మన్నించు నేస్తమా

మాది విజయవాడ దగ్గర పల్లెటూరు. అమ్మానాన్నలకు ముగ్గురు పిల్లలం. అక్కా, అన్నయ్య, నేను. నా చిన్నతనంలోనే అక్కకు పెళ్లైంది. ఆ తర్వాత మేం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. చిన్నతనం నుంచీ స్నేహమంటే నాకు ప్రాణం. టెన్త్‌ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం దాకా కలిసి చదివిన నా ఫ్రెండ్‌ స్నేహ అంటే నాకెంతో ఇష్టం....

Published : 20 Apr 2019 00:22 IST

మాది విజయవాడ దగ్గర పల్లెటూరు. అమ్మానాన్నలకు ముగ్గురు పిల్లలం. అక్కా, అన్నయ్య, నేను. నా చిన్నతనంలోనే అక్కకు పెళ్లైంది. ఆ తర్వాత మేం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. చిన్నతనం నుంచీ స్నేహమంటే నాకు ప్రాణం. టెన్త్‌ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం దాకా కలిసి చదివిన నా ఫ్రెండ్‌ స్నేహ అంటే నాకెంతో ఇష్టం. తను మా ఇంట్లో  మనిషిలాగే కలిసిపోయింది. నాన్న అయితే ‘స్నేహ నా మూడో కూతురు’ అనేవారు. అలాంటిది ఒకబ్బాయిని ప్రేమించి, ఎవరితోనూ ఒక్కమాట కూడా చెప్పకుండా అతడితో వెళ్లిపోయింది. మూడేళ్ల తర్వాత ట్రైనింగ్‌ కోసం విజయవాడ వెళ్లాను. అక్కడ దీనస్థితిలో ఉన్న స్నేహ కనిపించింది. నేను తనను అసలు గుర్తుపట్టలేకపోయాను మనిషి పూర్తిగా మారిపోయింది. కళగా చూడచక్కగా ఉండే తను మొహమంతా పీక్కుపోయి అస్థిపంజరంలా తయారైంది. నన్ను పట్టుకుని ఏడ్చేసింది. ‘‘తనను నమ్మి అమ్మానాన్నలను వదిలి తప్పు చేశాను. పూర్తిగా మోసపోయాను. ఇద్దరు పిల్లల తండ్రయినా అతనికి బాధ్యత తెలియదు. ఊరినిండా అప్పులే. రోజూ మీ ఇంటికి వెళ్లి డబ్బు తెమ్మని గొడవే. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అమ్మానాన్నల సాయం అడిగాను. నా మొహం కూడా చూపించొద్దన్నారు’ అని ఏడ్చింది. తన దీనస్థితి చూసి నాకూ కన్నీళ్లు ఆగలేదు. ఎలాగైనా తనకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను హాస్టల్‌లో ఉండేదాన్ని. తనకూ ధైర్యం చెబుతూ ఉండేదాన్ని. ఒకరోజు నాకు ఫోన్‌ వచ్చింది. వెంటనే పరుగుపెట్టాను. అప్పటికే స్నేహ చనిపోయింది. నా పేరున ఒక లేఖ రాసింది... అందులో ‘‘నాకు ఎవరూ లేరు. నా పిల్లలని చూసుకో. ఇదే నా ఆఖరి కోరిక’’ అని ఉంది. నా స్నేహను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక నేను కళ్లు తిరిగిపడిపోయాను. కోలుకున్నాక... స్నేహ పిల్లల బాధ్యతను తీసుకున్నాను. కొంతకాలం తర్వాత నాన్న హైదరాబాద్‌ వచ్చేయమన్నారు. పిల్లల్ని కూడా హైదరాబాద్‌ తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ అన్నయ్య ఒప్పుకోలేదు. నాన్న నాకు హైదరాబాద్‌లో జాబ్‌ ఇప్పించారు. అప్పుడప్పుడు విజయవాడ వెళ్లి పిల్లల్ని చూసి వచ్చేదాన్ని. నా జీతాన్ని వాళ్ల కోసమే ఖర్చు చేసేదాన్ని. అప్పుడే లక్కీ పరిచయం అయ్యాడు. మా స్నేహం గురించి, నేను చేస్తున్న పని గురించి చెబితే ఎంతో మెచ్చుకున్నాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఒకరోజు లక్కీ విషయం నాన్నకు చెప్పాను. ‘‘లక్కీ గురించి వాకబు చేశాను. మంచివాడు కాదు మర్చిపో’’ అని నాన్న అన్నారు. నేను నాన్న మాటలు నమ్మలేదు. మా కులాలు వేరుకావడంతో కావాలనే అలా చెబుతున్నారకున్నాను. ‘‘లక్కీ చాలా మంచివాడు. నామీద తనకు ఎంత ప్రేమో నిరూపిస్తాను’’ అని చెప్పా. లక్కీ నెల రోజుల్లో స్టేట్స్‌కు వెళ్లిపోతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళతానని చెప్పాడని వివరించాను. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లక్కీ తీయలేదు. నా నంబరు బ్లాక్‌ చేశాడు. లక్కీతో మాట్లాడకుండా బతకడం అసాధ్యమనిపించి ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. నాన్న బతికించారు. కానీ పిచ్చిదాన్ని అయిపోయాను. అనుక్షణం అతడి ఆలోచనలే. ఇక లాభంలేదని ఒకరోజు లక్కీ కోసం వాళ్ల ఊరు వెళ్లాను. నాకోసం స్టేషన్‌కు రాలేదు. ఎదురుచూసి ఏడ్చి ఏడ్చి అలా స్టేషన్‌లోనే పడుకున్నాను. అప్పుడు ఫోన్‌ చేశాడు. ‘‘మీ నాన్న, అన్నపైన కేసు పెట్టు. నీ డీఎన్‌ఏ రిపోర్ట్‌ చూపించు. అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటా’’ అన్నాడు. ఆ మాటలతో అతడు ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో అర్థమైంది. నేను కేసు పెడితే నాన్న, అన్నల పరువు పోతుంది. నా వల్ల ఇంతమంది రోడ్డు మీదకు రావాలా అనుకున్నాను. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి... విజయవాడ వెళ్లి పిల్లల్ని చూశాను. ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానదిలో దూకబోయాను. అప్పుడు ఒక జంట నన్ను కాపాడింది. ‘‘నీ స్వచ్ఛమైన ప్రేమను గుర్తించలేని ఆ వ్యక్తి చావాలి కానీ నువ్వుకాదు’’ అని ఓదార్చారు. మా నాన్నకు కబురుపెట్టి నన్ను నాన్నతో జాగ్రత్తగా ఇంటికి పంపించారు. నాన్న వెంటనే లక్కీకి ఫోన్‌ చేసి నా ఆత్మహత్యా ప్రయత్నం గురించి చెప్పారు. ‘‘చస్తే చావని నాకేంటి’’ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. తన సమాధానంతో నా గుండె పగిలిపోయింది. తను ఎంతో గొప్పవాడనుకున్నాను. మోసపోయాను. ఒంటరిగా మిగిలిపోయాను. ప్రేమించినవాడు మోసం చేశాడు. చిన్నతనం నుంచీ ప్రాణమనుకున్న స్నేహితురాలూ నన్ను వదిలి వెళ్లిపోయింది. నా స్నేహకు ఇచ్చిన మాటనూ నిలబెట్టుకోలేక పోయాను. అన్ని విధాలుగా ఓడిపోయాను. నన్ను మన్నించు నేస్తమా...

- గీత

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని