గుండె బరువెక్కింది. ఏదేమైనా నవ్యని వదులుకోవడం నాకిష్టం లేదు. ఎలాగని ఆలోచిస్తుండగానే ఫైనలియర్‌ సెమిస్టర్‌ పరీక్షలొచ్చాయి. ఫేర్‌వెల్‌ పార్టీ రోజు. ‘నవ్య ప్లీజ్‌ ఒక్కసారి నా గురించి ఆలోచించవా’ వేడుకున్నా. చెమ్మగిల్లిన కళ్లతో అక్కణ్నుంచి పరుగెత్తికెళ్లింది. యెస్‌.. నేనంటే తనకి తప్పకుండా ప్రేమ ఉందని అర్థమైంది. ఎలాగైనా తనని దక్కించుకోవాలనుకున్నా.

సీన్‌ కట్‌ చేస్తే. ఒకప్పటి క్లాస్‌మేట్స్‌మి ఇప్పుడు మేం భార్యాభర్తలం.పెళ్లై ఆర్నెల్లు దాటింది. ఇదంతా మా బావ చలవ. ఆయన దూరపు బంధువుది నవ్య వాళ్లూరు. ఆయన ద్వారా కథ నడిపించా. అదృష్టవశాత్తు  మా కులాలు ఒకటే. నాకు మంచి ఉద్యోగం ఉంది. కట్నం పట్టింపుల్లేవని చెప్పా. వంక పెట్టడానికేం లేదు. పెళ్లిచూపులకి రమ్మన్నారు. నన్ను చూడగానే తను కళ్లింతలు చేసుకుంది. సిగ్గుల మొగ్గై మురిసిపోయింది. ఆపై మూడుముళ్లు, ఏడడుగులు. ఒకప్పటి నా ఇష్టసఖి నా ఇంటివెలుగైంది. జీవితం సంతోషంగా గడిచిపోతోంది.

- శ్రీధర్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని